మొక్కకు కావలసినంత నీరును
గుర్తించగలిగిన వాడే నిజమైన తోటమాలి
రైతులకు కావలసినంత యూరియా
సరఫరా చేసేవారే అసలైన పాలకులు
పాలకులకు స్వార్థాలున్నట్లు
రైతులకుండవు
పంటలే బిడ్డలుగా సేద్యపు యజ్ఞాలు
ఏ దేవుళ్ళు మన కడుపుల ఆకల్ని చూడరు
అమ్మ తర్వాత రైతులే అమ్మ నాయనలు
పిడికెడి గింజల సష్టికి ఎన్ని అవస్థలో
మొక్కలు కంకులు కావడానికి అనేకానేక తిప్పలు
వానతిప్పలు వొరుపు కన్నీళ్లు
ఏ పారామీటర్లు కొలువలేని దుఃఖం
గిజలు భూమిలేసి చినుకులకు ఎదిరిచూడాలే
మొక్క చివుర్లు తొడుగుతుంటే
పురుగులపై యుద్ధం చేయాలె
గింజపట్టినప్పుడు కావలి కష్టాలు
కల్లంమీద తూఫాను కడగండ్లు
గంజాయి కావల్సినంత దొరుకుతున్నది
యూరియా ఎండమావైతున్నది
వ్యవసాయక దేశమే అయినా
రైతులపై ముందు చూపులేని విధానాలు
చెప్పులు ఆధార్ కార్డులతో రైతులు బారులు
సిగ్గనిపియ్యని మనస్తత్వాలు
ప్రతి ఏడాది బాలనాగమ్మ కథలా ఎరువుల కొరత
సరఫరాలను సరిచూడాల్సిన వ్యవస్థలు నిద్రావస్థలో
ప్రయివేటు దళారులతో పుష్కలంగా….
సరిహద్దులో విచ్చలవిడిగా
తలుపులు మూసిన సింగల్ విండోలు
సూర్యుడు తలుపు తెరువక మునుపే
చెప్పుల వరుసలు
రాజకీయాలను అంటగట్టుతుండ్రు
ఎప్పుడు తెల్లారుతుందో
ఏ బస్తా ఎవరెత్తుకుపోతరో తెలువని నరక యాతన
అందుబాటులో యూరియా
కావలసినంత ఇవ్వడమే జీవితంలో గొప్ప పని
ఎంత కరువు వచ్చినా
మద్యం నిలువలు పుష్కలంగా ఉన్నాయి
యుద్ధాలు ఎన్ని వచ్చినా
ఎదుర్కోవడానికి భాండాగారం నిండా ఆయుధాలు
దేశం ఆకలి సమస్యకు పరిష్కారాలు శూన్యమా
మొక్కలను నాటుదాం
అడవులను కాపాడుదామంటూ హరిత ర్యాలీలు
రైతులను రోడ్డుమీదనే వదిలేస్తారా
మొక్కలు నాటి జీవితాలను అంకితం చేసిన
వనజీవి రామయ్య తులసి గౌడలు ఆదర్శమైనట్లు
రైతుల జీవితాలకు పాలకులు అంకితం కావాలి
అర్ధరాత్రి ఆగమేఘాలమీద
ప్రజా వ్యతిరేక బిల్లులతో చట్టాలు చేస్తున్నారు
వారాలు దాటినా కనపడని వినపడని రైతుల గోసలు
ఎండిపోతున్న మొక్కల ఉసురు ముడుతుంది
రైతు పాట తిరుగబడరాదు
మట్టిలో మొలకలు ఆయుధాలవ్వకమునుపే
రైతు కలలు నవ్వాలి
అవమానాలు అహంకారాలు కక్షసాధింపులు వీడి
నాగలి పట్టిన చేతులకు నమస్కరిద్దాం
కర్షకుల భుజం తట్టుదాం
యూరియా కొరతతో రైతుల అవస్థలపై….
– వనపట్ల సుబ్బయ్య, 9492765358న
రైతుల ఆర్తనాదాలు
- Advertisement -
- Advertisement -