‘వీబీ జీ ఆర్‌ఏఎంజీ’ ని రద్దు చేయాలి : బహిరంగ సభలో ఆలిండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మీనాక్షి నటరాజన్
నవతెలంగాణ-చిన్న శంకంపేట
ఉపాధి హామీ చట్టాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనీ, వీబీజీఆర్‌ఏఎం(జీ) పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని, ఆలిండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మీనాక్షి నటరాజన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం, నిర్వీర్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని కొరివిపల్లిలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మీనాక్షి నటరాజన్ ప్రసంగిస్తూ.. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసిందని, దీని ద్వారా లక్షలాది మంది పేదలు ఉపాధి పొందారని వివరించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక క్రమంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలు తీసుకుందని, ఇప్పుడు చట్టంలోని గాంధీ పేరును తొలగించి.. దాని స్థానంలో వీబీజీఆర్‌ఏఎం(జీ) పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని రద్దుచేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో మొండి చేయి చూపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, గ్రంథాలయ చైర్మెన్ సుహాసిని, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, నర్సాపూర్ ఇన్‌చార్జి రాజిరెడ్డి, సర్పంచుల పొరం జిల్లా అధ్యక్షులు ఆవుల గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు మోహన్ నాయక్, నాయకులు సాన సత్యనారాయణ, యాదవరావు, సుధాకర్, మనోజ్, రవీందర్, చత్రునాయక్, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.



