– ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం
– ఇక ఓటుకు నోటుపైనే అందరి దృష్టి
– ఏర్పాట్లలో ఎన్నికల యంత్రాంగం నిమగం
– రాష్ట్రంలో 4,235 పంచాయతీల్లో రేపు పోలింగ్
– 395 పంచాయతీలు ఏకగ్రీవం..
– పోటీలో 13,127 మంది సర్పంచ్, 27,960 మంది వార్డు అభ్యర్థులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తొలి విడత పల్లెపోరుకు మంగళవారం ప్రచారం ముగిసింది. ఎన్నికల సిబ్బంది గురువారం నిర్వహించే పోలింగ్ కోసం ఏర్పాట్లలో నిమగమయ్యారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, ఇతరత్ర అధికారులు మొదటి విడత ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాల్సిందిగా అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 564 మండలాల్లోని 12,723 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో మొత్తం 1.66 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 81 లక్షల మంది పురుషులుంటే 85 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు అధికారులు లెక్కించారు. 500 మంది వరకూ ఇతర ఓటర్లు ఉన్నారు.
ఇక నోట్లే మాట్లాడుతారు..!
తొలి దఫా పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే మద్యం షాపులు మూసివేశారు. తిరిగి 11వ తేదీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యి ఫలితాలు వెలువడేంత వరకూ అమ్మకాలు చేపట్టరాదని ఆదేశాలు వెలువడ్డాయి. వైన్స్ క్లోజింగ్ ప్రకటనతో అభ్యర్థులు, నాయకులు ముందుగానే మద్యం సీసాలు తెచ్చుకొని ఇండ్లలో ఉంచారు. ఓటుకు నోటుతో పాటు లిక్కర్ కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్ల ఫుల్‌బాటిల్ పంచేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు మించి ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించి రప్పిస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా భరిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.500 మొదలు రూ.2వేలకు పైగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ కార్యాలయాల నుంచి నగదును ఇప్పటికే తీసుకెళ్లినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఓటర్ల సంఖ్య ఆధారంగా పంచాయతీకి రూ.5 లక్షలు మొదలు రూ.కోటికిపైగా పంపిణీ చేయనున్నట్టు తెలిసింది. సర్పంచ్ ఎన్నికలే అయినా సాధౄరణ ఎన్నికల మాదిరి ప్రచారం జరిగింది. ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారంలో నిమగమయ్యారు.
మైకుల మోతకు బ్రేక్
తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే 189 మండలాల్లోని 4,235 పంచాయతీల్లో ప్రచార హౌరు మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 27.41 లక్షల మంది కాగా మహిళలు 28.78 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విడత 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అవిపోను 3,836 పల్లెల్లో ఎన్నికలు జరగనున్నాయి. 13,127 మంది సర్పంచ్ అభ్యర్థులు, 27,960 మంది వార్డు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 9,331 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్లెపోరుకు నోటిఫికేషన్ వెలువడిన నవంబర్ 25వ తేదీ నుంచి మొదలైన ఎన్నికల ప్రచారం దాదాపు పదిరోజుల పాటు ఉధృతంగా సాగింది. ఊర్లన్నీ మైకుల మోతతో హౌరెత్తాయి. గుర్తుల కేటాయింపుతో ఈ జోరు మరింతగా ఊపందుకుంది. సర్పంచ్, వార్డు స్థానాలకు కేటాయించిన గుర్తులతో జోరుగా ప్రచారం నిర్వహించారు. గ్రామీణ నేపథ్యంతో సింబల్స్ కేటాయింపు జరగటంతో సంబంధిత చిహ్నాలను చేతపట్టుకొని వినూత్నరీతిలో ప్రచారం నిర్వహించారు. కొన్నిచోట్ల ఓ అభ్యర్థి వేసిన పోస్టర్లను మరొకరు చించివేయటం వంటి స్వల్ప ఘర్షణలు సైతం చోటుచేసుకున్నాయి. ఫ్లెక్సీల విషయంలోనూ గొడవలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రచారమన్ని రోజులు రూ.250 వరకూ కూలితో పాటు క్వార్టర్ లేదంటే హాఫ్ బాటిల్‌తో పాటు బిర్యానీ సమకూర్చారు. అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్న నాయకులు పలువురు పట్టణాల్లో ఉంటున్న తమ కుటుంబాలను పదిరోజుల పాటు వదిలి తమ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లు చేసి తప్పకుండా రావాలని ఒట్టు వేయించుకుంటున్నారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విడత ఎన్నికలు…
ఖమ్మం జిల్లాలో మొత్తం 566 పంచాయతీలుండగా తొలి దశలో 192 జీపీలు, 1740 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోని వైరా, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. కొణిజర్ల (27+254), రఘునాథపాలెం (37+308), వైరా (22+200), బోనకల్ (22+210), చింతకాని (26+248), మధిర (27+236), ఎర్రుపాలెం (31+284) మొత్తం 192 జీపీలు, 1740 వార్డులకు తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తారు.
భద్రాద్రి కొత్తగూడెంలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని అశ్వాపురం (24+214), భద్రాచలం (1+20), బూర్గుంపాడు (18+182), చర్ల (26+232), దుమ్ముగూడెం (37+324), కరకగూడెం (16+130), మణుగూరు (14+132), పినపాక (23+202), మొత్తం 159 జీపీలు, 1436 వార్డులకు తొలి విడతలో ఎన్నికలు జరుగుతాయి.
తొలి దఫా ‘మోత’కు మూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



