నవతెలంగాణ- రాయపోల్: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక నష్టం జరిగిందని, పంటలు పూర్తిగా నీట మునిగి రైతులు నష్టపోయారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, తాజా మాజీ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్,తాజా మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలో విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండిపోయి ఎక్కడికక్కడ వరద నీటితో పంటలు మొత్తం మునిగిపోయాయన్నారు.
అలాగే లోతట్టు ప్రాంతాలలో ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎంతోమంది బ్రతుకులు చిన్నాభిన్నం అయ్యయన్నారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు, ఇండ్లలోకి నీరు చేరి, ఇండ్లు కూలిపోయి నష్టపోయిన ప్రజలకు అధికారులతో సర్వే చేయించి తక్షణమే సహాయం అందజేయాలన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం అందజేసి అన్నదాతలను ఆదుకోవాలని అన్నారు. ఒకవైపు సమృద్ధిగా వర్షాలు కురిస్తే సరైన సమయానికి పంటలకు యూరియా వేసుకోవడానికి అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసిఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రోజు కూడా రైతులు రోడ్డెక్కి యూరియా కోసం తిరిగిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేక రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో విఫలమైందన్నారు.
ఏ గ్రామంలో చూసిన రైతులు చెప్పులను క్యూ లైన్ లో పెట్టి యూరియా కోసం రాత్రింబవలు ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు.మార్పు మార్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అరాచక కాంగ్రెస్ పాలనను తెస్తుందని ప్రజలు ఊహించలేదన్నారు. రేవంత్ రెడ్డి మార్పు పాలన అంటే రైతులను అరిగోసపట్టడమేనా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ పాలనలో ముందు చూపుతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు సరైన సమయంలో యూరియా, ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి తాజా మాజీ సర్పంచ్ కరుణాకర్, మాజీ కోఆప్షన్ సభ్యులు పర్వేజ్, మండల నాయకులు కల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.