Monday, December 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ మాయం

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ మాయం

- Advertisement -

అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ట్రంప్‌ ఫొటోలు గాయబ్‌

వాషింగ్టన్‌ : అమెరికా న్యాయ శాఖ వెబ్‌సైట్‌ నుంచి కనీసం 16 ఫైల్స్‌ అదృశ్యమయ్యాయి. వీటిలో లైంగిన నేరస్తుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు చెందిన రికార్డులు కూడా ఉండడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఫొటో కూడా మాయమైంది. వెబ్‌సైటులో శుక్రవారం ఫైల్స్‌ను పోస్ట్‌ చేయగా అవి శనివారం కనిపించలేదు. నగంగా చూపిన మహిళ చిత్రంతో పాటు ఎప్‌స్టీన్‌, మెలానియా ట్రంప్‌, ఘిస్‌లైన్‌ మాక్స్‌వెల్‌ పక్కనే ట్రంప్‌ నిలుచుకున్న ఫొటో కూడా ఉంది. ఫొటోల తొలగింపు ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక పొరపాటున జరిగిందా అనే దానిపై న్యాయశాఖ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అసలు తొలగించిన చిత్రాలు ఏమిటి, ఎందుకు తొలగించారు వంటి విషయాలపై ఊహాగానాలు వినవస్తున్నాయి. ఎప్‌స్టీన్‌, ఆయనతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులపై ఇప్పటికే అమెరికన్లలో ఆసక్తి నెలకొని ఉంది. తాజా పరిణామంతో అది మరింత పెరిగింది.

ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా ఉన్న డెమొక్రాట్లు దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఇంకా ఏం కప్పిపుచ్చుతారు? అమెరికా ప్రజలకు పారదర్శకత అవసరం’ అని వారు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన వేలాది ఎప్‌స్టీన్‌ పత్రాలలో అనేక మంది ప్రముఖుల ప్రస్తావనలు ఉన్నాయి. వీరిలో మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కూడా ఉన్నారు. అయితే లిఖితపూర్వక పత్రాల నుంచి ట్రంప్‌ పేరు అదృశ్యమైంది. ట్రంప్‌, ఎప్‌స్టీన్‌ మధ్య సంబంధాలపై గతంలో అనేక పత్రాలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో న్యాయ శాఖ వెల్లడించిన పత్రాలలో ట్రంప్‌ పేరు కనిపించింది. ఉదాహరణకు ఎప్‌స్టీన్‌కు చెందిన ప్రైవేటు జెట్‌ విమాన లాగ్స్‌లో ట్రంప్‌ ప్రస్తావన ఉంది. అయితే ఎప్‌స్టీన్‌ నేర కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్‌ ఖండిస్తూ వచ్చారు. ఇదిలావుండగా న్యాయ శాఖ తాజాగా బహిర్గతం చేసిన వాటిలో కూడా కొన్ని కీలక పత్రాలు లేవు. బాధితులతో ఎఫ్‌బీఐ జరిపిన ఇంటర్వ్యూలు, నిర్ణయాలతో కూడిన న్యాయ శాఖ ఆంతరంగిక మెమొరాండా వంటివి వీటిలో లేవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -