Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రీన్‌ ఫీల్డ్‌కు లైన్‌ క్లియర్‌

గ్రీన్‌ ఫీల్డ్‌కు లైన్‌ క్లియర్‌

- Advertisement -

రూ.4వేల కోట్ల వ్యయంతో పనులు
60 శాతం భూ సేకరణ పూర్తి
41.50 కిలో మీటర్ల రోడ్డుకు వెయ్యి ఎకరాలు సేకరణ
కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో..
ప్రభుత్వ కేటాయింపునకు అదనంగా 30 శాతం పరిహారం
ప్యూచర్‌ సిటీలో 120 గజాల ప్లాట్‌
రెండేండ్లలో పూర్తి అయ్యేలా ప్రణాళికలు

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ విస్తరణలో భాగంగా ట్రాఫిక్‌ సమస్యలను నివారించే దిశగా ఓఆర్‌ఆర్‌ టూ రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు కనెక్టివిటీ చేస్తూ 9 రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు భూ సేకరణ చేపడుతోంది. రేడియల్‌ రోడ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశలో రంగారెడ్డి జిల్లా రావిర్యాల నుంచి అమన్‌గల్‌ వరకు సుమారు 41.5 కి.మీ మేర 332 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులకు భూసేకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 60 శాతం భూ సేకరణ పూర్తయింది. బాధితులకు ఎకరాకు రూ.90లక్షల పరిహారం రావడంతో రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. దాంతో రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి.

రంగారెడ్డి జిల్లాలో ఓఆర్‌ఆర్‌ టూ త్రిబుల్‌ ఆర్‌ను కనెక్టివిటీ చేస్తూ నిర్మాణం అవుతున్న అతిపెద్ద రోడ్డు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు. రావిర్యాల నుంచి అమనగల్‌ వరకు 332 ఫీట్ల విస్తీర్ణం, 41.5 కిలో మీటర్లు నిర్మించనున్నారు. ఈ రోడ్డు పనులు ప్రభుత్వం రెండు దశలుగా చేపట్టనుంది. మొదటి దశలో ఓఆర్‌ఆర్‌ రావిర్యాల టాటా ఇంటర్‌చేంజ్‌ నుంచి మీర్ఖాన్‌పేట వరకు సుమారు 19.20 కిలో మీటర్లు నిర్మిస్తారు. రెండో దశలో మీర్ఖాన్‌పేట నుంచి అమన్‌గల్‌ వరకు సుమారు 22.30 కిలో మీటర్లు నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు టెండర్లు కూడా ఖరారయ్యాయి.

వేగంగా భూసేకరణ పనులు
గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణానికి సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం ఉండగా, ఇందుకు ప్రస్తుతం 600 ఎకరాల వరకు భూ సేకరణ పూర్తి అయినట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇందులో పట్టా భూములు సుమారు 150 ఎకరాలకు అవార్డు పాస్‌ చేశారు. కందుకూరు, మహేశ్వరం మండలాల పరిధిలోని రాచులూరు, తుమ్మలూరు రెవెన్యూ గ్రామాల్లో సుమారు 150 ఎకరాలకు సంబంధించి 90 మంది రైతులకు పరిహారం చెల్లించారు. ఇక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్కెట్‌ ధర ఎకరం రూ.20 లక్షలు ఉంది. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం మూడింతల పరిహారం అనగా రూ.60 లక్షలు పరిహారం ఇవ్వాల్సి ఉంది.

అయితే కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని కాన్‌సెంట్‌ అవార్డు కింద రూ.60లక్షలతోపాటు అదనంగా 30 శాతం పరిహారం చెల్లించారు. ఈ లెక్క ప్రకారం ఎకరానికి ప్రభుత్వం రూ.90లక్షలు చెల్లించింది. దాంతో పాటు భారత్‌ ప్యూచర్‌ సిటీలో ఎకరాకు 120 గజాల ప్లాట్‌ ఇచ్చేందుకు కలెక్టర్‌ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. దాంతో గ్రీన్‌ఫీల్డ్‌కు భూ సేకరణ సులభతరమైంది. ఇందులో 150 ఎకరాలు రైతుల నుంచి సేకరించగా.. టీజీఐఐసీ నుంచి 200 ఎకరాలు, ఫారెస్టు భూముల 250 ఎకరాలు నిర్మాణ పనులకు క్లియరెన్స్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. దాంతో నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు ప్రారంభించారు. రెండేండ్లలో గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రీజనల్‌ రింగ్‌ రోడ్డు కంటే ముందే గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు పూర్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

సాఫీగా భూ సేకరణ : రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి
గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు పనుల్లో భాగంగా భూ సేకరణ సాఫీగా సాగింది. ఇందుకు రైతులూ సహకరిం చారు. రైతులకు ఎకరాకు రూ.90లక్షలు అందించాం. ఎకరాకు ప్రభుత్వం తరపున రూ.60 లక్షలతోపాటు అదనంగా మరో రూ.30 లక్షలు చెల్లించాం. రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గడువులోగా పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -