Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'మధ్యాహ్న భోజనం' జోలికొస్తే ప్రభుత్వం భూస్థాపితమే

‘మధ్యాహ్న భోజనం’ జోలికొస్తే ప్రభుత్వం భూస్థాపితమే

- Advertisement -

– ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి
– జనజాగరణ, అక్షయపాత్ర అంటే ఊరుకోం : మధ్యాహ్న భోజన పథకం యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ
– ఇబ్రహీంపట్నంలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర 4వ మహాసభలు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

‘మద్యాహ్న భోజనం’ జోలికొస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ హెచ్చరించారు. కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ చేసిన వాగ్ధానాలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర 4వ మహాసభలు సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కామ్రేడ్‌ రంజాన్‌ నిరులానగర్‌లో ప్రారంభమయ్యాయి. ముందుగా ఇబ్రహీంపట్నంలోని మార్కెట్‌ యార్డు నుంచి మహాసభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షురాలు ఎలమోని స్వప్న అధ్యక్షతన నిర్వహించిన సభలో రమ మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 54,204 మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే నిధులు సరిపోకున్నా వారు నిర్వహిస్తున్నారన్నారు. అలాంటి పథకాన్ని జనజాగరణ, అక్షయపాత్రకు అప్పగించాలని ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ నిరంకుశ, నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు సీఐటీయూ నాయకత్వంలో పోరాడుతున్నారని, అయినా ప్రభుత్వం మొండిగా ముందుకే సాగితే అడ్డుకుంటామని స్పష్టంచేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రీన్‌ చానల్‌ ద్వారా వేతనాలు చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. అలాగే గుడ్లు, కూరగాయలు, వంటసామగ్రి కోసం చెల్లించాల్సిన బిల్లులు ఆరు మాసాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక హక్కుల పరిరక్షణకు ఐద్య ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. కార్మికుల డిమాండ్ల సాధనకు ఈ మహాసభ కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకూ వెనకా డబోమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ, పుప్పాల శ్రీకాంత్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రుద్ర కుమార్‌, చంద్రమోహన్‌, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ కవిత, జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్‌, డి.జగదీశ్‌, జిల్లా సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -