మనం ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున, గణతంత్ర దినోత్సవం రోజున ఎంతో ఘనంగా, ఎంతో గర్వంగా మూడు రంగుల జెండాను ఎగరవేస్తాం. ఇంకా దేశభక్తితో సెల్యూట్ చేస్తాం. ఆ జెండా మనకు ఊపిరి, బలం, గుర్తింపు చిహ్నం. ప్రతి భారతీయుడు అత్యంత పవిత్రంగా భావించే ఈ మువ్వన్నెల జెండాను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారు.
140 కోట్ల మంది భారతీయుల స్ఫూర్తి చిహ్నంగా భావిస్తూ ఢిల్లీలోని ఎర్రకోట మొదలు పల్లెలోని పంచాయతీ కార్యాలయాల వరకు ఈ పతాకం రెపరెపలాడుతూనే ఉంటుంది. ఈ జాతీయ జెండాను చూడగానే ప్రతి భారతీయుని హదయం గోదావరిలా ఉప్పొంగి ప్రవహిస్తుంది. పింగళి వెంకయ్య కష్ణాజిల్లా మువ్వ మండలంలోని బట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ వారు భారతదేశ ప్రభుత్వ కార్యాలయంలో వారి జెండాను ఎగురవేయడం పింగళి వెంకయ్యకి ఏమాత్రం నచ్చేది కాదు. మనం స్వతంత్రంగా మన దేశానికి ఒక జెండాను తయారు చేసుకోవాలనే ఒక సరికొత్త ఆలోచన పింగళి వెంకయ్య మనసులో నాటుకుంది. అప్పటినుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితో జాతీయ జెండా ప్రతిపాదన గురించి చర్చలు జరిపేవారు. ‘భారతదేశానికి ఒక జాతీయ జెండా’ అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. అప్పట్లో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది.
పింగళి వెంకయ్య 1906 నుండి 1922 వరకు భారత జాతీయ ఉద్యమంలోని వివిధ ఘట్టాల్లో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతిసారీ గాంధీజీతో జెండా గురించి చర్చించేవారు. ఒకసారి నల్గొండ జిల్లా నడిగూడెం పత్తి రైతులకు పత్తి పంటను పరిచయం చేయాలనే ఉద్దేశంతో మునగాల జమీందారు నాయని వెంకట రంగారావు పత్తి వెంకయ్యగా ప్రసిద్ధి చెందిన వెంకయ్యని అక్కడికి తీసుకువచ్చారు. వీరు కొంతకాలం ఈ జమీందారు గారికి సలహాదారులుగా ఉన్నారు. ఆ సమయంలోనే గాంధీజీ పిలుపుని అందుకున్న వెంకయ్య జెండా రూపకల్పనకు ఇక్కడే శ్రీకారం చుట్టారు. భారతీయులందరినీ ఒకే జెండా కింద ఉంచాలని దఢంగా సంకల్పించారు. ఆ సంకల్ప బలంతోనే మొదటగా కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిపి మధ్య రాట్నం గల ఒక జెండాను చిత్రించారు. ఈ జెండాకు వెంకయ్య స్వయంగా రంగులు కూడా అద్దారు. ఈ జెండాని 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ సమావేశంలో గాంధీ తొలిసారిగా ఎగురవేశారు. అనంతరం సత్యం అహింసలకు నిదర్శనమైన తెలుపు రంగును కాషాయం ఆకుపచ్చ రంగుల మధ్యలో ఉండేలా రూపొందించాలని గాంధీజీ అభిప్రాయ పడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి రూపొందించారు. మధ్యన రాట్నం చిహ్నం మన జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్పురింపజేస్తుంది. అంటే కార్మిక, కర్షకులపై ఆధారపడిన మన దేశం సత్యం, అహింసల పై ఆధారపడడంతో సుభిక్షంగా ఉంటుందని భావించిన గాంధీ, పింగళి వెంకయ్య గార్ల ఆశయమే మన త్రివర్ణ పతాకం.
అయితే 1945 జులై 22వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ పతాకంలో రాట్నం బదులుగా అశోక చక్రం ఉండాలని సూచించారు. దీంతో రాట్నానికి బదులుగా ధర్మచక్రం ఏర్పాటు చేశారు. ఈ ఒక్క మార్పు తప్ప పింగళి వెంకయ్య రూపొందించిన జెండానే జాతీయ జెండాగా ఉపయోగిస్తున్నాం. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సాంస్కతికి చిహ్నంగా పేర్కొంటాం. ఈ జెండాని 22 జులై 1947న రాజ్యాంగం ఆమోదించింది. దీని పొడవు- వెడల్పు 2:3 నిష్పత్తిలో ఉంటుంది. తెలుపు మధ్యలో నేవీబ్లూ రంగులో 24 ఆకుల అశోక ధర్మ చక్రం ఉంటుంది. కాషాయం రంగు పరాక్రమం, ధైర్యం త్యాగస్పూర్తిని సూచిస్తుంది. తెలుపు రంగు శాంతి, స్వచ్ఛత, సత్యం, నిజాయితీని తెలియజేస్తుంది అలాగే ఆకుపచ్చ రంగు పెరుగుదల, వ్యవసాయం, శ్రేయస్సును సూచిస్తుంది అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. ‘బ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా’ అనేది భారతదేశ జాతీయ జెండా వినియోగాన్ని నియంత్రించే చట్టం. అశోక చక్ర నమూనాను సారనాథ్‌లోని అశోక స్తంభం నుంచి తీసుకున్నారు. ఈ జాతీయ జెండాని ఖాదీ బట్టతో మాత్రమే తయారు చేయాలని జాతీయ పతాక నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఈ జెండాలో ఎటువంటి మతపరమైన ప్రతీకలు లేవు. మన దేశానికి స్వాతంత్రం రావడానికి మూడు రోజుల ముందు ఏర్పాటు అయిన రాజ్యాంగ సభ భారత ముద్దుబిడ్డ రూపొందించిన ఈ పతాకాన్ని అన్ని పార్టీలకు అన్ని మతాలకు ఆమోదయోగ్యమైన పతాకంగా స్వీకరించడానికి నిర్ణయించారు. ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం, సంపద అంతా ఈ జాతీయ పతాకంలో ప్రతిబింబిస్తుంటాయి. జాతి యావత్తు గర్వపడేలా మువ్వన్నెల జెండాని నిరూపొందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనమంతా గర్వించతగ్గ విషయం. మన భారతదేశంలోని ప్రతి ఇంటా రెపరెపరలాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచం మొత్తం వ్యాపింప చేస్తుంది ఈ త్రివర్ణ పతాకం.
- పింగళి భాగ్యలక్ష్మి, 9704725609