Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధి చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలి

ఉపాధి చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలి

- Advertisement -

శాసనమండలి ఏకగ్రీవ తీర్మానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. శనివారం మధ్యాహ్నం శాసనమండలిలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీ జీరామ్‌ జీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనీ, పాత చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త చట్టంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందనీ, గ్రామాల్లో పేదలకు ఉపాధి కరువై వలసలు పెరుగుతాయనీ, పని దినాలు తగ్గుతాయని వెట్టి చాకిరీ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

పట్టణ ప్రాంత పేదల ఉపాధి కోసం చట్టం తీసుకురావాలని ఆమె కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. చట్టాలకు ఉత్తరాది పదాలను పెడుతూ బలవంతంగా రుద్దుతున్న దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవుల్లో మైనింగ్‌ పెరిగిందనీ, కార్పొరేట్ల కోసం కొత్త చట్టం తెచ్చారని ఆమె తప్పుపట్టారు. చర్చలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ప్రపంచం గుర్తించిన త్యాగశీలి మహాత్మాగాంధీ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 80 శాతం రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయనీ, అలాంటి సమయంలో 40 శాతం వాటా తెలంగాణ రాష్ట్రం భరించాలని కొత్త చట్టం తేవడం సరికాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టాన్నే అమలు చేసేలా ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.

సీపీఐ సభ్యులు నెలకంటి సత్యం మాట్లాడుతూ ప్రజల జీవించే హక్కును హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కొత్త చట్టం జీవించే హక్కుకు గొడ్డలిపెట్టులాంటిదన్నారు. ఈ చట్టంతో ఆర్థిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఉపాధ్యాయ సభ్యులు ఏ.వీ.ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతా ల వైశాల్యాలను బట్టే నిధుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలను అనాథలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ఉందని విమర్శించారు. యాంత్రీకరణ జరిగాక వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదంటూ కేంద్రం చేస్తున్న వాదన కేవలం సాకు మాత్రమేనని కొట్టిపారేశారు. 90 శాతం మంది ప్రజలు ఆధారపడ్డ ‘ఉపాధి’లో మార్పులు చేసే ముందు కనీస సంప్రదింపులు జరపలేదని తప్పుపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -