Thursday, October 30, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రభుత్వ రంగాల నిర్వీర్యానికి తెరదీశారు…

ప్రభుత్వ రంగాల నిర్వీర్యానికి తెరదీశారు…

- Advertisement -

ప్రభుత్వ రంగ బ్యాంకు, ఇన్సురెన్సులలో ప్రయివేట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు!!! ప్రభుత్వ రంగాల ఉనికిని ప్రమాదంలో పడవేసే ఎత్తుగడకు కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. ప్రయివేటు కంపెనీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ సెక్టర్లలోకి అనుమతించడంతో సంతృప్తి చెందని ప్రయివేటు పెట్టుబడిదారుల సమూహం ఏకంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ బీమా సెక్టర్లలోకి తామే ప్రవేశించడానికి ప్రభుత్వమే మార్గాన్ని సుగమం చేసింది. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వరంగ వ్యతిరేక విధానాలను అర్థం చేసుకోకపోతే నష్టాన్ని అంచనా వేయడంలో మన మంతా విఫలమైనట్టే. దురదృష్టవశాత్తు ప్రభుత్వ విధానాల రూపకల్పన చేసే సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు కూడా ప్రభుత్వ రంగాల్లో ప్రయివేటు పెత్తనానికి వత్తాసు పడుతూ అలాంటి నిర్ణయాలను ప్రభుత్వం ద్వారా ప్రకటింపజేస్తుండడం బాధాకరం.

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ సెక్టార్లలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థానాలను ఒక స్థానాన్ని ప్రయివేటు కార్పొరేట్‌ వ్యవస్థ నుండి నింపాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా విడుదల చేసింది. ఇది అత్యంత ప్రమాదకరమైన అడుగు. అక్టోబర్‌ నాలుగో తేదీన ”అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ కేబినెట్‌” ఈ మేరకు మార్గ దర్శకాలను, నియమ నిబంధలను విడుదల చేసింది. ఇన్సూరెన్స్‌ రంగంలో మేనేజింగ్‌ డైరెక్టర్ల స్థాయిలో ఒకరిని ప్రయివేటు సెక్టార్‌ ఉండి తీసుకునే విధంగా బ్యాంకింగ్‌ రంగంలో పూర్తికాలపు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయిలో ప్రయివేటు సెక్టార్‌ నుండి తీసుకునే విధంగా ఈ మార్గదర్శకాలు సూచి స్తున్నాయి. పార్లమెంట్‌లో చట్టం ద్వారా రూపు దిద్దుకున్న ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ ఇన్సూరెన్స్‌ సెక్టార్ల అత్యున్నత స్థాయి విధులను చట్టాల్లో మార్పులు తీసుకురాకుండా నిర్ణయించడం మంచి పరిణామం కాదు.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ 1955, ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండి యా యాక్ట్‌ 1956, బ్యాంకింగ్‌ కంపెనీల ఆక్ట్స్‌ 1970 అండ్‌ 1980 తదితర చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాకుండా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా నియామకాలపై మార్గదర్శకాలు ఇవ్వడం ఒక దొడ్డిదారి, లోపాయుకార ఒప్పంద చర్య. ఇది ఖండనీయమైనది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లు ఉంటారు. ఆ నలుగురు కూడా ఎల్‌ఐసీలో ఒక అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి దాదాపు 30 ఏండ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోస్టుకు అర్హులవుతారు. అలాంటివారికి ఇంటర్వ్యూలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియామకమిస్తోంది. ఇలా నింపబడిన నలుగురు డైరెక్టర్లలో ఇక నుండీ ఒక్కరు ప్రయివేటురంగం నుండి నియమింపబడతారని అధికారికంగా మార్గదర్శకాలను డిపార్ట్మెంట్‌ అఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విడుదల చేసింది. ఇప్పుడు మేనేజింగ్‌ డైరెక్టర్లలో ఒకరిని బయటినుంచి చొప్పించడానికి మరో దురుద్దేశం కూడా లేకపోలేదు.

అదేమంటే, ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియాకు చైర్మన్‌గా (ప్రస్తుతం ఈ పదవిని ”చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అండ్‌ మేనెజింగ్‌ డైరెక్టరు”గా, ఐపిఒ అనంతరం, పునర్నామకరణం చేశారు) నియమింపబడాలంటే ప్రస్తుతానికి మేనేజింగ్‌ డైరెక్టర్లలో ఒకరిని ఎంచుకొనే ఆనవాయితీ (కేంద్ర ప్రభుత్వ నియామక ప్రక్రియ ద్వారా నిబంధలననుసరించి, అర్హులైన వారిని మాత్రమే) కొన్ని దశాబ్దాలుగా కొనసాగు తున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌గా ఆర్థికరంగ నిపుణులైన రఘురాం రాజన్‌, ఉర్జిత్‌ పటేల్‌ ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో వేగలేక రాజీనామా చేసిన అనంతరం తమ అనుయా యులైన ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ని రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించుకొని తమకు అనుకూలమైన విధంగా పరిపాలన కొనసాగించింది. లక్షల కోట్ల రూపాయల నిధుల మళ్లింపు కూడా జరిగిందన్నది వివిధ మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసిందే.

మేనేజింగ్‌ డైరెక్టర్లను నియమించడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులున్నవి. ఎవరినైనా నియమించవచ్చు. అయితే నియమిం పబడిన డైరెక్టర్లు అదే రంగానికి సంబంధించిన అనుభవజ్ఞులైతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్‌ విభాగం వసూలైన ప్రీమియాన్ని పెట్టుబడులుగా పెట్టి లాభార్జన కోసం కేవలం ఆర్థిక లావాదేవీలను నెరపే రంగం కాదు. ఇన్సూరెన్స్‌ రంగంలో క్లెయి ముల చెల్లింపు అత్యంత ప్రధానమైనది. అయితే ఈ క్లెయిమ్‌ల చెల్లింపు నాణ్యమైన పద్ధతిలో జరగాలంటే నూతన వ్యాపార సేకరణ కూడా చాలా నాణ్యతతో కూడుకున్నదై ఉండాలి. అలాంటి పటిష్టమైన నూతన వ్యాపారాన్ని సేకరించాలంటే పాలసీదారులకు కంపెనీకి అను సంధానంగా పనిచేస్తున్న ఏజెంట్లు, ఇతర ఇంటర్మీడియరీస్‌ అనగా బ్యాంక్‌లు బ్రోకర్లు వంటి పటిష్టమైన నియంత్రణలో పనిచేయాల్సి ఉంటుంది. వెరసి ఏజెంట్ల నియామకం, బ్యాంక్‌ అస్సురెన్స్‌లో పాల్గొనే బ్యాంకులను గుర్తించడం, ఇన్సూరెన్స్‌ బ్రోకర్లను గుర్తించడం, నాణ్యమైన నూతన వ్యాపారాన్ని అండర్‌ రైట్‌ చేయడం కూడా ఒక క్రమపద్ధతిలో జరిపించడం, ఆ తరువాత ఎదురయ్యే క్లెయిమ్‌లను సక్రమంగా పరిష్కరించడం ప్రధానమైన కర్తవ్యాలు.

అంచేత పైన వివరించిన ప్రధాన కర్తవ్యాలను ఫలితోన్ముఖంగా నిర్వర్తించాలంటే అనుభవజ్ఞులైన అంతర్గత ఉద్యోగుల్లో నిపుణులను ఎంచుకోవడం సర్వదా శ్రేయస్కరం. ఈ క్రమంలో, ప్రీమియంలను పెట్టుబడులుగా మలచి వచ్చిన రాబడిని మెచ్యూరిటీ క్లెయిమ్‌ల ద్వారా చెల్లించడం అనేది ఒక భాగం మాత్రమే. బయటనుండి నియమింపబడి డైరెక్టర్లు మార్కెట్‌పై అవగాహన కలిగి ఉండే అవకాశముంది. కాదనలేం. అయితే సంస్థల్లోని అంతర్గత ఉద్యోగులు కూడా మార్కెట్‌పై అవగాహన స్థాయిలో తక్కువేమీ కాదు. అంతే కాకుండా అంచెలంచెలుగా వారికి సదరు తర్ఫీదు కూడా కంపెనీలు ఇస్తూనే వస్తున్నవి. బీమా ప్రీమియం మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి లాభాలు పొందే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు అలాంటి నిపుణుల ఆవశ్యకత అంతగా అవసరం ఉండదు.

