- సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం
- డ్రగ్స్ తయారు చేస్తున్న పరిశ్రమ వద్ద నిరసన
నవతెలంగాణ-చర్లపల్లి
రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని, డ్రగ్స్ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్‌వర్క్ మూలాలు చర్లపల్లిలోని ఓ పరిశ్రమలో మహారాష్ట్ర పోలీసులు కనుగొన్నారు. ఆ పరిశ్రమలో మెఫిడ్రిన్ మత్తు పదార్థం తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి 5.96 కిలోల మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950కిలోల ముడిసరుకు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆదివారం చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఆ పరిశ్రమ ముందు సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఒక యువతి ద్వారా చర్లపల్లి పారిశ్రామిక వాడలో డ్రగ్స్ ఉత్పత్తి జరుగుతుందని తెలియడం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యే విషయమని అన్నారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పరిశ్రమల అధికారుల తనిఖీలు లేకపోవడం వల్ల పరిశ్రమల్లో డ్రగ్స్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర నిఘా వర్గాల వైఫల్యం బహిర్గతమైందని విమర్శించారు. రేవ్ పార్టీలు, డ్రగ్స్ పంపిణీపై ఉక్కుపాదం మోపే రాష్ట్ర ప్రభుత్వం.. మన రాష్ట్రంలో జరిగే డ్రగ్స్ ఉత్పత్తిని అరికట్టడానికి అంతకంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు వెంచర్స్‌లో, రెసిడెన్షియల్ ఏరియాలో నడుస్తున్న పరిశ్రమల్లో నిరంతరం తనిఖీలు చేయాలని కోరారు. కెమికల్, ఫార్మా, అన్ని డ్రగ్స్ పరిశ్రమలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కోమటి రవి మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు గుంటి లక్ష్మణ్, సీనియర్ నాయకులు సీహెచ్ వరప్రసాద్, జగ్గరాజు, జి.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు, గణేష్, శరత్, విజరు కుమార్, 3డీ ఫోమ్ కట్ పరిశ్రమ ప్రధాన కార్యదర్శి ఆదాం కృష్ణారెడ్డి, కంపెనీ కార్మికులు, ఈసీ నగర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.