Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుసర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యం

సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యం

- Advertisement -

– నేటినుంచి జయశంకర్‌ బడిబాటొ రాష్ట్రవ్యాప్తంగా 19 వరకు నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరంలో జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఈనెల 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. మొదటిరోజు గ్రామసభ నిర్వహించాలి. ఏడున ప్రతి ఇంటినీ సందర్శించి బడిఈడు పిల్లలను గుర్తించాలి. అయితే బక్రీద్‌ పండుగ ఉన్నందున ముస్లిం ఉద్యోగులు, ఉపాధ్యాయులు మినహాయింపు ఉంటుంది. ఎనిమిది నుంచి పదో తేదీ వరకు కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేపట్టాలి. అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించాలి. డ్రాపౌట్‌ పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంతోపాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి. ఈనెల 11న బడిబాట ప్రారంభం నుంచి నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలి. 12న పాఠశాలల పున:ప్రారంభం రోజే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభిం చాలి. అదేరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫారాలను అందించాలి. 13న సామూహిక అక్షరాభ్యాసం బాలల సభను నిర్వహించాలి. 16న ఎఫ్‌ఎల్‌ఎన్‌, లిప్‌ దినోత్సవం జరపాలి. 17న విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహించాలి. 18న తరగతి గదుల డిజటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకంపై ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి. ఈనెల 19న జయశంకర్‌ బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలను నిర్వహించాలి. బడిబాటను విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల డీఈవోలు, ఈవో-డీపీవోలు, సమగ్ర శిక్ష అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి. అన్ని ఆవాసాల్లో బడిఈడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదును పెంచాలనీ, నాణ్యమైన విద్యను అందించాలి. విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించాలి. స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ), అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు (ఏఏపీసీ) సహాయం తీసుకుని ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి. విలేజ్‌ ఎడ్యుకేషన్‌ రిజిస్టర్‌ (వీఈఆర్‌)ను అప్‌డేట్‌ చేయాలి. పర్మినెంట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నెంబర్‌ (పీఈఎన్‌)ను అప్‌డెట్‌ చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఆరో తరగతి, ఎనిమిదో తరగతిలో చేర్పించాలి. తక్కువ పిల్లలున్న పాఠశాలలను గుర్తించి వాటిలో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికను రూపొందించాలి. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సహాయంతో వారి వయసుకు తగ్గ తరగతిలో చేర్పించాలి. బాలికల నమోదును పెంచాలి. తల్లిదండ్రులు, విద్యార్థులు, పౌరసమాజంలో విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) గురించి అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలకు హాజరయ్యేలా చూడాలి. జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో కలెక్టర్లు, డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు ముఖ్యపాత్ర పోషించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad