సెప్టెంబర్ 17చారిత్రక సన్నివేశాన్ని రచ్చచేయటంలో దిట్టలు ఆరెస్సెస్, బీజేపీ. ఇందులో భాగమే ‘విమోచన దినోత్సవం’ పేరుతో హంగామా. జాతీయోద్యమ నేత సర్దార్ పటేల్ పాత్రకు వక్రభాష్యం చెబుతున్నారు. పటేల్ పాత్ర గురించి సమగ్రమైన బేరీజు పక్కనబెడితే, ఆయన జాతీయోద్యమనేత, కాంగ్రెస్ నాయకుడు, ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చుపెట్టి, దాడులు చేస్తున్న ఆరెస్సెస్‌ను నిషేధించిన చరిత్ర ఆయనది. ఇండియన్ యూనియన్ ప్రభుత్వంలో హోంమంత్రిగా, సంస్థానాల ప్రజల ఆకాంక్షల మేరకు వాటిని భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలో కీలక భాగస్వామి. ఇప్పుడు మోడీ, అమిత్ షా చేస్తున్న పనేమిటి? తెల్లదొరలకు సహకరించిన ఆరెస్సెస్ వారసత్వం వీరిది. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తికోసం సాగిన మహాత్తర సాయుధ రైతాంగ పోరాటాన్ని మత ఘర్షణగా చిత్రీకరించే వక్రబుద్ధి వీరిది. ‘విమోచన’ పేరుతో ముస్లింల మీద హిందువులు సాధించిన విజయంగా చిత్రీకరించడటమే వీరి పని. నిజానికి ‘సెప్టెంబర్ 17’ ఎర్ర జెండా వారసులు కవాతు చేయవల్సిన రోజు. రైతాంగ పోరాట ఫలితమే ఈ విలీనం! సమైక్య భారతదేశంలో హైదరాబాదు రాజ్యంలో భాగమైన తెలంగాణ విలీనమౌతున్న సందర్భంలో అదే రాజ్యంలోని మరఠ్వాడా ప్రాంతంలో భయంకరమైన మతచిచ్చుపెట్టి సమైక్యతకు విఘాతం సృష్టించే ప్రయత్నం చేసింది ఆరెస్సెస్‌్, దాని పరివారం. ఆ రోజుల్లోనే నెహ్రూ ప్రభుత్వం పండిట్ సుందర్‌లాల్ నాయకత్వంలో ముగ్గురితో నిజనిర్ధారణ బృందాన్ని పంపింది. వారి పరిశీలనలో తేలిన భయంకర సత్యాల నివేదిక 2013నుంచి మాత్రమే నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రెరీలో పరిశోధ కులకు అందుబాటులో ఉంచారు. ఈ స్వయం సేవకుల రక్త చరిత్రకు ఈ నివేదిక నిలువుటద్దం.
77 ఏండ్ల కిందటి ఘట్టం. నేటి యువత, ఆ పోరాటం తర్వాత పుట్టిన నాల్గవతరం. వీరికి తెలంగాణ పోరాటమంటే ప్రత్యేక తెలంగాణ పోరాటమే కనిపిస్తున్నది. లేదంటే వక్రీకరణల పుట్టగా పుట్టిన రజాకార్ సినిమా తెలుసు. ప్రింట్,ఎలక్ట్రానిక్, సోషల్ మీడి యా మాధ్యమాలు స్వదేశీ,విదేశీ కార్పొరేట్ సంస్థల గుప్పిట్లో ఉన్నాయి. నిజం చెప్పడానికి సిద్ధంగా లేవు. నిజాం పాలనలో రైతులు దొరల పొలం దున్నిన తర్వాతనే తమ పొలం దున్నుకోవాలి. సమస్త వృత్తిదారులు తమ ఉత్పత్తులు భూస్వాములకు ఉచితంగా ఇవ్వాలి. ఉచిత సేవలు చేయాలి. గడీల్లో వెట్టిచాకిరీకి ఇంటికొకరు చొప్పున పోవాలి. దళితులు పెత్తందార్లకు ఎదురుపడవద్దు. చెప్పులు చేతబట్టుకుని పక్కకు తప్పుకోవాలి. భూస్వామికి నచ్చిన స్త్రీ కాదనే సాహసం చేయరాదు. చదువుకునే అవ కాశం అందరికీ లేదు. తెలుగులో చదువు అందుబాటులో లేదు. ఈ భూస్వాములు హిందువులు. వీరికి అండ నిజాంరాజు, రజాకార్లూ. ఇదీ 1940వ దశకంలో తెలంగాణ ముఖచిత్రం. గ్రంథాలయాలు, తెలుగు భాష అభివృద్ధి, స్త్రీ విద్య, సార్వత్రిక విద్య నినాదాలతో సాగిన సాంస్కృతికోద్యమం వెట్టిని ప్రశ్నించే దశకు చేరింది. భూమికోసం, భుక్తికోసం రైతాంగం పోరుబాట పట్టింది. ‘దున్నే వానికే భూమి’ అని నినదించింది. అంతిమంగా రాచరికాన్నే సవాలు చేసింది. ప్రాణాలను పణంగా పెట్టి భూస్వామ్య దోపిడీనీ, రాచరికపు పునాదులను పెకిలించింది. అందుకే ఇది మహత్తర పోరాటమైంది.
