– మూడంచెల్లో వైద్యం, మౌలిక వసతుల కల్పన
– గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రతి పౌరునికీ మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రజాప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నొక్కి చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో భాగంగా ”అందరికీ అందుబాటులో, తక్కువ ఖర్చుతో కూడిన, సమానమైన వైద్యం” అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో మంత్రి మాట్లాడారు. ‘హెల్త్ విజన్-2047’ ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రతతో కూడిన వైద్యాన్ని అందిస్తామని వెల్లడించారు. ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసేందుకు మూడంచెల విధానాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. నూతన ఉస్మానియా ఆస్పత్రి, నిమ్స్ విస్తరణ, వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ నలువైపులా మూడు టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాల గురించి వివరించారు. మెడికల్ టూరిజం పాలసీతో తెలంగాణను గ్లోబల్ హెల్త్ హబ్‌గా మారుస్తున్నామన్నారు. టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా 134 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామనీ, ఇందులో రోబోటిక్ సర్జరీలు, అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సలను కూడా చేర్చామని గుర్తు చేశారు. ప్రతి జిల్లాల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఉచితంగా కీమోథెరపీ అందిస్తున్నామన్నారు. డయాలసిస్ కేంద్రాల విస్తరణ, ట్రామా కేర్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ సేవలు, ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్‌లు వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చామని వివరించారు. ప్రస్తుతం బడ్జెట్‌లో 4 శాతంగా ఉన్న వైద్య రంగ కేటాయింపులను 2047 నాటికి 8 శాతానికి పెంచుతామని ప్రకటించారు.
కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి, యూనిసెఫ్ రీజినల్ హెడ్ డాక్టర్ జెలాలెం బిర్హాను, డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ శాంత అచ్చంట, అపోలో జేఎండీ డాక్టర్ సంగీత రెడ్డి, కిమ్స్ సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురువా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విశ్వవిద్యా కేంద్రంగా తెలంగాణ :మంత్రి దామోదర రాజనర్సింహ
తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ‘తెలంగాణ యాజ్ ఏ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్’ అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో మంత్రి ప్రసంగించారు. బాలికా విద్యకు పెద్ద పీట వేస్తున్నామనీ, అందులో భాగంగా కొత్తగా 16 నర్సింగ్ కళాశాలలు ప్రారంభించినట్టు తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 47 విశ్వవిద్యాలయాలు, 1,951 ఉన్నత విద్యా సంస్థలతో దేశంలోనే అత్యధిక కళాశాలల సాంద్రత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియోలో తెలంగాణ దేశంలోని టాప్ 5లో ఒకటిగా ఉందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.



