నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో రంకెలెసిన డొనాల్డ్ ట్రంప్..ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో కదంతొక్కారు. యూఎస్ ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నారని, అంతే స్థాయిలో ఆయా దేశాల దిగుమతులపై తాము కూడా పన్నులు విధిస్తామని ట్రంప్ ట్రేడ్ వార్ కు తెరలేపారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న అమెరికా విమోచన దినంతో వివిధ దేశాలపై విధించిన టారిఫ్‌ల చిట్టాలను బహిర్గతం చేశారు. దీంతో చైనా, కెనడా, యూరోపియన్ తో పాటు పలు దేశాలు ట్రంప్ నిర్ణయంపై భగ్గుమన్నాయి. ప్రపంచదేశాలపై ఆధిపత్యం కోసం యూఎస్ ప్రెసిడెంట్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పలు దేశాలు ట్రంప్‌పై దుమ్మెత్తిపోశాయి.
ఇంటాబయట ట్రంప్ నిర్ణయంపై నిరసన జ్వాలాలు మిన్నంటాయి.అన్యూహ పరిణామంతో కంగుతిన్న టెంపరీ ట్రంప్..తన నిర్ణయాన్ని 90రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూడు నెలల లోపు అమెరికాతో వాణిజ్యంపై సరైనా ఒప్పందాలను కుదుర్చుకోవాలని సూచించారు. అయితే ట్రంప్ సూచనను చాలా దేశాలు పెడచెవిన పెట్టాయి. యూఎస్ ప్రెసిడెంట్ ఆశించిన స్థాయిలో ఏ దేశాలు కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోలేదు. దీంతో చిరెత్తుకొచ్చిన ట్రంప్..తమతో సరైన ట్రేడ్ డీల్ చేసుకోకుంటే..సుంకాలను విధిస్తానని మరోసారి మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా యూఎస్‌తో వాణిజ్య డీల్ చేసుకోవాలని లేఖలతో పలు దేశాలపై బెదిరింపులకు దిగారు.
మరోవైపు ప్రతీకార సుంకాలకు నేటితో గడువు తీరిపోనుంది. దీంతో మరోసారి ప్రతీకార సుంకాల అంశం తెరపైకి వచ్చింది. భారత్-అమెరికా పలు రోజులుగా వాణిజ్య సుంకాలపై సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. కానీ చర్చలు విఫలమైయ్యాయి. ఈక్రమంలో ఇటీవలె భారత్ పై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప వెల్లడించారు. అంతేకాకుండా రష్యాతో యథేచ్చగా చమురు కొనుగోలు చేస్తూ..ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ఆర్థిక తొడ్పాటు అందిస్తున్నారని యూఎస్ ప్రెసిడెంట్ ఆరోపించారు. అదే విధంగా బ్రిక్స్ కూటమిలో సభ్యదేశమై..డీ డాలరైజైషన్‌కు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నేటితో తీరిపోనున్న సుంకాల డెట్ లైన్‌తో ఏవిధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే..