Saturday, December 13, 2025
E-PAPER
Homeజాతీయంఅంగన్‌వాడీల గౌరవ వేతనం పెంచాలి

అంగన్‌వాడీల గౌరవ వేతనం పెంచాలి

- Advertisement -

కేంద్రాలను ఆధునీకరించాలి : రాజ్యసభలో సీపీఐ(ఎం) నేత జాన్‌ బ్రిట్టాస్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనం పెంచాలని, కేంద్రాలను ఆధునీకరించాలని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్‌ బ్రిట్టాస్‌ డిమాండ్‌ చేశారు. ఇందుకోసం తాను గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, కాని ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. కేరళ విద్యలో భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినప్పుడు, చాలా మంది పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టమని మమ్మల్ని అడిగారని ఆయన అన్నారు. పిల్లల భవిష్యత్తు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విద్యలో భారీగా పెట్టుబడులు పెడుతోందని స్పష్టం చేశారు. ”ఈ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలుగా ప్రారంభమయ్యాయి. కానీ రాష్ట్రాలకు నిధులు కొంతమేరే ఇస్తున్నాయి. ప్రభుత్వం ఈ పథకాన్ని గౌరవప్రదంగా కొనసాగించలేకపోతే రాష్ట్రానికి నిధులు చెల్లించాలి” అని బ్రిట్టాస్‌ అన్నారు. క్షేత్రస్థాయి పనిలో అంగన్‌వాడీ కార్యకర్తలు సవాళ్లను ఎదుర్కొంటారని బీజేపీ ఎంపీ మేధా విశ్రామ్‌ కులకర్ణి అన్నారు.

మహారాష్ట్రలో అంగన్‌వాడీ లాంటి భావనను తారాబాయి మోదక్‌ ప్రవేశపెట్టగా ‘అంగన్‌వాడీ’ అనే పదాన్ని అనుతారు వాఫ్‌ు ప్రతిపాదించారని చెప్పారు. కార్మికుల పిల్లలకు లేదా ఇతరత్రా విద్య పొందలేని వారికి ప్రీ-స్కూలింగ్‌ అందించడం దీని వెనుక ఉన్న ఆలోచన అని ఆమె అన్నారు. ఐసీడీఎస్‌ అసలు లక్ష్యం ఇదేనని, తరువాత దీనిని ఇతర రంగాలకు కూడా విస్తరించారని తెలిపారు. ఒక అంగన్‌వాడీ కార్యకర్త ప్రీస్కూల్‌ వయస్సు పిల్లల బోధనకు నాలుగు గంటలు గడుపుతారని, స్థానిక ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు మరో నాలుగు గంటలు క్షేత్రానికి వెళ్తారని ఆమె తెలిపారు. ఇందులో పోషకాహారం గురించి విచారించడం, గర్భిణీ, పాలిచ్చే తల్లులకు మద్దతు అందించడం వంటివి ఉన్నాయని అన్నారు. డేటాను పంపడానికి నెట్‌వర్క్‌ లేకపోవడం, రికార్డులను ఉంచాల్సిన అవసరం వంటి అనేక సవాళ్లను ఈ కార్మికులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యాలయాలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2,500, పట్టణ ప్రాంతాల్లో రూ. 3,000 మాత్రమే అద్దె భత్యంగా ఇస్తున్నారని, పూణే వంటి నగరాల్లో ఇది సరిపోదని అన్నారు. ప్రారంభ విద్య చాలా ముఖ్యమని, మనం ఈ దశను మిస్‌ చేయకూడదని తెలిపారు. ఉచిత బాల్య సంరక్షణ, విద్యకు హామీ ఇచ్చే రాజ్యాంగ సవరణను ప్రభుత్వం పరిగణించాలని ఎంపీ సుధామూర్తి కోరారు. మూడు నుంచి ఆరేండ్ల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత, తప్పనిసరి ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య (ఈసీసీఈ) హామీ ఇచ్చే కొత్త ఆర్టికల్‌ 21(బి)ని జోడించడానికి రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆమె రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడి నుంచి 4 శాతం ఆరోగ్య, విద్య సెస్‌ వసూలు చేయబడుతుందని డీఎంకే ఎంపీ పి.విల్సన్‌ అన్నారు. ఈ నిధులు ఆర్టికల్‌ 21(ఎ) కింద ఉన్న పథకాలకు మాత్రమే ఉద్దేశించబడినవని, కానీ వాటిని అర్థవంతంగా ఉపయోగిస్తున్నారా? లేదా అని ప్రశ్నించారు. సమగ్ర శిక్షా అభియాన్‌ దాతృత్వం లేదా విచక్షణ కాదని, ఇది రాజ్యాంగ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

కానీ కేంద్రం తమిళనాడుకు రూ. 3548.22 కోట్ల నిధులను నిలిపివేసిందని విమర్శించారు.అభివృద్ధి చెందిన దేశాలు బాల్య విద్యకు పెట్టుబడులు పెట్టాయని ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌ అన్నారు. మానసిక అభివృద్ధిలో అధికభాగం ఆరేండ్ల వయస్సులోపు జరుగు తుందని, ఈ పరిశోధనలను ఉటంకిస్తూ ఫిన్లాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియాతో సహా అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు బాల్యంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే కారణమని పేర్కొన్నారు. వారు భావోద్వేగపరంగా బలమైన పిల్లలను పెంచడానికి ప్రసిద్ధి చెందారని, ఇది వ్యక్తిత్వ విద్య అని ఆమె పేర్కొన్నారు. దేశంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నిధులు ఎలా తక్కువగా ఉన్నాయో ఆమె హైలైట్‌ చేశారు. మన విద్య ఇప్పటికీ వలసవాద మనస్తత్వాన్ని అనుసరిస్తోందని, కొత్త విద్యా లక్ష్యాల కోసం మనం పాత పద్ధతులను అనుసరించలేమని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించాలని బీజేపీ ఎంపీ మయాంక్‌ కుమార్‌ నాయక్‌ అన్నారు.

అంగన్‌వాడీలలో మంచి మౌలిక సదుపాయాలను నిర్ధారించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ”భారతదేశాన్ని ఆరోగ్యంగా మార్చడానికి అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికీకరించాలి. మనం మంచి మౌలిక సదుపాయాలను నిర్మించినప్పుడు పునాది బలంగా ఉంటుంది. పిల్లలు మన దేశ భవిష్యత్తు, వారి భవిష్యత్తును కాపాడుకోవడం మన బాధ్యత” అని ఆయన అన్నారు. అంగన్‌వాడీలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డీఎంకే ఎంపీ ఆర్‌. గిరిరాజన్‌ అన్నారు. ”అంగన్వాడీలు ప్రారంభమై 50 ఏండ్లు గడిచాయి. నేడు ప్రజలు తమ పిల్లలను అంగన్వాడీలలో చేర్చడానికి వెనుకాడుతున్నారు. ఎందుకంటే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. అంగన్‌వాడీ కార్యకర్తలకు మంచి జీతాలు లేవు. అంగన్వాడీలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి” అని ఆయన అన్నారు. ఈ రోజుల్లో తక్కువ ఆదాయ కుటుంబాలు మాత్రమే తమ పిల్లలను అంగన్‌వాడీలలో చేర్చుకుంటున్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -