Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండీజీపీకి హైకోర్టులో ఊరట

డీజీపీకి హైకోర్టులో ఊరట

- Advertisement -

నాలుగు వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలి : ఆదేశించిన కోర్టు
తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర డీజీపీగా శివధర్‌ రెడ్డికి శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ నియామకం చట్ట విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్‌ డీజీపీ నియామకం కోసం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల అమలు ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. డీజీపీగా బి.శివధర్‌రెడ్డి నియామకం చెల్లదని పేర్కొంటూ సోషల్‌ వర్కర్‌ టి.ధన్‌గోపాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాన పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేశారు. డీజీపీ నియామకంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలనీ, హైకోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల జాబితాను యూపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం పంపిందని అడ్వొకేట్‌ జనరల్‌ ఎ. సుదర్శన్‌రెడ్డి వివరించారు.

డిసెంబరు 31న తాజాగా మరో జాబితాను పంపామనీ, అయితే ఆలస్యమైందని చెప్పి దానిని యూపీపీఎస్సీ వెనక్కి పంపిందని అన్నారు. కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం, యూపీపీఎస్సీ విధిగా అమలు చేయాలన్నారు. గతంలో యూపీపీఎస్సీ రాష్ట్రానికి నాలుగు లేఖలు రాస్తే వాటిలో జాప్యం ప్రస్తావనే లేదన్నారు. ఏపీ ప్రభుత్వం 11 ఏండ్ల తర్వాత జాబితాను పంపితే యూపీపీఎస్సీ ఆమోదిం చిందని గుర్తుచేశారు. పిటిషనర్‌ అడ్వొకేట్‌ వాదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం యూపీపీ ఎస్సీకి ఆలస్యంగా జాబితా పంపడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయనట్టుగా పరిగణించి డీజీపీ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమిస్తూ జారీ చేసిన జీవోను కొట్టేయాలని కోరారు.

రూల్స్‌ ప్రకారం ఒక డీజీపీ ఉద్యోగ విరమణ చేయడానికి మూడు నెలల ముందే కొత్త డీజీపీ నియామకం కోసం యూపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల జాబితా పంపాల్సి ఉందంటూ నిబంధనలను గుర్తు చేశారు. డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని శాశ్వతప్రాతిపదికపై చేయలేదనీ, తాత్కాలిక నియామకమని, సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకమని, కాబట్టి డీజీపీ నియామకంపై స్టే ఇవ్వాలని కోరారు. యుపీపీఎస్సీ న్యాయవాది కులకర్ణి ప్రతివాదన చేస్తూ సుప్రీం గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అన్ని పక్షాల వాదప్రతివాదనల అనంతరం న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని యూపీపీఎస్సీని ఆదేశించారు. పూర్తి స్థాయి డీజీపీ నియామకంపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. స్టే కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -