అందుబాటులో వివిధ రాష్ట్రాల చేనేత హస్త కళా ఉత్పత్తులు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లోని శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా శనివారం ప్రారంభమైంది. డెవలప్‌మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్‌టైల్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా, నేషనల్ జ్యూట్ బోర్డు, శిల్పారామం సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ హస్తకళా ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేనేత హస్త కళా ఉత్పత్తులు ఉదయం 10.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
రాజస్థాన్ కోటా చీరలు, కోల్‌కతా జాంధానీ, తస్సార్, బెంగాల్ కాటన్, కాంత వర్క్, ఆంధ్రప్రదేశ్ కలంకారీ, మంగళగిరి, వెంకటగిరి, ఉత్తరప్రదేశ్ బనారస్, మస్లిన్, గుజరాత్ బాందినీ, రాజకోట, అజ్రాక్ మొదలైన చీరలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బెంగళూరుకు చెందిన హరిప్రియ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన చేసింది. గణేశా స్తుతి, అల్లరిపు, శివాష్టకం, జగన్మోహన్, వీరిందవని వేణు, శివ పదం, శ్రీ చక్ర రాజా మొదలైన అంశాలను హరిప్రియ, అనూష, హేమ వర్షిణి, ప్రవల్లిక, నీరజ, కిరణశ్రీ, శ్రీలేఖ, జ్ఞాన సద్యుతి ప్రదర్శించారు.



