- ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి సంఘీభావం తెలిపిన పలువురు మేధావులు
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ఈనెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికలు.. ‘రాజ్యాంగం అమలుకు, రాజ్యాంగం విధ్వంసానికి’ మధ్య జరుగుతున్నవని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి సంఘీభావంగా ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రొఫెసర్ ఎం.కోదండరాం, పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ జి.హరగోపాల్, విద్యా కమిషన్ సభ్యులు పీఎల్ విశ్వేశ్వరయ్య, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం.కోదండరాం మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువల రక్షణకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు ముఖ్యమని, దీనికోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు చేయడం వల్ల బీఆర్‌ఎస్ పార్టీ ఓటు వేయబోమని చెప్పడం సరికాదన్నారు. ఆయన ఇండియా కూటమి అభ్యర్థి అని గ్రహించాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర ఉందనే విషయాన్ని బీఆర్‌ఎస్ గ్రహించి, ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు. ఆయన గెలుపు తెలుగు జాతి వికాసానికి మరింత దోహదం చేస్తుందన్నారు. ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగం అమలు కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి జీవితాంతం పాటు పడ్డారని అన్నారు. చరిత్ర, న్యాయశాస్త్రంపై సంపూర్ణ అవగాహన ఉన్న ఆయన్ను గెలిపించాలని కోరారు. దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, తన 55 ఏండ్ల బోధనా వృత్తిలో ఏనాడూ తరగతి గదుల్లో ఈ అంశం బోధించాలని, ఇది బోధించకూడదనే ఆంక్షలు లేవన్నారు. కానీ నేడు విశ్వవిద్యాలయలలో బోధనా అంశాలపై అధ్యాపకులు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడిన బీఆర్‌ఎస్ ఆయనకు మద్దతు ఇవ్వకపోతే, ఇప్పుడు ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న నమ్మకం కోల్పోతుందన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియా చైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కేంద్ర హౌంశాఖ మంత్రి సుదర్శన్ రెడ్డిని మావోయిస్టుల సానుభూతిపరునిగా మాట్లాడుతున్నారని, ఆయన ఉద్యోగ విరమణ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆయన్ను గోవా లోకాయుక్తగా నియమించినప్పుడు అది గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. పీఎల్ విశ్వేశ్వర్‌రావు, రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపునకు 82 ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయని, బీఆర్‌ఎస్, టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీ పార్టీల ఎంపీలు ఆయనకు ఓటు వేస్తే గెలుస్తారని స్పష్టం చేశారు.