సోనమ్ వాంగ్‌చుక్ బుల్లెట్‌కు బుల్లెట్‌తో సమాధానం చెప్పరు
లడఖ్ పోరాటం శాంతియుతంగా కొనసాగుతుంది : సోనమ్ భార్య గీతాంజలి జె ఆంగ్మో
న్యూఢిల్లీ : ప్రభుత్వం భయం వాతావరణాన్ని సృష్టిస్తున్నప్పటికీ.. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద రక్షణల కోసం లడఖ్ పోరాటం శాంతియుతంగా కొనసాగుతుందని లడఖ్ ఉద్యమ నేత, పర్యావరణ, సామాజిక కార్యకర్త అయిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య, హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అడఖ్ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ అయిన గీతాంజలి జె ఆంగ్మో అన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం విదితమే. గతనెల 26న కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జోధ్‌పూర్ జైలులో వాంగ్‌చుక్‌ను ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల వార్త సంస్థతో ఆమె మాట్లాడారు. ఇది ఆయన (వాంగ్‌చుక్)ను పోరాడుతున్న లక్ష్యానికి మరింత కట్టుబడి ఉండేలా చేసిందని చెప్పారు. ఆరో షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణ కోసం డిమాండ్ చేస్తూ నిరసనకు నాయకత్వం వహించిన వాంగ్‌చుక్.. 35 రోజుల పాటు నిరాహారదీక్షలో ఉన్నారు.
గతనెల 24న శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. నిరసనకారులను అరెస్ట్ చేస్తూ, వారిని టార్చర్‌కు గురి చేస్తూ, కర్ఫ్యూలు, బలాన్ని ఉపయోగించి గొంతులను అణచివేయడం ద్వారా లడఖ్ ప్రజలలో ప్రభుత్వం, యంత్రాంగం భయాన్ని సృష్టిస్తున్నని గీతాంజలి జె.ఆంగ్మో ఆరోపించారు. వాంగ్‌చుక్ అరెస్ట్‌కు సరైన కారణాలు లేవనీ, అధికార యంత్రాంగాలు ఆయన చేసిన ప్రకటనలను తప్పుగా అర్థం చేసుకొని ఆయనపై దేశవ్యతిరేకి అనే ముద్ర వేశాయని అన్నారు. 35 రోజుల పాటు నిరాహర దీక్షలో, ఇప్పుడు జైలులో ఉన్నప్పటికీ.. లడఖ్, అక్కడి ప్రజల రక్షణ కోసం పోరాటానికి కట్టుబడే ఉన్నారని చెప్పారు. వారి పోరాటం గాంధీ సిద్ధాంతాలక అనుగుణంగా శాంతియుత మార్గంలో నడుస్తుందనీ, బుల్లెట్‌కు బుల్లెట్‌తో సమాధానం చెప్పరని అన్నారు.
మీడియాతో మాట్లాడకుండా తనను నిరోధించడంపై గీతాంజలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పని చేసే తీరు ఇది కాదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తీరును ఆమె విమర్శించారు. వాంగ్‌చుక్ డిటెన్షన్ ఆర్డర్‌ను న్యాయపరంగా సవాలు చేస్తానని చెప్పారు. ‘ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (ఎస్‌ఈసీఎంఓఎల్)కు ఫారీన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్స్ పునరుద్ధరించడం కోసం పోరాడతానని ఆమె తెలిపారు. విద్యా రంగంలో సంస్కరణల కోసం వాంగ్‌చుక్ స్థాపించిన సంస్థే ఎస్‌ఈసీఎంఓ. కాగా లడఖ్‌కు ఎట్టకేలకు స్వతంత్ర లేదా రాష్ట్ర హౌదా వస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. లడఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనీ, ఆ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్ పరిధిలో చేర్చాలని కోరడంతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న పోరాటంలో వాంగ్‌చుక్ ముందున్న విషయం తెలిసిందే.