కేంద్రం ఆదేశాలు బుట్టదాఖలు
మరో 650 సర్వీసులు రద్దు..10 వరకూ ఇదే పరిస్థితన్న సంస్థ
విమానయాన సంస్థల అధికారులు, డీజీసీఏకు పార్లమెంటరీ ప్యానెల్ నోటీసులు?
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంక్షోభం ఆదివారం కూడా కొనసాగింది. విమాయాన రంగంలో ఇండిగో గుత్తాధిపత్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానయాన రంగంలో 63 శాతం వాటాతో ఇండిగో సంస్థ గుత్తాధిపత్యం సాధించడానికి ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా కొనుగోలు చేయడమే కారణమని విశ్లేషకులు వాఖ్యానిస్తున్నారు. ఆ తరువాత ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా నేతృత్వంలోని ఎయిర్ ఇండియా 13.6 శాతం వాటా కలిగి వుంది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత సంవత్సరాల్లో ఇండిగో గుత్తాధిపత్యానికి ఎందుకు అనుమతించారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు, 2023లో ఎయిర్‌లైన్స్ ఎలక్టోరల్ బాండ్లను పెద్దగా కొనుగోలు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2024లో భారత ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇంటర్‌గ్లోబ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్, ఇంటర్‌గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ మొత్తం 36 బాండ్లను కొనుగోలు చేశాయి, వాటిలో 31 బాండ్లు రూ.1 కోటి విలువైనవి. వాటిలో 31 బాండ్లు మే 2019లో కొనుగోలు చేశారు. మిగిలినవి అక్టోబర్ 2023లో కొనుగోలు చేశారు. అదనంగా, ఇంటర్‌గ్లోబ్ ప్రమోటర్ రాహుల్ భాటియా రూ.1 కోటి విలువైన 29 బాండ్ల సెట్‌ను కొనుగోలు చేశారు. ఏప్రిల్ 2021లో తన వ్యక్తిగత సామర్థ్యంలో రూ.20 కోట్లు. ఆసక్తికరంగా, భాటియా బాండ్లన్నీ కోవిడ్ -19 మహమ్మారి విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు కొనుగోలు చేశారు. ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన మరో విమానయాన సంస్థ స్పైస్‌జెట్, ఇది 2021 జనవరి, జూలై మధ్య రూ.65 లక్షల విలువైన 20 బాండ్లను కొనుగోలు చేసింది. అత్యధికంగా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి, బీజేపీకి లబ్ది చేకూర్చినందునే ఇండిగో గుత్తాధిపత్యానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుమతించిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇండిగో పట్ల ద్వంద్వ విధానాలను అనుసరించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నాయి.
విమానయాన సంస్థల అధికారులు,డీజీసీఏకు పార్లమెంటరీ ప్యానెల్ నోటీసులు?
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల ఉన్నతాధికారులు, పౌరవిమానాయన నియంత్రణ సంస్థ (డీజీసీఏ)కు పార్లమెంటరీ ప్యానల్ నోటీసులు అందజేసే అవకాశం ఉంది. వారి నుంచి వివరణ కోరవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. రవాణా, పర్యాటకం, సంస్కృతిపై జేడీ(యూ) ఎంపీ సంజరు ఝూ నేతృత్వంలో గతంలోనే ఒక పార్లమెంటరీ ప్యానెల్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ సభ్యుడు ఒకరు ఆదివారం మాట్లాడుతూ విమాన సర్వీసుల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్యానెల్ తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. ఈ అంశంపై ప్యానెల్ వివరణ కోరే అవకాశం ఉందని చెప్పారు.
గుత్తాధిపత్యంపై ప్రజలు ఆలోచించాలి : చిదంబరం
భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో గుత్తాధిపత్యం పేరుకుపోతోందని, దేశంలోని విమానయాన రంగాన్ని ఇద్దరికే ఎందుకు కట్టబెట్టారో ప్రలు ఆలోచించాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఎక్స్‌లో పోస్టు చేశారు. కార్పొరేట్లు అడ్డగోలుగా తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఎన్నికల బాండ్లు ఉపయోగపడుతున్నాయనడానికి ఇండిగో ఉదంతమే ఉదాహరణ అని లోక్‌సభ సభ్యుడు శశికాంత్ సెంథిల్ విమర్శించారు. 2024లో జారీ చేసిన నిబంధనలను ఇప్పటికీ అమలు చేయ కపోయినా సౌరవిమానయాన శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఇప్పటికీ అమలుకాని కేంద్ర మంత్రి ఆదేశాలు
రద్దు చేసిన సర్వీసులకు సంబంధించిన మొత్తాన్ని రిఫండ్ చేయాలన్న కేంద్ర మంత్రి ఆదేశాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఆదివారం రాత్రికి రూ.610 కోట్లు ఇండిగో ప్రయాణికులకు రిఫండ్ చేసినట్టు పౌర విమానయాన శాఖ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం మరో 650 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఆదివారం 1,650 విమాన సర్వీసులను నిర్వహించింది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని తెలిపింది. ఈ నెల 10 నాటికే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. తమ సంస్థ ఆన్-టైమ్ ఫెర్ఫార్మెన్స్ (ఒటిపి) పనితీరు ఆదివారం 75 శాతానికి మెరుగుపడినట్టు ఇండిగో అంచనా వేసింది. కొన్ని రోజుల క్రితం ఇది కేవలం 8 శాతంగానే ఉంది. శనివారం ఇండిగో దాదాపు 800 సర్వీసులను రద్దు చేసింది. సుమారు 1,500 సర్వీసులను నిర్వహించింది. సాధారణంగా దేశంలో అతిపెద్ద పౌరవిమానయాన సంస్థ అయిన ఇండిగో రోజుకు సుమారు 2,300 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నిర్వహిస్తుంది. కొన్ని రోజుల నుంచి వందలాది విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణీకులు అనేక ఆగచాట్లు పడ్డారు. శుక్రవారం సుమారు 1800 సర్వీసులు రద్దు చేయడంతో దేశీయ ఎయర్‌లైన్స్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుగా విమర్శకులు భావిస్తున్నారు. ఆదివారం ఇండిగో ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో ‘విమాన షెడ్యూల్స్‌ను పునరుద్ధరించడంలోనూ, కస్టమర్ సపోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ తమ సంస్థ కీలకమైన పురోగతి సాధిస్తోంది’ అని తెలిపారు. ఆదివారం సర్వీసుల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలియజేశామని పేర్కొన్నారు. రద్దయిన సర్వీసుల ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా రిఫండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై, సమస్యకు కారణమైన అంశాలపై చర్చలు జరిపినట్లు ఇండిగో తెలిపింది. సీఈఓ, బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (సీఎంజీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. సంక్షోభం నుంచి బయట పడ్డానికి, విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఈ గ్రూప్ చర్యలు తీసుకుం టుందని తెలిపింది.
గుత్తాధిపత్యం వల్లే సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



