ఆటో డ్రైవర్లకు తక్షణం రూ.1,560 కోట్లు చెల్లించాలి : మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
నవతెలంగాణ -రాజన్న సిరిసిల్ల
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను మోసం చేసిందని, ఆటో డ్రైవర్లకు బాకీ ఉన్న రూ.1560 కోట్లను తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్లలో నిర్వహించిన ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా ఇన్సూరెన్స్ (ప్రమాద బీమా) బాండ్లను కేటీఆర్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుంటే హైదరాబాద్‌లో మహా ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో అన్నలతో బీఆర్‌ఎస్‌కు ఉన్న అనుబంధం కొత్తది కాదని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో ఆటో డ్రైవర్లు కూడా ముందుండి పోరాడారని గుర్తు చేశారు. ర్యాలీలు తీసి కేసీఆర్‌కు మద్దతుగా నిలబడ్డారన్నారు. వారి పాత్ర పోరాటంలో మరువలేనిదన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల పట్ల తన ప్రేమను చాటుకున్నారని తెలిపారు. ఆటో అన్నలకే కాకుండా, రాష్ట్రంలోని సుమారు 7 లక్షల మంది ఆటో కార్మికులకు, అడగకుండానే, మ్యానిఫెస్టోలో పెట్టకుండానే రూ.5 లక్షల ప్రమాద బీమాను కల్పించారని వివరించారు. కేసీఆర్ రైతు బీమాను తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో మార్పు, మార్పు అంటూ వచ్చిన వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసం ఎలా ఉంటుందో రెండేండ్లలో ప్రజలకు అర్థమైందని అన్నారు. రైతులు, యువత, మహిళలు సహా అందరినీ 420 హామీలతో మోసం చేశారని, రైతు రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతూ, దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, చల్మెడ తుల ఉమా, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో కార్మికులను మోసం చేసిన ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



