అబద్ధపు మాటలు పట్టించుకోవద్దు
ప్రజల అభిప్రాయం మేరకే ప్రభుత్వ నిర్ణయం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
జనగామ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై సమీక్ష
నవతెలంగాణ-జనగామ
జిల్లాల కుదింపు విషయంలో ఎలాంటి ప్రక్రియా మొదలు కాలేదని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలో వివరాలు స్పష్టంగా ప్రకటించాలన్నారు. ఈ పనులపై ప్రతినిధులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. జనగామ జిల్లాను రద్దు చేస్తున్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాజకీయ స్వలాభంతోనే అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
తప్పుడు ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవద్దన్నారు. జిల్లాల రద్దు విషయంలో అసెంబ్లీలో చర్చ, ప్రక్రియ మొదలు కాలేదన్నారు. ప్రజలు ఉద్యమాలు చేసి జనగామ జిల్లాను సాధించుకున్నారన్నారు. దీనిని కాపాడుకునేందుకు ప్రయత్నిద్దాం అన్నారు. ప్రజలకు, పాలనకు అనుకూలంగా జిల్లాల హద్దులు, సమస్యల పరిష్కారం తదితర అంశాలను పునర్ సమీక్షించాలని మాత్రమే ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఆ దిశగా కూడా ఎలాంటి ప్రక్రియా మొదలు కాలేదన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు ఏ నిర్ణయమైనా సాగుతుందన్నారు. అప్పటివరకు అపోహలుకు గురి కావద్దని సూచించారు.



