నవతెలంగాణ-హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి సమీపంలోని మున్సిపాల్టీలను విలీనం చేసి డివిజన్ల సంఖ్యను 300కు పెంపు ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని దాఖలైన లంచ్‌మోషన్ పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారణ చేయనుంది. డీలిమిటేషన్ ప్రక్రియను సవాల్ చేసిన పిటిషన్లను మంగళవారం జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి విచారించి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నాగేంద్ర, ప్రకాష్‌రెడ్డి ఇతరులు దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్లల్లో డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదన అశాస్త్రీయమనీ, మ్యాప్‌లు కూడా లేవనీ, డివిజన్లలో జనాభా సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉందని ఎత్తిచూపారు. కొత్త డివిజన్ల ఏర్పాటులో భాగంగా రాంనగర్ డివిజన్‌కు అన్యాయం జరిగిందని పేర్కొంటూ విజరుకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ పూర్తి చేశారు. నాలాను సరిహద్దుగా చేసుకుని డివిజన్ విభన జరిగిందని, డివిజన్ల ఏర్పాటుపై లేవనెత్తే అభ్యంతరాలు సహేతుకంగా లేవంటూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రాలను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ఇతర లంచ్‌మోషన్ పిటిషన్లపై బుధవారం విచారిస్తామన్నారు.
డీఎఫ్‌ఐ ఆస్తుల్ని అమ్మి బాధితులకు ఇవ్వండి : హైకోర్టు
హైదరాబాద్‌కు చెందిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ (డిఎఫ్‌ఐ)కు ఆస్తులను వేలం వేసి వచ్చిన డబ్బును డీఎఫ్‌ఐ బాధితులకు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. నాంపల్లిలోని కోర్టు అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయాలంది. నాంపల్లి కోర్టు తమ ఆస్తులను అటాచ్ చేయడాన్ని డీఎఫ్‌ఐ సవాల్ చేసిన పిటిషన్‌ను జస్టిస్ సుజన విచారించి పైవిధంగా తీర్పు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 8 చోట్ల రూ.500 కోట్ల విలువైన ఆస్తులను నాంపల్లి కోర్టు అటాచ్ చేసింది. పిపి టల్లె నాగేశ్వర రావు వాదిస్తూ, అప్పీల్‌ను కొట్టేయాలని కోరారు. పెద్ద మొత్తంలో తిరిగి ఇస్తామని చెప్పి డీఎఫ్‌ఐ నమ్మించి మోసం చేసిందనీ, అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేసి బాధితులకు పంచడానికి వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అప్పీల్‌ను కొట్టేసిన హైకోర్టు కీలక ఆదేశాలను వెలువరించింది.
‘గీతం’పై అంత ప్రేమెందుకు? : డిస్కం అధికారులను ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీ 2008-09 నుంచి ఇప్పటి వరకు రూ.118.13 కోట్ల విద్యుత్ బకాయి పడ్డా ఎందుకు వసూలు చేయలేదని డిస్కం అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. పేద, మధ్యతరగతి వాళ్లు వెయ్యి రూపాయలు బకాయి ఉంటే నోటీసు కూడా ఇవ్వకుండానే కరెంటు కనెక్షన్ కట్ చేస్తారనీ, మరి గీతం వర్సిటీపై ఎందుకు అంత ప్రేమ అని నిలదీసింది. గీతం వర్సిటీ విద్యుత్ సరఫరాను ఎందుకు నిలిపివేయలేదో చెప్పాలని సంగారెడ్డి సర్కిల్, డిస్కం సూపరింటెండింగ్ ఇంజినీర్‌ను మంగళవారం ఆదేశించింది. ఈనెల22న జరిగే విచారణకు అధికారులు హాజరుకావాలని జస్టిస్ నగేశ్ భీమపాక ఆదేశించారు. విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలని డిస్కం అధికారులు ఇచ్చిన తాజా నోటీసును గీతం యూనివర్సిటీ సవాల్ చేసిన పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. విచారణ ఈ నెల 22కి వాయిదా వేశారు.



