– ములుగు జిల్లాలో టోల్ గేట్ల సమస్యకు పరిష్కారం
– ఫాస్టాగ్ ఎత్తేయాలని డీఎఫ్‌ఓతో పార్టీ నాయకుల చర్చలు
– సానుకూలంగా స్పందించిన అధికారులు
– నేటి ధర్నా వాయిదా
నవతెలంగాణ-గోవిందరావుపేట /ఏటూర్‌నాగారం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా-ఏటూర్‌నాగారం రహదారి మధ్యలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్ పేరుతో ఫారెస్ట్ అధికారులు ఒక్కో వాహనదారుడి నుంచి ప్రతిరోజూ రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై అదనంగా రూ.10 చార్జీ వేస్తున్నారు. నిత్యం దాదాపు 1000కి పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. నెలకు రూ.కోటి వరకు ఫాస్టాగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో టోల్‌గేట్ ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజులుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు చేపట్టారు. జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఎట్టకేలకు గురువారం అధికారులు స్పందించారు. గోవింరదావుపేట మండలం పస్రా ఫారెస్ట్ కార్యాలయంలో టోల్‌గేట్ సమస్యపై అటవీ శాఖ అధికారులు, సీపీఐ(ఎం) నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించడంతో శుక్రవారం తలపెట్టిన ధర్నాను వాయిదా వేశారు. టోల్‌గేట్ల సమస్యపై జరిగిన చర్చలు ఫలించాయని, ఇది తమ పోరాట ఫలితమని సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజులుగా సీపీఐ(ఎం) ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించామన్నారు. ఫారెస్ట్ డివిజనల్ అధికారులు డీఎఫ్‌ఓ జాదవ్, ఎఫ్‌డీఓ రమేష్, ఏటూర్‌నాగారం రేంజర్ అబ్దుల్ రహమాన్ చర్చలకు ఆహ్వానించినట్టు చెప్పారు. తమ పార్టీ జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ నేతృత్వంలో చర్చలు నిర్వహించారని తెలిపారు. జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు టాటా మ్యాజిక్‌లు, ట్రాన్స్‌పోర్ట్ గూడ్స్, కార్లు నడుపుతున్నారన్నారు. దీనిపై డీఎఫ్‌ఓ, ఎఫ్‌డీఓ సానుకూలంగా స్పందించి మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల దగ్గర 1972 యాక్ట్ ప్రకారం చార్జి వసూలు చేస్తున్నామని, ఇక నుంచి ములుగు జిల్లా వాహనదారులకు ఎలాంటి డబ్బుల భారం పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధంగా లింక్ ప్రొవైడ్ చేస్తామని తెలిపారు. వాహనదారులు తమ ఆర్సీ, ఆధార్ కార్డు ఇతర డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని కోరారు. అదేవిధంగా జిల్లా వాహనాలకు ఫాస్టాగ్ బిల్లు పడకుండా ఉండేందుకు డైవర్షన్ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రయాణికులపై భారం పడకుండా చూస్తామని వివరించారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ.. శుక్రవారం తలపెట్టిన ధర్నాను విరమించుకుంటున్నట్టు తెలిపారు. ఇచ్చిన హామీని అధికారులు వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ చర్చల్లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి దావూద్, తుమ్మల వెంకటరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, జిల్లా కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి, గొంది రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫలించిన సీపీఐ(ఎం) పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES