– దేశాన్ని మత ప్రాతిపదికన విభజించే కుట్ర
– ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ మౌనం వీడాలి
– వాగ్దానాల అమలు కోసం ఉద్యమాలు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని కోటిరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో సోమవారం సీపీఐ(ఎం) జిల్లాస్థాయి విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డితో కలిసి తమ్మినేని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తమకు ఓటు వేయని ముస్లిం, మైనార్టీల పౌరసత్వాలను రద్దు చేసేందుకు దొడ్డిదారిన ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టిందని విమర్శించారు. బీహార్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో 65 లక్షల ఓట్లను తొలగించారని తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఓట్ల తొలగింపు పక్రియ చేపట్టనున్నారని చెప్పారు. ముఖ్యంగా తమకు ఓటు వేయని ముస్లింలు, క్రిస్టియన్లను పౌరసత్వం పేరుతో ఓట్లు తొలగించి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోందని విమర్శించారు. పౌరసత్వ నిరూపణ కోసం ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలకు అర్హత లేదని కేవలం తాత ముత్తాతల జన ధ్రువీకరణ పత్రాల ద్వారానే నిరూపించుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విధంగా మోడీ ప్రభుత్వం దేశాన్ని మత ప్రాతిపదికన విభజించే కుట్ర చేస్తోందన్నారు.
ఆపరేషన్ సింధూర్ విషయంలో అనేక అబద్దాలు చెప్పిందని, ఆ విషయంపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ నేరుగా చెబుతున్నా ప్రధాని మోడీ నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ట్రంప్ ఇతర దేశాలపై సుంకాలు 15 శాతం వేస్తే.. మన దేశం ఉత్పత్తులపై 25శాతం సుంకాలు విధిస్తున్నారని చెబుతున్న మోడీ ఖండించకపోవడం దారుణమన్నారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే వస్తువులను మన దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి ఎలాంటి సుంకాలూ వేయకూడదని ట్రంప్ మోడీపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన కాలయాపనలతో సాగుతోందని విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాళేశ్వరం, బనకచర్ల పేరిట ప్రజల దృష్టి మళ్లించడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అప్పులు ఉన్నాయన్న విషయం రేవంత్‌రెడ్డికి తెలుసునని.. అయినా ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. వాగ్దానాల అమలు కోసం క్షేత్రస్థా యిలో ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.
అర్హులందరికీ ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొందరికే ఇచ్చేలా లిస్టులు తయారు చేయడం సరైనది కాదని, అందరికీ పక్కా గృహాలు ఇవ్వాలని కోరారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్న లిఫ్టులను ప్రాజెక్టు అంతర్భాగంగా పరిగణించి ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు. యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్ తదితరులు ఉన్నారు.
దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES