– అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం : మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
– ప్రీస్కూల్ చిన్నారులకు ప్రతిరోజూ పాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ-ములుగు
రాష్ట్రంలోని పేద పిల్లలకు బలమైన ఆహారం అందించి, పోషకాహార లోపాన్ని అధిగమించి పోషకాహార లోపరహిత తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. చిన్న పిల్లలు దేవుళ్లతో సమానమని, అంగన్వాడీ టీచర్లు వారిని సొంత పిల్లల్లా చూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ చిన్నారులకు ప్రతిరోజూ 100 మి.లీ పాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ములుగు జిల్లాలో పేదరికం అధికంగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుండే మొదలుపెట్టినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయడానికి ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారని, టీచర్లకు చీరలు పంపిణీ చేయడంతోపాటు వేతనాలు పెంచారని అన్నారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా సెంటర్లను బలోపేతం చేస్తున్నామని, టీచర్లు తల్లిదండ్రులతో నిత్యం సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు అనుకోకుండా మృతి చెందితే వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని, ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలపై ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని కోరారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లల ఆస్తులను జప్తు చేసి తల్లిదండ్రుల పేరు మీదకు మార్పిడి చేస్తామని హెచ్చరించారు. బాలల హక్కుల పరిరక్షణతోపాటు బాల్య వివాహాలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటీడీఏ పీవో చిత్రమిశ్ర, అదనపు కలెక్టర్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మెన్ రవీందర్ రెడ్డి, డీడబ్ల్యూఓ తుల రవి, సీడీపీఓ శిరీష, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారలోప రహిత తెలంగాణే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



