క్వార్టర్స్‌లో సింధు, లక్ష్య ఓటమి
ఇండోనేషియా మాస్టర్స్ 2026
జకర్తా (ఇండోనేషియా) : గత వారం ఇండియా ఓపెన్‌లో మెరిసి ఆశలు రేపిన భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి సింధు, లక్ష్యసేన్‌లు ఇండోనేషియా మాస్టర్స్ నుంచి ఇంటిబాట పట్టారు. సింగిల్స్ విభాగాల్లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్లు సెమీఫైనల్ ముంగిట నిరాశపరిచారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఐదో సీడ్ పివి సింధు 13-21, 17-21తో టాప్ సీడ్ చెన్ యుఫెరు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. 42 నిమిషాల్లోనే ముగిసిన పోరులో సింధు గట్టి పోటీ ఇవ్వలేదు. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన చైనా అమ్మాయి.. రెండో గేమ్‌లో కాస్త చెమటోడ్చినా అలవోకగానే సెమీస్ బెర్త్ దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఏడో సీడ్ లక్ష్యసేన్ 18-21, 20-22తో పోరాడి ఓడాడు.
లక్ష్యసేన్ తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-9తో ముందంజ వేశాడు. కానీ విరామం తర్వాత పుంజుకున్న థాయ్ లాండ్ షట్లర్ లెక్క సమం చేశాడు. 11-11 నుంచి 17-17 వరకు ఆధిపత్యం చేతులు మారుతూ ఉత్కంఠగా సాగిన గేమ్‌లో థాయ్ లాండ్ షట్లర్ ఒత్తిడిలో మెరిశాడు. 21-18తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ సైతం ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 10-11తో లక్ష్యసేన్ విరామ సమయానికి ఓ పాయింట్ వెనుకంజలో నిలిచినా.. బ్రేక్ తర్వాత జోరందుకున్నాడు. 19-19, 20-20తో వెంబడించిన లక్ష్యసేన్ టైబ్రేకర్‌లో తలొగ్గాడు. దీంతో సెమీస్ బెర్త్ లక్ష్యసేన్ చేజారింది. పివి సింధు, లక్ష్యసేన్ ఓటమితో ఇండోనేషియా మాస్టర్స్‌లో భారత పోరాటానికి తెరపడింది.