సాంస్కృతికోద్యమంగా మొదలైన ప్రస్థానం సంస్కరణోద్య మంగా రూపొందే క్రమంలోనే సనాతన వాదులకూ, సంస్కరణవాదులకు మధ్య ఆంధ్రమహాసభలో సంఘర్షణ జరిగింది. అంతిమంగా అభ్యుదయ భావాలే పైచేయి సాధించాయి. బహిరంగంగా పనిచేసే అవకాశం లేదు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులు అందులో చేరి పనిచేశారు. ఆంధ్రమహాసభ కార్యకర్తలుగానే పనిచేసారు. కమ్యూనిస్టుల కృషి ఫలితంగా సంస్కరణోద్యమ దశ నుంచి ప్రజా సమస్యల పరిష్కారం, రాజకీయ మార్పువైపు దిశ మారింది. కమ్యూనిస్టులే ఆంధ్రమహాసభ నాయకులుగా ఎన్నికయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య సారధ్యంలో 1946 సెప్టెంబర్‌లో మొదలైన సాయుధ రైతాంగ పోరాటం 1951 అక్టోబర్ వరకు సాగింది. మూడువేల గ్రామ రాజ్యాలేర్పడ్డాయి. పదిలక్షల ఎకరాల భూమి పంచారు. అక్రమ వడ్డీలు రద్దు చేసి, అప్పు పత్రాలు ధ్వంసం చేసారు. మహిళలు నిర్ణయాలలో భాగస్వాములయ్యారు. కుల వివక్ష, అంటరానితనం నిషేధించారు. ఉద్యమ ధాటికి తట్టుకోలేక భూస్వా ములు హైదరాబాదు పారిపోయారు. నిజాం రాచరికం పునాదులు కదిలాయి. హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనం కాక తప్పలేదు.
స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించే నాటికి ఇంకా 565 రాచరిక సంస్థానాలు మిగిలే ఉన్నాయి. భారతదేశంలో గాని,పాకిస్తాన్‌లో గాని విలీనమయ్యేం దుకు లేదా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగేందుకు వారికి అవకాశం ఉన్నది. కానీ, ఈ సంస్థానాల్లోని ప్రజానీకం మీద కూడా జాతీయోద్యమ ప్రభావం పడింది. రాచరిక నియంతృత్వాల స్థానంలో ఆ ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థ కోరుకున్నారు. అందుకే స్వతంత్ర భారతదేశంలో విలీనం కావాలని అనేక రాజ్యాల ప్రజలు ఎదురుచూసారు. మరోవైపు తెలంగాణ సాయుధ రైతాంగంతో పాటు, బెంగాల్ తెభాగా పోరాటం, త్రిపుర ఆదివాసీల తిరుగుబాటు, పున్నప్ర వాయిలాల్ పోరాటం, వర్లీ ఆదివాసీల తిరుగుబాటు, అనేక ప్రాంతాల్లో ఎర్రజెండా నాయకత్వంలో సమరశీల తిరుగుబాట్లు సాగుతున్న కాలమది. షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కశ్మీర్ ప్రజల తిరుగుబాటు కూడా ఆ కాలంలోనే జరిగింది. తెలంగాణలో రాచరికాన్ని ప్రజలు తిరస్కరించారు. రాజ్యం కుప్పకూలే స్థితికి చేరుకున్నది. కమ్యూనిస్టు ఉద్యమం బలపడుతున్నది. ఈ నేపథ్యమే పటేల్ సైన్యాలు హైదరాబాదువైపు కదలడానికి, నిజాం రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనానికి దారితీసింది.