ప్రస్తుతం భారతీయ జీవిత బీమా సంస్థ దగ్గరున్న మొత్తం లైఫ్‌ ఫండ్‌లో దాదాపు 38 లక్షల కోట్ల రూపాయలు అనగా 75శాతం వరకు ప్రభుత్వ,దాని అనుబంధ సంస్థల్లో మాత్రమే పెట్టుబడులుగా పెట్టింది. ఇలాంటి నిర్దేశం ఎల్‌ఐసి ఆక్ట్‌ 1956 సెక్షన్‌ 37 ఏ ప్రకారం ఉన్నది. ఈనిర్దేశం ఉండడానికి కారణం ఏమంటే, ఇన్సూరెన్స్‌ అనేది మరణానంతరం నమ్మకంతో చెల్లించవలసినటువంటి కాన్సెప్ట్‌. కాబట్టి లాభాపేక్ష కోసం వచ్చిన ప్రీమియంను విచ్చలవిడిగా మార్కెట్‌లో ఉపయోగించ రాదు అనే నిబంధన ఎల్‌ఐసిని జాతీయ కరణం చేసినప్పుడే ఉంచారు. ఇక రెండో అంశమేమంటే, చిన్న మొత్తాల ద్వారా సేకరించిన పొదుపుని జాతీయ మౌలిక వసతుల కోసం వినియోగించాలని కూడా ఎల్‌ఐసీ లక్ష్యాల్లో ఒకటి. ఇలాంటి అద్వితీయ ప్రజోపయోగ లక్ష్యాలకు తిలోదకాలిచ్చి ఏడు దశాబ్దాల కాలం సేకరించిన పొదుపుపై అజమాయిషీని అసంబద్ధమైన వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక కుట్రలు లేవని చెప్పలేం.

ప్రభుత్వ రంగాలను కొనసాగించడం ప్రస్తుత కేంద్రప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టంలేని అంశం. పోటీతత్వం ద్వారా సేవలు మెరుగవుతాయని టెలికాం సెక్టార్‌లోకి ప్రయివేటు వ్యక్తులకు ఆహ్వానించి ఓ పదేండ్లపాటు పోటీతత్వాన్ని నడిపిన తర్వాత నియమ నిబంధనలన్నింటికీ తిలోదకాలిచ్చి ఒక ప్రయివేటు సంస్థను ఇష్టారీతిన ప్రోత్సహించి, ఇప్పుడు మళ్లీ ఏకస్వామ్యం దిశగా భారత టెలికాం రంగాన్ని రిలయన్స్‌ జియోకి అప్పజెప్పబోతున్నది. ఉత్పాదక ఖర్చులు నామమాత్రమై కేవలం ఆపరేటింగ్‌ ఖర్చులు మాత్రమే ఉన్న టెలికాం ఇండిస్టీ సేవలు మరింత చౌకగా అందుకోవచ్చు. కానీ వాళ్ల లాభాల కోసం ఆ పని జరగడం లేదు. ఇప్పుడు బ్యాంకులు ఇన్సూరెన్స్‌ రంగాలలో ప్రయివేటు డైరెక్టర్‌ల ద్వారా పెట్టుబడుల ప్రభావాన్ని ప్రభావితం చేసి వాటి పనితీరులో లోపాలున్నట్లుగా ప్రకటించి పూర్తి ప్రయివేటీకరణకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం వెనుక కనిపిస్తున్నది.

ప్రయివేట్‌ వ్యక్తులు డైరెక్టర్లుగా నియమితులైతే అంతర్గతంగా ఎదిగిన డైరెక్టర్ల నిర్ణయాలకు ప్రాధాన్యత తగ్గే అవకాశముంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం కొందర్ని తమ ప్రతిపాదనతో నియమిస్తుందో ప్రభుత్వానికి పక్షపాతంగా నిర్ణయాల కోసం సదరు వ్యక్తులు ప్రయత్నం చేయడం సహజం. అనగా బ్యాంకింగ్‌ ఇన్సూరెన్స్‌ రంగాల అస్తిత్వం (అటానమీగా నడిచే ప్రక్రియ) ప్రశ్నార్థకంలో పడుతుంది. ఇంతటితో ఆగకుండా వాటాల ఉపసంహరణ ద్వారా వార్షిక సమావేశాల నిర్వహణ తప్పనిసరి అయినందువల్ల సదరు మీటింగ్‌లో ప్రభుత్వరంగంలో ప్రయివేటు యాజమాన్యానికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా పెరుగుతాయి. ఈ ప్రక్రియ పెరిగి పెద్దదై ప్రభుత్వ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసి హస్తగతం చేసుకుంటాయి. అప్పుడు నష్టపోయేది అందరికీ ఇన్సూరెన్స్‌ చేర్చాలన్న ఎల్‌ఐసి లక్ష్యం, లాభాపేక్షల్లో కొట్టుమిట్టాడే క్లెయిమ్‌ల పరిష్కారం, ప్రభుత్వానికి అవసరమైనప్పుడు అపన్నహస్తం అందించడానికి ఒక పటిష్ట పరిశ్రమ లేకపోవడం. భవిష్యత్తులో కచ్చితంగా అనుభవంలోకి వస్తాయి.

జి.తిరుపతయ్య
9951300016

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -