Wednesday, December 10, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువివక్ష-పేదరిక నిర్మూలనే లక్ష్యం

వివక్ష-పేదరిక నిర్మూలనే లక్ష్యం

- Advertisement -

– దానికోసమే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ .. విద్య, వ్యవసాయం, కమ్యూనికేషన్‌ రంగాలకు అధిక ప్రాధాన్యం
– 2047 నాటికి దేశ జీడీపీలో రాష్ట్ర వాటా పదిశాతం : తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ముగింపు సభలో సీఎం రేవంత్‌రెడ్డి
– ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్రోన్‌ షో… గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు
– విజన్‌ డాక్యుమెంట్‌ను వేదికపైకి తీసుకొచ్చిన రోబో
– ఆవిష్కరించిన సీఎం, డిప్యూటీ సీఎం, ఆనంద్‌ మహీంద్రా తదితరులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణలో వివక్ష, పేదరికాన్ని నిర్మూలించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దానికోసం విద్య, వ్యవసాయం, కమ్యూనికేషన్‌ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని ప్రకటించారు. తెలంగాణ సుస్థిర, సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేలా తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ దార్శనిక పత్రంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌- 2047 ముగింపు సభలో విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిం చారు. ఈ డాక్యుమెంట్‌ కాపీని రోబో వేదిక పైకి తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభ ముగిసిన అనంతరం డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా విజన్‌ డాక్యుమెంట్‌లోని అంశాలను వ్యూహాత్మక దృశ్యాలతో ఆకాశంలో ప్రదర్శించారు. ఆ షోకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నిటిఅయోగ్‌ వైస్‌ చైర్మెన్‌ సుమన్‌బెర్రి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు దువ్వూరి సుబ్బారావు, రఘురామరాజన్‌, ఎస్టీమ్‌ గ్లోబల్‌ గెస్ట్‌ సర్‌ టోనీ బ్లెయర్‌, మహీంద్రా గ్రూప్‌ చైర్మెన్‌ మహీంద్రా ఆనంద్‌, ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణ్యం, కార్తిక్‌ మురళీధరన్‌, సినీనటుడు చిరంజీవి వేదికపై ఆశీను లయ్యరు. ఆన్‌లైన్‌ద్వారా ప్రేమ్‌జీ వాసవ్‌ కార్య క్రమంలో భాగస్వామి అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనకు ఆన్‌లైన్‌లో నాలుగు లక్షల మంది తమ విలువైన సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉందన్నారు. జల్‌, జంగిల్‌, జమీన్‌ నినాదంతో కొమురం భీం, ఆ తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం వేలాది మంది పోరాటాలు చేసిన గడ్డ అని చెప్పారు. ఆ స్ఫూర్తి నుంచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆశించిన, ప్రణాళికాబద్ధ అభివృద్ధి జరగలేదనీ, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ప్రజలు ఆశతో ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పారు. 2047 నాటికి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు అవుతుందనీ, అప్పటివరకూ దేశాన్ని 30 ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. దేశంలో 2.9 శాతం జనాభాగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఐదు శాతం జీడీపీని కాంట్రిబ్యూట్‌ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ద్వారా పది శాతం డీజీపీని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం ప్రకటించారు. మేధావులను, ఆర్థికనిపుణులను, వ్యాపారవేత్తలను, ప్రజలను భాగస్వామ్యం చేసి రూపొందించిన ఈ పాలసీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నామని చెప్పారు. యువత, రైతులు, మహిళలకు ఈ పాలసీ ద్వారా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

