విద్యారంగంపై ఊహించని రీతిలో పెట్టుబడులు : ఐఎస్‌బీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ – హైదరాబాద్ బ్యూరో
మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ యువ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగించారు. యువ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతుందని, రాష్ట్ర అభివృద్ధికి ఐఎస్‌బీ విద్యార్థులు సహకరించాలని డిప్యూటీ సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ఎవరు ఊహించని రీతిలో పెట్టుబడులు పెడుతుందని తెలిపారు. విద్యపై పెట్టుబడి రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుందని ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా భావిస్తుందని వివరించారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల పెట్టుబడితో ఒక్కో పాఠశాల నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 104 పాఠశాలల నిర్మాణం ప్రారంభించినట్టు వివరించారు. విద్యార్థులు కళాశాల బయటికి వెళ్లగానే ఉద్యోగం పొందేలా స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ ఎలా ఉండాలి అనేది పారిశ్రామికవేత్తలతో మాట్లాడి డిజైన్ చేసినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చాకలి ఐలమ్మ పేరిట మహిళా యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఆనంద్ మహీంద్రా వంటి దిగ్గజాన్ని చైర్మన్‌గా నియమించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ఐఎస్‌బీ నిర్వాహకులు స్కిల్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను సందర్శించి వాటికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరారు. అవి ప్రారంభ దశలో ఉన్నందున ఇప్పుడు ఐఎస్‌బీ నుంచి సూచనలు అందితే, రాష్ట్ర భవిష్యత్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఐఎస్‌బీ విద్యార్థులు గొప్ప అదష్టవంతులని, ఒక్కో తరగతి గది రూ.1.50 కోట్ల నుంచి రూ.రెండు కోట్ల వరకు వెచ్చించి నిర్మించారన్నారు. తాను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సింగిల్ టీచర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నానని, రాసుకునేందుకు పలకలు కూడా లేకపోవడంతో గురువులు ఇసుకపైనే అక్షరాలు దిద్దించిన సందర్భాన్ని డిప్యూటీ సీఎం గుర్తుచేసుకున్నారు. గురుపూజ దినోత్సవం రోజు ఐఎస్‌బీ వంటి గొప్ప విద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. విద్య అనేది కేవలం ప్రొఫెషనల్స్ తయారు చేయడమే కాకుండా, సమాజం కోసం, మానవత్వం కోసం నాయకులను తీర్చిదిద్దాలన్నది తమ ప్రజా ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఈ సెంటర్ భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండాలని ఆకాంక్షించారు. స్కిల్ యూనివర్సిటీ శాశ్వత కాంపస్ ఫ్యూచర్ సిటీలో ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో మోతిలాల్ ఓస్వాల్ డీన్ మదన్ పిల్లుట్ల, ప్రభాత్ సిన్హా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ్థే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES