Thursday, November 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం సభపై ఓయూ భవితవ్యం..!

సీఎం సభపై ఓయూ భవితవ్యం..!

- Advertisement -

– చేయిచ్చిన గత ప్రభుత్వం.. ప్రస్తుత సర్కార్‌ చేయూతనిచ్చేనా..
– డిసెంబర్‌ 9న ముఖ్యమంత్రి రేవంత్‌ సభపై సర్వత్రా చర్చ
– డీపీఆర్‌ఓ సిద్ధం చేసిన అధికారులు
– ప్రొఫెసర్స్‌ నియామకాలకు ఎదురుచూపులు
– కాంట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగుల రెగ్యులరైజ్‌ పై స్పష్టత వచ్చేనా ?
– పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన వీసీ ప్రొ.కుమార్‌

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ.. ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేక విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న 110 ఏండ్ల అరుదైన ప్రాచీన యూనివర్సిటీ. అలాగే తెలంగాణ విద్యార్థుల కలలు నిజం చేసే విద్యా, పరిశోధనల వేదిక. ప్రభుత్వం ఏదైనా.. దాని ప్రజావ్యతిరేక విధానాలు, లోపాలను ఎత్తి చూపే, ప్రశ్నించే వేదిక. ఇదొక ఎత్తయితే ప్రజలను, ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను ఆకర్షించే వేదిక కూడా ఇదే. అలాంటి వేదిక నిధులు.. నియామకాలు లేక నిత్యం పురిటినొప్పులు పడుతోంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్‌ తొమ్మిదిన ఓయూకు రానున్న నేపథ్యంలో ‘ఓయూ’ చేయూతనిచ్చేనా? అనే చర్చలు సాగుతున్నాయి.

రూ.200 కోట్లు అని 50 కోట్లే ఇచ్చిన గత ప్రభుత్వం
ఓయూ సెంటినరి వేడుకలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. యూనివర్సిటీలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని, అందుకోసం, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి రూ200 కోట్లు ఇస్తామని ప్రకటించారు. అనంతరం ”మీరు అంతర్గత నిధులతో విద్యార్థులకు, వర్సిటీకి అవసరమైన నిర్మాణాలు చేసుకోండి” అంటూ చివరికి రూ.50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత ప్రభుత్వం ఓయూ అభివృద్ధి పట్ల అంటిముట్టనట్టుగా, నియామకాలు చేయకపోవడంతో బోధన, పరిశోధన కుంటుపడిందన్న విమర్శలున్నాయి.

ఈ సీఎం చేయూతనిచ్చేనా ?
ఈ ఏడాది ఆగస్టులో సీఎం రేవంత్‌రెడ్డి ఓయూలో పర్యటించి పలు వసతిగృహాలను ప్రారంభించారు. పలు హాస్టల్స్‌కు నూతన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఠాగూర్‌ ఆడిటోరియంలో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. ఓయూ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, నియామకాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఓయూకు మళ్లీ డిసెంబర్‌లో వస్తానని, డీపీఆర్‌ఓ తయారు చేయాలని చెప్పారు. అలాగే, వర్సిటీకి రూ.1000 కోట్ల నిధులు ఇస్తామని హామినిచ్చారు. ఇది శుభపరిణామం అయితే.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని, సీఎం, మంత్రులు పలు వేదికలపై పలు సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓయూకు ఇస్తామన్న వెయ్యి కోట్లలో ఎంతవరకు ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

ఓయూ వీసీ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌
ఓయూ అభివృద్ధిపై సీఎం సలహాదారు కె.కేశవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల సమక్షంలో ఈనెల 24న రాత్రి 9-30 నుంచి 11 గంటల వరకు ఓయూ వీసీ ప్రొఫెసర్‌ కుమార్‌ సిద్ధం చేసిన డీపీఆర్‌ఓపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేశారు. మరోవైపు సీఎం ఓయూలో ఉద్యోగులతో కలిసి సహపంక్తి భోజనం చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

రిక్రూట్‌మెంట్స్‌తో ప్రాణం పోస్తారా..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టిన నియామకాలు తప్ప ఓయూలో మళ్లీ ప్రొఫెసర్ల నియామకాలు చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం నియామకాలు చేయకుంటే ఓయూ బోధన, పరిశోధన, మనుగడ ప్రశ్నార్థాకం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓయూకు దగ్గరవ్వాలని చూస్తున్న సీఎం.. ఇస్తామని చెప్పిన రూ.1000 కోట్లు ఎంత వరకు ఇస్తారోనన్న చర్చ నడుస్తోంది. రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ ప్రొఫెసర్స్‌ పోస్టుల్లో నియామకాలపై వేచి చూస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు, టైమ్‌ స్కెల్‌ ఉద్యోగుల రెగ్యులరైజ్‌పై డిసెంబర్‌ 9న ఆర్ట్స్‌ కళాశాల వద్ద జరిగే సీఎం సభలో ఏమైనా స్పష్టత వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఓయూ అధికారులు డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌ఓ)ను ఇప్పటికే సిద్ధం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -