సుప్రీంకోర్టుకు తెలిపిన ఎలక్షన్ కమిషన్
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను ఎప్పుడు, ఎలా నిర్వహించాలనేది పూర్తిగా తమ అధికార పరిధిలోనే ఉంటుందని సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అలాగే, ఎస్‌ఐఆర్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహించాలా లేదా కుదించి నిర్వహించాలా అనే నిర్ణయం ‘పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది’ అని తెలిపింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియను తమ ‘ప్రత్యేక అధికార పరిధి’కి వదిలివేయాలని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఎన్నికల నియమాల నమోదు 1960 చట్టాలు ఎస్‌ఐఆర్ సమయంపై పూర్తి విచక్షణను ఎలక్షన్ కమిషన్‌కు కట్టబెట్టాయని తెలిపింది. దేశ ఓటర్ల జాబితాలో నమోదైన విదేశీ చొరబాటుదారులను గుర్తించి, బహిష్కరిం చడానికి దేశవ్యాప్తంగా ‘క్రమం తప్పకుండా’ ఎస్‌ఐఆర్‌ను నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ విచారణలో ఎలక్షన్ కమిషన్ పైవిధంగా స్పందించింది.
దేశ వ్యాప్తంగా క్రమం తప్పకుండా ఎస్‌ఐఆర్‌ను నిర్వహించాలనే ఆదేశం ఎన్నికల కమిషన్ యొక్క ప్రత్యేక అధికార పరిధిని అతిక్రమిస్తుందని స్పష్టంగా సమాధానం ఇచ్చింది. ఒక వైపు బీహార్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వివాదం కొనసాగుతున్న సమయంలో ఈ పిటిషన్ విచారణ జరగడం విశేషం. అయితే, 2026 జనవరి 1 అర్హత తేదీగా దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ఉంటుందని ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది. 2026 జనవరి 1ను దేశవ్యాప్తంగా అర్హత తేదీగా సూచిస్తూ ఓటర్ల జాబితాల ఎస్‌ఐఆర్ కోసం తక్షణ ముందస్తు కార్యకలాపాలను ప్రారంభించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు జులై 5న ఒక లేఖ రాసినట్టు ఈసీ కోర్టుకు తెలియజేసింది. అలాగే, దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ను నిర్వహించడానికి సన్నాహక చర్యలను మరింత బలోపేతం చేయడానికి, సమన్వయం చేయడానికి ఈ నెల 10న న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఈవోలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా ఈసీ తెలిపింది.