Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవెట్టి చాకిరీపై పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే

వెట్టి చాకిరీపై పోరాడిన చరిత్ర ఎర్రజెండాదే

- Advertisement -

మతం రంగు పులుముతున్న బీజేపీని తరిమికొట్టండి: చార్మినార్‌ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌
నవతెలంగాణ-ధూల్‌ పేట్‌
నిజాంకు, భూస్వాముల దోపిడీ.. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సామాన్యులను చైతన్యపరిచి సాయుధ రైతాంగ పోరాటం నిర్వహించిన చరిత్ర ఎర్రజెండాదేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శాలిబండ నుంచి చార్మినార్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చార్మినార్‌ వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకత్వం వహించిందన్నారు. ఆ పోరాటం వల్లే చివరకు నైజాం రాజు దిక్కుతోచక భారత ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకున్నాడన్నారు. దానిలో భాగంగా ఆనాటి కేంద్ర హౌంమంత్రి వల్లభారు పటేల్‌ నిజాం రాజుకు రాజభరణం ఇచ్చారని, ఇది చరిత్ర అన్నారు. ఈ వాస్తవాలను నేడు బీజేపీ వక్రీకరించి ముస్లిం రాజు హిందు అయిన వల్లబారు పటేల్‌కు లొంగిపోయినట్టు చెప్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ చార్మినార్‌ జోన్‌ కన్వీనర్‌ అబ్దుల్‌ సత్తార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు ఎం.మీనా, జి.విటల్‌, పి.నాగేశ్వర్‌, ఎల్‌.కోటయ్య, ఎం.శ్రవణ్‌ కుమార్‌, ఎం.బాలు, బాబార్‌ ఖాన్‌, ఎస్‌.కిషన్‌, ఏ.కృష్ణ, కె.జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -