Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం) పోరాట ఫలితమే పేదలకు ఇండ్ల పట్టాలు

సీపీఐ(ఎం) పోరాట ఫలితమే పేదలకు ఇండ్ల పట్టాలు

- Advertisement -

ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య
గోదావరిఖనిలో ఇండ్ల పట్టాల పంపిణీ విజయోత్సవ ర్యాలీ


నవతెలంగాణ-గోదావరిఖని
సీపీఐ(ఎం) పోరాట ఫలితంగానే ప్రభుత్వం పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సీపీఐ(ఎం) కార్యాలయం వరకు ఇండ్ల పట్టాల పంపిణీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రామిక భవన్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో నాగయ్య ప్రసంగించారు. రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల కిందట ఇల్లు లేని నిరుపేదలందరినీ సమీకరించి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించామని తెలిపారు.

రాష్ట్రంలో 21 జిల్లాల్లో లక్ష మంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని, అప్పటి నుంచి అక్కడే కనీస సౌకర్యాలు లేకున్నా ఉంటున్నారని చెప్పారు. ఇంటి కిరాయిలు చెల్లించలేక, సరైన ఉపాధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొచ్చాక ఇండ్లు లేని వారందరికీ 120 గజాల జాగ ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయమై సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకత్వం ఆరుసార్లు ముఖ్యమంత్రిని కలిసినట్టు చెప్పారు. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, కానీ ఎక్కడా హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా రామగుండం నియోజకవర్గంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత నాది అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఇప్పుడు నెరవేర్చారని అన్నారు.

అందులో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న 300 మందికి పట్టాలు ఇచ్చారని, ఇందుకు ఎమ్మెల్యేకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వీరందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించి మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మరో 300 మంది ఇక్కడే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఉన్నారని, వారికి కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు. సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై.యాకయ్య మాట్లాడుతూ.. పేదలకు పట్టాలు రావడానికి కృషి చేసిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, బాలరాజుకు, సీపీ అడ్మిన్‌ రాజుకు, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌కు, సీఐ ఇంద్రసేనారెడ్డికి, ఇండ్ల పట్టాలు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, పట్టణ కార్యదర్శి ఎ.మహేశ్వరి, నాయకులు మహేందర్‌, క్రాంతి, భాస్కర్‌, శివకుమార్‌, సతీష్‌, అనూష, దీప పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -