ఆయిల్ పామ్ సాగు పనిముట్లను వ్యవసాయ యాంత్రీకరణలో భాగం చేయాలి
టీజీ సీడ్స్ ద్వారా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయాలి : టీజీ ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్, టీజీ సీడ్స్ అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని వెంటనే అమ్మాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగులో ఉపయోగపడే పనిముట్లను వ్యవసాయ యాత్రీకరణ పథకంలో భాగం చేయాలని సూచించారు. టీజీ సీడ్స్ ద్వారా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు సకాలంలో అందించాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లో టీజీ ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. అందులో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ అన్వేశ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మెన్ జంగా రాఘవ రెడ్డి, గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థల ఎమ్‌డీ యాస్మిన్ బాషా, అధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్, ఆసిఫాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని ప్రయివేటు ఆయిల్ పామ్ కంపెనీలకు సంబంధించిన జోన్లను ఇప్పటికే రద్దు చేసి ఆయిల్ ఫెడ్ సంస్థకు అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. నిర్ధిష్ట లక్ష్యాలను చేరుకోవడంలో ఆయిల్ ఫెడ్ సంస్థ కూడా విఫలమైతే ఆ సంస్థకు సంబంధించిన జోన్లను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ విస్తరణ కోసం అవసరమైన చోట ఔట్‌సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను చేర్చుకోవాలని సూచించారు. సాగు కోసం చేసే ఖర్చును తగ్గించడానికి అన్ని అవకాశాలనూ పరిశీలించాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ వ్యర్థాల నుంచి ఉప ఉత్పత్తుల తయారీకి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కల్లూరు గూడెం, బీచుపల్లి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఫర్టిలైజర్లు, ఫెస్టిసైడ్స్‌ను 50 శాతం సబ్సిడీతో ఆయిల్‌పామ్ రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలనీ, కస్టమ్ హైరింగ్ సెంటర్లను వారికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన జొన్న, మొక్క జొన్న ధాన్యానికి వెంటనే టెండర్లు పిలిచి అమ్మాలని మంత్రి ఆదేశించారు. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ప్రొక్యూర్‌మెంట్, సీడ్ వెరైటీలు, స్టోరేజీల నిర్వ హణలో కొత్త విధానాలను రూపొందించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాముల్లో ఎక్కువ కాలం స్టోరేజీ చేయకుండా, పంట పాడవకముందే మంచి రేటు రాగానే అమ్ముకోవాలని అన్నారు. సీజన్‌కు అవసరమయ్యేలా విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించాలని విత్తనాభివృద్ధి సంస్థ ఎమ్‌డీకి సూచించారు.



