మహిళా సంఘం నిర్మాణంలో వారిది ఎనలేని కృషి
ఐద్వా హైదరాబాద్ నాయకత్వ ఆత్మీయ సమ్మేళనంలో పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
”మహిళా సంఘం నిర్మాణం చేసే సమయంలో అక్కడ ఒకరు… ఇక్కడ ఒకరు అన్నట్టుగా ఉండేవారు. అలాంటి సందర్భంలోని అలుపెరగకుండా సంఘం నిర్మించడానికి నాటి నాయకత్వం చేసిన కృషి మరువలేనిది. ఉదయం ఉద్యోగాలు చేసుకుంటూ సాయంత్రం మహిళా సంఘాన్ని నిర్మించారు. అవసరమైనప్పుడు ఉద్యోగాలకు సెలవులు పెట్టారు….” అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి కొనియాడారు. ఐద్వా 14వ జాతీయ మహాసభల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని గోల్కోండ చౌరస్తాలో ఉన్న ఐద్వా నగర కార్యాలయంలో సంఘం హైదరాబాద్ నగర ఉద్యమ నిర్మాతల నుంచి నేటి వరకు బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకత్వ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలు సాధించుకున్న హక్కులను, సౌకర్యాలను కాలరాసే విధంగా విధానాలను తీసుకొస్తున్నదని విమర్శించారు. ఆ విధానాలకు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో నాటి నాయకత్వం వీలైనంత మేరకు పాల్గొనాల ని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వయస్సు, ఆరోగ్యం రీత్యా, కుటుంబ బాధ్యతల రీత్యా అప్పటిలా చురుగ్గా పాల్గొనలేకపోతున్నామని బాధపడే కంటే చేయగలిగిన పద్ధతిలో భాగస్వాములు కావాలని కోరారు. మరోసారి పాత జ్ఞాప కాలను, ఉద్యమ నిర్మాణ ఘట్టాలను గుర్తు చేసుకుంటూ కలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
1970లో హైదరాబాద్ నగర కమిటీ కార్యదర్శిగా సుగుణమ్మ, సక్కుబాయి, సుజావతి, వర్ధిని కమిటీ సభ్యులుగా ఏర్పడినప్పటి నుంచి అనేక ఒడిదుడుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అన్నింటిని ఎదుర్కోవడంతో హైదరాబాద్ (ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్) పరిధిలో ఉద్యమ నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇప్పటికీ తమ శక్తి మేరకు పని చేస్తామని వెల్లడిం చారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ జాతీయ మహా సభల సందర్భంగా వివిధ రకాల ఎగ్జిబిషన్లు, సెమినార్లు, ఏర్పాట్ల కోసం వేయ నున్న కమిటీల్లో అందరూ భాగస్వాములై మహాసభలను జయప్రదం చేద్దామని కోరారు. ఈ సమావేశానికి ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణ జ్యోతి, ఉపాధ్య క్షురాలు టి.జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి, రాష్ట్ర నాయకులు ఎం.వినోద , పి.శశికళ, వై.వరలక్ష్మి ఎం.లక్ష్మమ్మ, ఎండి షబానా బేగం, సృజన, హైదరాబాద్ సెంట్రల్, సౌత్, మేడ్చల్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.