యువతను స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చిన సంస్థ ఆరెస్సెస్. వీరి సైద్ధాంతిక గురువు సావర్కర్ తెల్లదొరల ముందు సాగిలపడి జైలునుంచి బయటపడ్డారు. భారతదేశ రాజ్యాంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అంగీకరించలేదు. వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యేంతవరకు జాతీయజెండా ఎగురవేయడానికి కూడా సిద్ధపడలేదు. ఇలాంటి వీరు దేశ భక్తులుగా జబ్బలు చరుచుకుంటున్నారు. చరిత్రనూ, వ్యక్తుల పాత్రనూ వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్‌లో ముస్లింలే మెజారిటీ కావడం, పాకిస్తాన్‌కు ఆనుకొని ఉండడం వంటి కారణాలతో, వివాదం కంటే కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలివేయాలని సర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు. షేక్ అబ్దుల్లా నాయకత్వంలో సాగిన ఉద్యమంతో పాటు, నెహ్రూ పట్టుదల మాత్రమే కశ్మీర్ భారతదేశంలో విలీనానికి మార్గం సుగమం చేసింది. ఇతర సంస్థానాలను సర్దార్ పటేల్ సైనిక చర్యలతో దేశంలో కలిపివేసారని, నెహ్రూమాత్రం కశ్మీర్‌ను షరతులతో విలీనం చేసారని ఆరెస్సెస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. మార్క్సిస్టు సిద్ధాంతంతో ప్రభావితమై, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్ పేరును కూడా వాడుకోవడం దుస్సాహాసం. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని గర్జించిన బాల గంగా ధర్ తిలక్ ఏనాడూ హిందుత్వ నినా దాన్ని ప్రతిపాదించలేదు. ఆయన జాతీయ సమగ్రత, ఐక్యతలను కోరుకున్నారు తప్ప, కేవలం హిందువుల దేశం కాదు. మతాధిపత్యం అస్సలేకాదు. శివాజీ హిందు, ముస్లిం రాజుల మీద యుద్ధాలు చేసారు. అవన్నీ రాజకీయ, వ్యూహాత్మక యుద్ధాలే తప్ప, మతా ధారితం కాదు. ఆయన సైన్యంలో కీలక స్థానాలలో ముస్లింలను నియమించారు. అయినా శివాజీని హిందువుల ప్రతినిధిగా ఇప్పుడు ప్రచారంలో పెట్టారు.
స్వామి వివేకానందను కూడా వీరు వదలి పెట్టలేదు. ఆయన జీవితమంతా అధ్యాత్మిక, మత సామరస్య బోధనలకే ప్రాధాన్యతనిచ్చారు. మతం పేరుతో చేసే తంతులను, కుల వివక్షను వ్యతిరేకిం చారు. ఇతర మతాలను గౌరవించారు. ఈ భూ మండలంలో మానవజాతి చరిత్రంతా వలసల మయమే. వేల సంవత్సరాలకు పూర్వం ఆర్యులు కూడా ఇక్కడికి వలస వచ్చినవారే. చరిత్రకారులు నిర్ధారించిన విషయమిది. దీన్ని కూడా వక్రీకరించడం మానలేదు. సంస్థానాల్లో భూస్వాములకు, రాజులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలను కాంగ్రెస్ వ్యతిరేకించింది. తమ పోరాటం కేవలం తెల్లదొరలకు వ్యతిరేకంగా మాత్రమేనని తేల్చిచెప్పింది. అందుకే రైతాంగ పోరాటంతో హైదరాబాదులో తలదాచుకున్న భూస్వాములందరూ విలీనం తర్వాత కాంగ్రెస్ నాయకులుగా గ్రామాల్లో చేరుకున్నారు. విలీనంతో రాచరికం పోయింది. లౌకిక ప్రజాస్వామ్య భారతదేశంలో తెలంగాణ భాగమైంది. కానీ, ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. ఇందుకోసం ప్రజా పోరాటాలు కొనసాగవల్సే ఉన్నది. శ్రామిక ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసి, బడా బాబుల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక రాజకీయ సాధనంగానే బీజేపీ పనిచేస్తున్నది. తెలంగాణలో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ది పొందడం కోసమే విమోచన దినోత్సవం పేరుతో రాద్ధాంతం చేస్తున్నది.
ఎస్.వీరయ్య