గాంధీ సూచనల మేరకు తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ తొలుత విద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడున్న ప్రముఖ యూనివర్సిటీలు, ప్రముఖ ప్రాజెక్టులను ఏర్పాటు చేశారని వివరించారు. అదే దారితో తమ ప్రభుత్వం కూడా విద్య, ఇరిగేషన్‌తో పాటు కమ్యూనికేషన్‌ రంగానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. చైనా, జపాన్‌, కొరియా, సింగపూర్‌ దేశాల్లో అభివృద్ధే తమకు రోల్‌మోడల్‌ అని చెప్పారు. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. భారతీయుల ఆయు ప్రమాణం 73 ఏండ్లు ఉన్నదంటే దానికి నెహ్రూ తీసుకొచ్చిన విధానాలే కారణమని గర్వంగా చెప్పారు. తనకు 11 ఏండ్ల ప్రాయంలో పెద్ద యాక్సిడెంట్‌ జరిగిందనీ, ఉస్మానియా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నానని చెప్పారు. అలాంటి ఆస్పత్రులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ముందుకు సాగుతామని తెలిపారు. నేటికీ గ్రామాల్లో ప్రజలు వివక్షా రూపాలను ఎదుర్కొంటున్నారనీ, కొందరిని దేవాలయాల్లోకి కూడా రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం నుంచి జాతి వివక్షను దూరం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. దళితులకు, ఆదివాసీలకు, మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు వేర్వేరుగా ఉండటం, ఆ పిల్లల్లో తాము వేరు అనే భావన ముద్ర పడేలా చేయడం సరికాదనే ఉద్దేశ్యంతోనే వంద నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు రూపకల్పన చేశామన్నారు. 140 కోట్ల ప్రజానీకమున్న మన దేశానికి ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్‌మెడల్‌ కూడా రాకపోవడం లోటేననీ, దానికోసమే ప్రత్యేక క్రీడా పాలసీ రూపొందించామన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో విజన్‌ డాక్యుమెంట్‌కు రూపకల్పన చేశామన్నారు.
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాంరాజన్‌ మాట్లాడుతూ హెల్త్‌, ఎడ్యుకేషన్‌, స్కిల్‌ మీద కేంద్రకరించి పనిచేయడం గొప్ప విషయమన్నారు. దేశంలో పట్టణీకరణతో పాటు, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు.

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ గతంలో ఐకాన్‌ సిటీగా బెంగుళూరు ఉండేదనీ, ఇప్పుడు ఆ స్థానాన్ని హైదరాబాద్‌ వేగంగా ఆక్రమిస్తోందని తెలిపారు. నిరుద్యోగం నిర్మూలనపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టి పనిచేస్తున్నదన్నారు. ఏటా 8 నుంచి 9 శాతం వృద్ధి రేటు సాధిస్తే పదేండ్ల తర్వాత తెలంగాణ మోడల్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ విజన్‌ డాక్యుమెంట్‌పై ప్రతి ప్యానెల్‌ విభిన్న ఆలోచనలను తమతో పంచుకున్నదని తెలిపారు. పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు కలిపితేనే ఉత్పాదకత వుతుందనీ, ఆ దిశగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకున్నదని వివరించారు.

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి మాట్లాడుతూ హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఫిల్మ్‌హబ్‌గా మార్చాలనే ఆలోచనను సీఎం తనతో పంచుకున్నారని తెలిపారు. అన్ని దేశాల నటులు ఇక్కడకు వచ్చి షూటింగ్‌లు చేయించాలనే ఆలోచన రావడం గొప్ప విషయమనీ, హైదరాబాద్‌ నగరంలో విభిన్న వాతావరణ పరిస్థితులు, వనరులు ఉన్నాయని తెలిపారు. సినిమా హబ్‌గా తెలంగాణను మార్చేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామనీ, దీనికోసం ప్రత్యేకంగా ఓ సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు. నిటి అయోగ్‌ వైస్‌ చైర్మెన్‌ సుమన్‌బెర్రి మాట్లాడుతూ తెలంగాణలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయనీ, దాన్ని ఆధారం చేసుకొని ఉత్పాదకతపై ఫోకస్‌ పెట్టాలన్నారు. నిటి ఆయోగ్‌ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ విజన్‌ ఉందని ప్రశంసించారు. వైద్యం, విద్య విషయంలో రోడ్‌మ్యాప్‌ వేసుకోవడం గొప్ప విషయమని ప్రసంసించారు.

ప్రజలే కేంద్రంగా బ్లూ ప్రింట్‌
మహీంద్రా గ్రూప్స్‌ చైర్మెన్‌ ఆనంద్‌ మహీంద్రా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బ్లూ ప్రింట్‌ ప్రజలే కేంద్రంగా ఉన్నదని మహీంద్రా గ్రూప్స్‌ చైర్మెన్‌ ఆనంద్‌ మహీంద్రా చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో ఈ సమ్మిట్‌ కొత్త అధ్యాయమనీ, ఫ్యూచర్‌ విజన్‌ ప్రకటించడం గొప్ప విషయమన్నారు. అయితే ఇది ఛాలెంజింగ్‌తో కూడుకున్నదని చెప్పారు. తనను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మెన్‌గా ఉండాలని కోరగా మొదట తిరస్కరించాననీ, ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి విజన్‌, లక్ష్యాలు విన్నాక కాదనలేకపోయానని చెప్పారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ భారతదేశ స్థితిగతిని మార్చబోతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -