తీర్మానానికి తమిళనాడు అసెంబ్లీ ఆమోదం
బిల్లుపై గవర్నర్ వ్యాఖ్యలకు సీఎం స్టాలిన్ అభ్యంతరం
చెన్నై : సిద్ధ యూనివర్సిటీ బిల్లు-2025పై గవర్నర్ ఆర్.ఎన్.రవి వ్యాఖ్యలను తిరస్కరిస్తూ గురువారం తమిళనాడు ప్రభుత్వం తీర్మానాన్ని ఆమోదించింది. ఈ బిల్లుపై గవర్నర్ వ్యాఖ్యలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడు సిద్ధ వైద్య విశ్వవిద్యాలయం బిల్లు ఆర్థిక బిల్లు విభాగంలోకి వస్తుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 207(3) ప్రకారం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ సిఫారసు అవసరమని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించి, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా బిల్లు రూపొందించిందని తెలిపారు.
దీనిని న్యాయశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి పరిశీలించారని, ఆ తర్వాత బిల్లును గవర్నర్‌కి పంపినట్టు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పద్ధతిని అనుసరించి బిల్లును ఆమోదించడానికి బదులుగా గవర్నర్ బిల్లులోని నిర్దిష్టమైన నిబంధనలపై కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారని సీఎం స్టాలిన్ తెలిపారు. బిల్లును ప్రవేశపెట్టినపుడు తన పరిశీలనలను అసెంబ్లీ సభ్యుల దృష్టికి తీసుకురావాలని చెప్పారని ఆయన అన్నారు.
గవర్నర్ వ్యాఖ్య విధి విధానాలకు విరుద్ధం :స్టాలిన్
”రాజ్యాంగం, అసెంబ్లీ విధి విధానాలు, నిబంధనలకు విరుద్ధం. ఒక బిల్లు పరిశీలనలో ఉన్నప్పుడు.. సవరణలను ప్రతిపాదించడానికి, ఆమోదయోగ్యమైన వివరణలు ఇస్తే వాటిని ఉప సంహరించుకోవడానికి లేదా వారు ఆమోదించకపోతే ఓటును డిమాండ్ చేయడానికి అసెంబ్లీ సభ్యులకు మాత్రమే హక్కు ఉంటుంది. ఒక బిల్లును అసెంబ్లీ ఆమోదించే ముందు, దానిపై పరిశీలన సూచించే అధికారం గవర్నర్‌కు లేదు. బిల్లుపై గవర్నర్ నుంచి వచ్చిన పరిశీలనను ఈ సభ ఆమోదించదు” అని స్టాలిన్ పేర్కొన్నారు.
”గవర్నర్ ‘పరిశీలన’ అనే పదాన్ని ఉపయోగించకుండా ‘సముచిత పరిశీలన’ అనే పదబందాన్ని వినియోగించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. సముచితం అనే పదానికి అర్థం ఏమిటి? దాని అర్థం అసెంబ్లీ బిల్లును సరైన లేదా తగిన రీతిలో పరిశీలించాలని అర్థం. బిల్లుపై గవర్నర్ సూచన ఆమోదయోగ్యం కాదు. ఇది సభ గౌరవాన్ని అమర్యాద పరచడం. చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది” అని పేర్కొన్నారు.
సిద్ధ యూనివర్సిటీ బిల్లు-2025
ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రి సుబ్రమణియన్ తమిళనాడు సిద్ధ వైద్య విశ్వవిద్యాలయ బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. భారతీయ వైద్యం , హౌమియోపతిలోని వివిధ శాఖల్లో బోధన , శిక్షణ అందించడానికి చెన్నైలో తమిళనాడు సిద్ధ వైద్య యూనివర్సిటీని స్థాపించాలని ఈ బిల్లు లక్ష్యంగా పేర్కొంది.
గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES