Monday, January 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిజాతి మత విద్వేషపు మంటలు

జాతి మత విద్వేషపు మంటలు

- Advertisement -

నూతన సంవత్సరం ప్రాంగణంలో నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని స్నేహ సౌహార్ద్రతలతో ముందుకు సాగాల్సిన సమయం విద్వేషదాడులకు హత్యలు సంభవించడం భారతదేశ ప్రజాజీవితాన్ని కల్లోల పరచింది. భిన్నత్వంలో ఏకత్వానికి పేరు గాంచిన ఈ దేశ ప్రతిష్టకు మచ్చగా మారింది. వీటికి క్రిస్‌మస్‌ వేడుకలపై దాడులు మరింత ఆందోళనకు కారణమైంది. ఊహించని రీతిలో ఒక చోట గాక అనేక రాష్ట్రాలలో, ప్రాంతాలలో రకరకాల పేర్లతో జరిగిన ఈ దాడులన్నిటి వెనకా వున్నది మాత్రం విద్వేషం కావడం అన్నిటికన్నా కలవరం కలిగిస్తున్నది.ద్వేషం ద్వేషాన్ని పెంచుతుందన్నట్టు గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన ఆనవాళ్లు లేనిచోట్ల కూడా హిందూత్వ సంస్థలు బరితెగించి దాడులకు పాల్పడ్డాయి.

కొన్నిచోట్ల మతం పేరిట, కొన్నిచోట్ల విదేశీ వ్యతిరేకత పేరిట, మరికొన్ని చోట్ల అభాగ్యులను హడలకొట్టడం కోసం ఈ దాడులు జరిగినా తీరుతెన్నులలో తేడా లేదు. ద్వేషం,దౌర్జన్యంలో మాత్రం అన్నిచోట్లా ఒకటే. బీజేపీనే పాలించే రెండు రాష్ట్రాల మధ్య కూడా ఇలాటి ఘటనలు జరగడం ఒకటైతే వాటికి బలైన కుటంబాల పెద్దలు ‘మేము మాత్రం భారతీయులం కాదా’ అని ఘోషించడం మనసు కలచివేస్తుంది. ఈ ఘటనలు అంతర్జాతీయ చర్చకు, అభిశంసనకు కూడా దారి తీయడంలో ఆశ్చర్యం ఏముంది?అయినా వీటిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవలసింది పోయి కొన్నిచోట్ల సమర్థనలకు దిగడం, కేంద్రహోంమంత్రి స్థాయిలో వీటిని మరి ఎగదోసేట్టు మాట్లాడటం చూస్తే ఇవీ వ్యూహాత్మకమా అని సందేహం కలుగుతుంది.

ఈశాన్యంపై దాడి
త్రిపురకు చెందిన విద్యార్థి ఏంజెల్‌ చక్మాను ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబర్‌ 28న దారుణంగా హత్య చేయడం దేశాన్ని దిగ్భ్రాంతపరచింది. పైగా అతన్ని సోదరుడితో సహా చైనీయులంటే ఇష్టానుసారం దూషించి హింసించారు, తర్వాత చక్మా ఆస్పత్రిలో చనిపోయారు. ఇతరుల వివాదం పరిష్కరించేందుకు వెళ్లిన ఆ యువకుడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతే పోలీసు ఎస్పీ అజయ్ సింగ్‌ ఇందులో జాతి వివాదం లేదని సమర్థించేందుకు పాకులాడటం మరింత దారుణం. నిజానికి అదేమీ నిజం కాదనీ తాము వాస్తవం చెప్పినా వారు వినిపించుకోలేదని బతికిబయటపడిన అతని సోదరుడు ఘోషిస్తున్నాడు. నిందితులను శిక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామీ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాకు హామీ ఇవ్వాల్సి వచ్చింది. రెండు చోట్లా బీజేపీ ప్రభుత్వాలేవున్నాయి కూడా. ఉత్తరాఖండ్‌ గతంలో ఉత్తరప్రదేశ్‌లో భాగంగా ఉండేదన్నది తెలిసిన విషయమే.

మొత్తంగా జాతి, మత విద్వేషాలు పెంచిన ఫలితాలు వారికే బెడిసికొడుతున్నా యన్నమాట. ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్‌లో రగిలిన జాతి కలహాలకూ రాజకీయంగా ఆజ్యం పోసింది బీజేపీనే. ఈశాన్యం ఇప్పుడు తమ పట్టులోకి వచ్చిందని ఆ నాయకులు గొప్పలు పోయారు. కానీ, వరుసగా అనేకచోట్ల ఈశాన్య ప్రాంత విద్యార్థులపై, గిరిజనులపై, చైనీయులనీ, బంగ్లాదేశీయులని ఆరోపిస్తూ దాడులు చేశారు. బంగ్లా చొరబాటు దారులను తరిమివేస్తామని అమిత్‌షా అదేపనిగా ప్రకటించడానికీ ఈ దాడులకూ సంబంధం స్పష్టమే. గాలింపు, తొలగింపు, తరలింపు (డిటెక్ట్‌, డెలిట్‌,డిపోర్ట్‌)అనేది ఆయన మంత్రంలా వినిపిస్తున్నారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, అస్సాం కాంగ్రెస్‌ నాయకులు కావాలని బంగ్లాదేశ్‌ అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నారని వారి ఆరోపణ.

మమతా అవకాశవాద రాజకీయాలు ఎలాగూ ఉన్నాయి గానీ బీజేపీ నేతలు దీన్ని అంతర్గత వివాదంగా మార్చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిష్వాశర్మ ఈ విషయంలో ఎన్నో తీవ్ర వ్యాఖ్యలతో వరుసగా రెచ్చగొడుతున్నారు. ఈ రెండు చోట్ల బంగ్లాదేశ్‌ చొరబాటుదారుల తొలగింపు నినాదంతో ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ వ్యూహంగా మారింది. ఆ క్రమంలో ఇలాంటి వరస ఘటనలు సంభవిస్తున్నాయనేది నిజం.ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి సంఘం దీనిపై వివరమైన జాబితానే ప్రకటించింది. తమను దేశంలో భాగంగా చూడటం లేదా అని ప్రశ్నించింది.చదువు ఉద్యోగాల కోసం వస్తే వెంటాడి చంపడమేమిటని మాజీ బిఎస్‌ఎఫ్‌ జవాను,అంజేల్‌ చక్మా తండ్రి ఆవేదన వెలిబుచ్చారు. అతను నిజానికి ఎంబిఎ చదవడం కోసమే డెహ్రాడూన్‌ వెళ్లాడు.

వ్యాపారులు కార్మికులపై దాడులు
మతసామరస్యాన్ని కాపాడుకునే కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో సంఘ పరివార్‌ దుండగులు రామ్‌ నారాయణ్‌ బెహల్‌ అనే గిరిజనుడిపై బంగ్లాదేశీయుడంటూ దాడి చేసి ప్రాణాలు తీశారు. నిజానికి కేరళ వాసులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడంలో చాలా ఎక్కువ. కేరళ రాజకీయ చైతన్యం, విద్యా వైద్యస్థాయి కూడా దేశమంతటా పేరుగాంచింది, అలాంటి చోట ఈ ఘటన జరగడం పరిస్థితి దేశంలో ఎంతగా దిగజారిందో చెబుతుంది. కేరళ పోలీసులు ప్రభుత్వం దీన్ని తీవ్రంగా తీసుకుని కేసు నమోదు చేశారు. ఒరిస్సాలోని సంబా ల్పూర్‌లో పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కార్మికుడు జ్యూయల్‌ షేక్‌ను కూడా బంగ్లాదేశీయుడనే పేరుతో బలిగొన్నారు. ఒక టీ దుకాణం దగ్గర ఆగంతుకులు అతన్ని గుర్తింపు పత్రాలు చూపించమని ఒత్తిడి పెట్టారు.వాటిని చూపించలేదు గనక అక్రమ వలసదారుడంటూ అక్కడికక్కడే చంపేశారు. ఈ ఘటన బెంగాల్‌ను కుదిపేసింది.ఆ తర్వాత రెండు రోజులకు మరో బెంగాలీ వ్యాపారిపైనా దాడి జరిగింది.

తమిళనాడు లోనైతే ఒడిషాకు చెందిన వ్యక్తిని రైలులో ప్రయాణిస్తుండగా కత్తులు కటార్లతో కుర్రాళ్లు దాడి చేశారు.అతన్ని కొట్టి వేధించి దాడిని చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇవొక తరహాకు చెందిన దాడులైతే మరో తరహా మత విద్వేష దాడులు కూడా ఈ కాలంలోనే జరుగుతున్నాయి. కొన్నిచోట్ల మరణాల వరకూ వెళ్తే మరికొన్ని వేధింపులపర్వంగా మారాయి. హర్యానా, హిమచల్‌ ప్రదేశ్‌లో కాశ్మీరీ శాలువల వ్యాపారులను వెళ్లగొట్టడం అందులో భాగమే. ప్రసిద్ధిగాంచిన కాశ్మీరీ శాలువా వ్యాపారులు దీర్ఘకాలంగా అక్కడకక్కడా శిబిరాలు ఏర్పాటు చేసుకుని విక్రయాలు సాగిస్తుంటారు. హర్యానాలోని ఖైతారాలో దుండగులు వారిని చుట్టుముట్టి వందేమాతరం పాడాలని నిర్బంధించారు. కొట్టి వేధించారు. హిమచల్‌ ప్రదేశ్‌లోని ఫరిదాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఫలితంగా అక్కడ ఎప్పటినుంచో వుంటున్న పద్దెనిమిది మందిలో పదహారు మంది ప్రాణభయంతో పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

క్రిస్‌మస్‌ కల్లోలం,జీహాద్‌ కల్పన
మరో వైపున క్రిస్‌మసస్‌ రోజున చర్చిలపైనా, వేడుకలపైనా దాడులు దేశమంతటా క్రైస్తవుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. భద్రతకోసం మత గురువులు నేరుగా ప్రధాని మోడీకే విజ్ఞప్తి చేశారు. చివరకు ఆయన పరిస్థితిని కప్పిపుచ్చడం కోసం ఢిల్లీలో చర్చి ప్రార్థనకు హాజరై అంతా బావుందన్నట్టు సంకేతం ఇచ్చేందుకు విఫలయత్నం చేశారు. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, ఒరిస్సా, అస్సాం, హర్యానా,మధ్యప్రదేశ్‌లలో ఇలాంటి అనేక ఘటనలు జరిగాయి. విహెచ్‌పి, భజరంగదళ్‌ దుండగులు అలంకరణలను ధ్వంసం చేశారు. ప్రార్థనా గీతాలాపనలు అడ్డుకుని ప్రజలను చెదరగొట్టారు.

చర్చిలే గాక మిషనరీ పాఠశాలలపైనా దాడికి దిగారు.వీటిపై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సంపాదకీయ వ్యాఖ్య రాస్తూ కేరళలో తప్ప మరెక్కడా పోలీసులు దాడులను ఆపే ప్రయత్నం చేయలేదని విమర్శించింది. మతబృందాల మధ్య విద్వేషం పెంచే భారతీయ న్యాయసంహిత (బిఎన్‌ఎస్‌) 196 (2)299 సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటే పరిస్థితి మరోలా వుండేదని వ్యాఖ్యానించింది. జబల్‌పూర్‌లో బీజేపీ నాయకురాలు క్రైస్తవ ప్రార్థనలపై అవమానకరంగా చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ అడిగామని బీజేపీ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ఇదే సరిపోతుందా? అని ఆ పత్రిక ప్రశ్నించింది.ఈ ఏడాదిలో ఇలాటి ఆరువందల దాడులు జరిగినట్టు యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరం వెల్లడించింది.

వికీపీడియాలో దీనిపై ప్రత్యేకంగా వివరాలు నమోదైనాయి. ఇక ముస్లిములపై దాడులు ఎప్పుడూ చూస్తున్నవే.ఈ నెలలోనే యూపీలోని బరైలిలో ఒక హోటల్‌లో పుట్టిన రోజు వేడుకలపై విహెచ్‌పి దాడి చేసింది.ఈ వేడుక ‘లవ్‌ జీహాద్‌’ అని అరోపిస్తూ అన్నిటినీ ధ్వంసం చేసింది. ఒక విద్యార్థిని పుట్టినరోజు వేడుకలకు వచ్చినవారి పేర్లు అడిగి మరీ దాడి చేశారు. హోటల్‌ యాజమాన్యాన్ని కూడా భయపెట్టారు. ఒకవేళ ఎవరైనా మతాంతర వివాహం చేసుకున్నా ఆపడానికి వీరికి హక్కు ఎవరిచ్చారు? అందుకోసం విధ్వంసం దాడులు చేయడమా?ఇక్కడ కొసమెరుపు ఏమంటే మొదట పోలీసులు విహెచ్‌పి మాటలు నమ్మి బిఎన్‌ఎస్‌ కింద కేసు నమోదు చేయడం. దీనిపై ఆ అమ్మాయి పోలీసులకు లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేశాక ఎట్టకేలకు పదిమందిపై కేసు పెట్టారు.

అసలు వారు ఆరోపిస్తున్నట్టు అక్కడ లవ్‌ జిహాద్‌ ఏమీ లేదని తేల్చేశారు. కానీ ఆ తర్వాత కూడా వారు నమోదు చేసిన కేసులో రిషబ్‌ ఠాకూర్‌, డీఫక్‌ పఠక్‌ అనే ఇద్దరి పేర్లతో కేసు పెట్టారుగానీ వారిద్దరూ అసలు లేరట, అంటే ఇదంతా కంటితుడుపు వ్యవహారంగా ముగిస్తారన్నమాట. ఉత్తర ప్రదేశ్‌,బెంగాల్‌,అస్సాం ఎన్నికల కోసం బీజేపీ,ఆరెస్సెస్‌లు ఏదో విధంగా మరోసారి మత రాజకీయాలు రగిలించే ప్రయత్నం తీవ్రం చేశాయని ఈ ఉదంతాలన్ని కళ్లకు కట్టినట్టు చెబుతున్నాయి. మమతా బెనర్జీ అవకాశవాద రాజకీయాలు ఒకవైపు, బీజేపీ మతతత్వం మరోవైపు పరిస్తితిని ఉద్రిక్తం చేస్తున్నాయి. ‘గుండెల మీద రాసుకోండి మేమే గెలుస్తున్నామని’ అమిత్‌షా స్వయంగా బెదిరిస్తున్నారు. కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్షుడైన నితిన్‌నబీన్‌ కూడా రంగంలోకి దిగారు.

అక్రమ చొరబాటు దారులందరినీ వెళ్లగొట్టేదాకా బీజేపీ నిద్రపోదని హెచ్చరికలు చేస్తున్నారు. ఒకవైపు మతం, మరోవైపు జాతి గుర్తింపులను రగిలించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సహించరానిది, ఈ క్రమంలో మరే దారుణమైన కుట్రలు వస్తాయో వాటిపై అవతలివారు ఎలా స్పందిస్తారో ఊహించవలసిందే. ‘చెట్టపట్టాల్‌ పట్టుకుని దేశస్తులందరూ నడవవలె నోయ్, అన్నదమ్ములు వలెను జాతులు మతములన్నియు మెలగవలనోయ్’ అన్న దేశభక్తి భావనకూ ఈ ద్వేషభక్తికీ ఏమైనా సంబంధం ఉందా? ఇతరుల మతాన్ని, జాతిని ద్వేషించడం ద్వారా దేశభక్తి అనడం ఎంతటి విపరీతం? ఈ విద్వేష వాదనలతో ప్రజలను ముఖ్యంగా యువతను దారితప్పించడమే మతతత్వ రాజకీయాల అసలైన లక్ష్యం. ఈక్రమంలో ఎందరు అమాయకులు బలైనా, ఎందరు వలసకార్మికుల జీవితాలు తలకిందులైనా వారికి పట్టదు. పైగా ఇరుగుపొరుగు దేశాలను ప్రస్తావించడం దౌత్యపరమైన సమస్యలకు కూడా దారితీస్తే ఆశ్చర్యం లేదు

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -