నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్‌డమ్’ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ నేడు(జూలై 31) విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ‘కింగ్‌డమ్’ సినిమా వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులను మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించిన చిత్ర బృందం, తమ ఆనందాన్ని పంచుకుంది.
ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ సినిమాకి వస్తున్న స్పందన పట్ల మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. యూఎస్ ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రాత్రి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఫోన్ చేసి ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతున్నారు. మీ అందరి ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది. మీడియా సపోర్ట్ కూడా మరిచిపోలేను. నా తెలుగు ప్రజలు నా వెనుక ఎంత ఉన్నారో నిన్నటి నుంచి చూస్తున్నా. అభిమానులు సినిమా కోసం ఎంతలా మొక్కుకున్నారో, ఎంతలా సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ విజయాన్ని ప్రేక్షకుల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. తెలుగు ప్రేక్షకులతో పాటు యూఎస్ ఆడియన్స్ ని కూడా త్వరలో కలుస్తాను. గురువారం విడుదలంటే నేను మొదట భయపడ్డాను. కానీ, నాగవంశీ గారు ఈ సినిమా నమ్మి గురువారం విడుదల చేశారు. ఇప్పుడు ఆయన నమ్మకం నిజమైంది. సినిమాకి నా నటనకు ఇన్ని ప్రశంసలు రావడానికి కారణం దర్శకుడు గౌతమ్. టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్ అన్నకి, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. “మేము అనుకున్నట్టుగానే సినిమాకి మంచి స్పందన వస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఈ మధ్య కాలంలో సాంకేతికంగా ఇంత గొప్పగా ఉన్న సినిమా ఇదేననే మాటలు వినిపిస్తుండటం సంతోషంగా ఉంది. ఒక తెలుగు సినిమాని సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో తీశాము. థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విజయ్ దేవరకొండ గారి అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమాతో ఆయన హిట్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. అనిరుధ్, నవీన్ నూలి సహా అందరూ ఎంతో ఎఫర్ట్ పెట్టి సినిమా కోసం పని చేశారు. మేము మంచి కంటెంట్ ని అందించాము, దానిని ప్రేక్షకుల్లోకి తీసుకొని వెళ్ళడానికి మీడియా ఎంతో సపోర్ట్ చేసింది. సినిమా వసూళ్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మొదటి రోజే చాలా చోట్ల బిజినెస్ చేసిన దానిలో సగానికి పైగా రాబడుతోంది. మాకు మరో విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు.” అన్నారు.
నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ కి వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉంది. సినిమాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. ఈ చిత్రంతో నా సోదరుడు విజయ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ గెలిస్తే నేను గెలిచినట్లే. సొంతంగా వచ్చి ఏదో సాధించాలి అనుకునే ఎందరికో విజయ్ స్ఫూర్తి. అలాంటి విజయ్ గెలవడం ఆనందంగా ఉంది. నాగవంశీ గారు డేరింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడే సినిమాలను రిస్క్ చేసి తీస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారి ధన్యవాదాలు. గౌతమ్ ఈ కథ చెప్పగానే.. ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి అనుకున్నాను. బ్రదర్ సెంటిమెంట్ గురించి, ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ ల గురించి అందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. వంశీ గారు అన్నట్టు.. ఈ సినిమా హాలీవుడ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. కింగ్‌డమ్ ఇచ్చిన ఉత్సాహంతో ప్రేక్షకులకు మరిన్ని మంచి సినిమాలు అందిస్తాను.” అన్నారు.
నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. “ఇది నా మొదటి సక్సెస్ ప్రెస్ మీట్. ప్రేక్షకులతో కలిసి కింగ్‌డమ్ చూశాను. ఈ సినిమాకి, ఇందులో నా పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది. ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూసి అనుభూతి చెందాల్సిన చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.