No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeప్రధాన వార్తలుచర్చ అసెంబ్లీలో కాదు.. పార్లమెంటులో జరగాలి

చర్చ అసెంబ్లీలో కాదు.. పార్లమెంటులో జరగాలి

- Advertisement -

– సీఎంకు దమ్ముంటే జంతర్‌మంతర్‌ వద్ద ఆమరణ దీక్ష చేయాలి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– విమర్శలు మాని రిజర్వేషన్లకు మద్దతివ్వండి : బీఆర్‌ఎస్‌, బీజేపీలకు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం విజ్ఞప్తి
– అన్ని పార్టీలు కలిసి రావాలి: కూనంనేని
– బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో వాడివేడి చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత రాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో రెండోరోజైన ఆదివారం పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కేటీఆర్‌ మాట్లాడుతూ ఈ బిల్లు మన పరిధిలో లేదని తేల్చి చెప్పారు. 42శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇరుక్కుపోయిందనీ, అందుకే తమ పరిధిలో లేని అంశంపై చట్టం తీసుకువచ్చి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎంతమంది ఉంటే అంత ప్రాతినిధ్యం ఉండాలని రాహుల్‌ గాంధీ చెబుతున్నారనీ, అలాంటప్పుడు 42 శాతం రిజర్వేషన్ల అంశాలపై పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మార్చిలో బిల్లు పాస్‌ చేసిందానికి, ప్రస్తుత బిల్లుకు తేడా ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అప్పుడు చేయని రాష్ట్రపతి, గవర్నర్‌ ఇప్పుడు సంతకాలు ఎలా చేస్తారని నిలదీశారు. ప్రభుత్వాలు చేసిన చట్టాలు లొసుగులు లేకుండా చేసుకుంటే మంచిదని సూచించారు. కేవలం బీసీ డిక్లరేషన్లు ఇచ్చి వదిలేస్తే సరిపోదనీ, డెడికేషన్‌ ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ది ఉంటే డిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. బిల్లుకు సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర అఖిలపక్షానికి సమయం తీసుకోవాలనీ, తాము కూడా మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో చెప్పులు ఎత్తుకొని పోతారని రేవంత్‌ అంటున్నారనీ, ఇలా మాట్లాడిన తర్వాత ఎవరు అపాయిమెంట్‌ ఇస్తారని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు తెలంగాణలో ఆమోదం పొందకముందే ఇక్కడి ప్రజల సొమ్ముతో బీహార్లో ముఖ్యమంత్రి తన ఫొటోలతో పత్రిక ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం మాట తీరు మార్చుకోవాలని సూచించారు. విధానపరంగా ఎన్ని విభేదాలున్నా తమ పార్టీ మొదటి నుంచి బీసీలకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ తెలిపారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై సభలో చర్చ జరగాలని లయన డిమాండ్‌ చేశారు.

ద్వంద్వ విధానాలు వీడండి: కూనంనేని
ద్వంద్వ విధానాలు వీడి బీసీ రిజర్వేషన్ల పోరాటంలో కలిసి రావాలని బీఆర్‌ఎస్‌, బీజేపీలకు సీపీఐ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఒకవైపు బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతిస్తున్నామని చెబుతూనే 9వ షెడ్యూల్‌లో చేర్చకపోతే బిల్లుకు చట్టబద్దత రాదని అంటున్నారని విమర్శించారు. ఈ రకంగా రెండు పార్టీలు పూటకో మాట మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని చేసే పోరాటానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మద్దతు పలకడం లేదని ప్రశ్నించారు. సభలో జరుగుతున్న చర్చ చూస్తుంటే తెరమీద సినిమాలు గుర్తొస్తున్నాయని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమనేది విప్లవాత్మకమైన ముందడుగని కూనంనేని అన్నారు. ఈ పోరాటంలో అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు

రాజకీయాలు పక్కన పెట్టండి: మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం
రాజకీయాలు పక్కన పెట్టి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వాలని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, సీతక్క అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా వివిధ పార్టీలు లేవనెత్తిన అంశాలపై వారు వివరణ ఇచ్చారు. వెనుకబడిన తరగతులకు ఎలాగైనా 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని వారు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ మేరకు వాటిని సరి చేసేందుకు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను శాస్త్రీయంగా చేపట్టామని తెలిపారు. బీసీ మేధావుల సలహాలు, సూచనల మేరకు కులగణన విజయవంతంగా నిర్వహించామన్నారు. దీనిపై డెడికేట్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి బీసీల వెనబాటుతనం, ప్రాతినిధ్యం ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసినట్టు వారు వెల్లడించారు.

నాలుగు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు ఓకే ఏకగ్రీవంగా మద్దతు పలికిన పార్టీలు
మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్ట సవరణలతో పాటు మరో రెండు బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆదివారం శాసనసభలో మున్సిపల్‌ చట్ట సవరణ, ఇస్నాపూర్‌ మున్సిపాల్టీ విస్తరణ, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాల్టీల ఏర్పాటు బిల్లులను ముఖ్యమంత్రి తరపున అసెంబ్లీ వ్వవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి సీతక్క, అల్లోపతిక్‌ ప్రయివేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ రద్దు బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం వీటిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ. ఎంఐఎం పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఏకగ్రీవంగా అమోదం పొందాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad