Wednesday, July 23, 2025
E-PAPER
Homeజాతీయంమళ్లీ రైతన్నల పోరుబాట..

మళ్లీ రైతన్నల పోరుబాట..

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి సర్కారుకు వ్యతిరేకంగా రైతన్నలు మరోసారి పోరుబాట పట్టారు. మోడీ సర్కారు సాగిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాలను నిరసిస్తూ రణ గర్జన చేశారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకంగా వ్యవసాయ, పాడి రంగాల తలుపులను విదేశాలకు తెరిచేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై (ఎఫ్‌టీఏ) సంతకం చేయాలంటూ అమెరికా చేస్తున్న ఒత్తిళ్లకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం లొంగిపోతుందేమోనని తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) మంగళవారం తెలిపింది. ఎఫ్‌టీఏ పై సంతకం చేయడం వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతినడమేగాక ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఎస్‌కేఎం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయి ఎఫ్‌టీఏపై సంతకం పెట్టేందుకు బిజెపి సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వరుసగా ప్రజా నిరసనలు నిర్వహించనున్నట్లు ఎస్‌కేఎం ప్రకటించింది.


రానున్న ఆగస్టు 13న కార్పొరేట్స్‌ క్విట్‌ ఇండియా అనే నినాదంతో ట్రాక్టర్‌, మోటారు వాహనాల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దహనం చేస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఓ ప్రకటనలో వెల్లడించింది. జూలై 30న పంజాబ్‌లోని అన్ని జిల్లాలలో ట్రాక్టర్‌ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 24 న పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వ కొత్త భూ సమీకరణ విధానానికి వ్యతిరేకంగా మహా పంచాయత్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 2020-21 చారిత్రాత్మక రైతుల పోరాటం 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 26న కార్మిక సంఘ ఉద్యమం, వ్యవసాయ కూలీల ఉద్యమాన్ని సమన్వయం చేసుకుని న్యూఢిల్లీతోపాటు అన్ని రాష్ట్ర రాజధానులలో కార్మికుల-వ్యవసాయ కూలీల నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపింది. 20న ఆన్‌లైన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో 12 రాష్ట్రాల నుంచి 37 రైతు సంఘాలకు చెందిన 106 మంది ప్రతినిధులు పాల్గొన్నట్లు ఎస్‌కేఎం పేర్కొంది.

అదానీ గ్రూపునకు చెందిన బొగ్గు గనుల కోసం బలవంతంగా భూమిని సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియచేస్తున్న సింగ్రౌలీ గిరిజన రైతులకు సంయుక్త కిసాన్‌ మోర్చా సర్వసభ్య సమావేశం పూర్తి సంఘీభావం ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ రంగ ప్రాజెక్టుల కోసం తక్కువ ధరకు భూములను సేకరించే అన్ని రకాల భూములకు చెందిన వాటి యజమానులకు మార్కెట్‌ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఎస్‌కేఎం డిమాండ్‌ చేసింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా భూముల ధరలను పెంచాలని కోరింది. పునరావాసం లేకుండా భూ సేకరణ జరపడానికి వీల్లేదని తెలిపింది. బుల్జోజర్‌ పాలనను అంతం చేయాలని, పంట పొలాలలో బలవంతంగా హై వోల్టేజీ ట్రాన్స్‌మిషన్‌ లైన్లను నిర్మించికూడదని ఎస్‌కేఎం డిమాండు చేసింది. దేశంలో ఆహార కొరతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ భూమిని పరిరక్షించాలని కోరింది. 189 రోజులపాటు పోరాటం సాగించి విజయం సాధించిన కర్నాటకలోని దేవనహళ్లి రైతులకు శుభాకాంక్షలు తెలిపింది. బిజెపి-ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని శిక్షించేందుకు బీహార్‌లో ప్రచారం చేయాలని నిర్ణయించిన ఎస్‌కేఎం నాయకత్వం సెప్టెంబర్‌లో బీహార్‌ను సందర్శించాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -