Tuesday, March 10, 2026
E-PAPER
Homeఆటలులక్ష్యం ఒలింపిక్స్‌ పసిడి

లక్ష్యం ఒలింపిక్స్‌ పసిడి

- Advertisement -

భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌

టీమ్‌ ఇండియా సరికొత్త చరిత్ర లిఖిస్తూ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను మూడోసారి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడేండ్లలో రెండు సార్లు పొట్టి కప్పును ముద్దాడిన టీమ్‌ ఇండియా ఆధునిక క్రికెట్‌లో బ్యాటింగ్‌ శైలికి కొత్త నిర్వచనం ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌ సాధించిన విజయ సారథి సూర్యకుమార్‌ యాదవ్‌.. తర్వాతి లక్ష్యం ఒలింపిక్స్‌ పసిడి పతకమే అంటున్నాడు.

నవతెలంగాణ-అహ్మదాబాద్‌: ఐసీసీ టోర్నమెంట్లలో నయా రికార్డులు నెలకొల్పటంలో టీమ్‌ ఇండియా ముందంజలో ఉంటుంది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను ఆతిథ్య జట్టు ఎన్నడూ నెగ్గని దశలో.. 2011లో ధోనీసేన రికార్డులు తిరగరాసింది. టీ20 ప్రపంచకప్‌ను సైతం గతంలో ఆతిథ్య జట్టు గెలుపొందలేదు. కానీ 2026లో సూర్యసేన మళ్లీ కొత్త పంథా షురూ చేసింది. 2024లో టీ20 ప్రపంచకప్‌, 2025లో చాంపియన్స్‌ ట్రోఫీ, 2026లో టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత్‌.. హ్యాట్రిక్‌ టైటిల్స్‌తో ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఈ క్రమంలో 2028 లాస్‌ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లోనూ టీమ్‌ ఇండియా పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పోటీపడనుండగా.. 2028 జులై 14 నుంచి 29 వరకు పోటీలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో, టీ20 ప్రపంచకప్‌ సాధించిన ఉత్సాహంలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌.. తన, జట్టు తర్వాతి లక్ష్యం 2028 ఒలింపిక్స్‌ పసిడి పతకమే అని అంటున్నాడు.
2026 టీ20 ప్రపంచకప్‌ ప్రయాణం గొప్పగా సాగింది. మేము అనుకున్న రీతిలో ఆరంభంలో రాణించలేదు. కానీ క్రికెట్‌లో ఇవన్నీ సహజమే. ఈ ప్రయాణంలో జట్టు అంతా సమిష్టిగా రాణించి, సాధించిందే ఈ ట్రోఫీ. ఈ విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. మా తర్వాతి లక్ష్యం ఒలింపిక్స్‌ పసిడి పతకమే. 2024 టీ20 ప్రపంచకప్‌ విజయం భారత క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ తర్వాత భారత్‌ భిన్నమైన క్రికెట్‌ ఆడింది. ఏ తరహా క్రికెట్‌ ఆడాలని అనుకున్నామో, అందుకోసం శ్రమించాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఈ విజయం అందుకున్నాం. 2024లో టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత.. 2025లో చాంపియన్స్‌ ట్రోఫీ, ఇప్పుడు మళ్లీ టీ20 ప్రపంచకప్‌ విజయం సొంతమైంది. సొంతగడ్డపై ప్రత్యేక ప్రదర్శన చేయాలని అనుకున్నాం. అహ్మదాబాద్‌లో అసమాన విజయం అందుకున్నాం. ఇదే జోరు 2027, 2028, 2029లోనూ కొనసాగించాలని అనుకుంటున్నాను’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -