– ఆర్టీసీ, సింగరేణి సంస్థల పట్ల నిర్లక్ష్యం తగదు
– స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) కాంగ్రెస్‌తో పొత్తు
– తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి : విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో పేదలేసుకున్న గుడిసెలకు వెంటనే పట్టాలివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్యపద్మ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఈటీ నర్సింహ, బాలనర్సింహతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల జరిగిన రాష్ట్ర నాలుగో మహాసభలో తీర్మానాలను వివరించారు. నిలువ నీడ లేని పేదలు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో సీపీఐ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసేలుసుకుంటే వాటిని పోలీసులు తొలగించటం తగదని హితవు పలికారు. ఈ అంశంపై భవిష్యత్‌లో పోరాటాలు నిర్వహిం చనున్నట్టు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామనీ, వీరిరువురూ లేని చోట స్వతంత్రంగా పోటీచేస్తామని తెలిపారు. ఆర్టీసీ, సింగరేణి సంస్థల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుందనీ, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. చాపకింది నీరులాగా వాటిని ప్రయివేటీకరించే అవకాశం ఉందనీ, అదే జరిగితే రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. వాటిని కాపాడుకునేందుకు సిద్దమవుతామన్నారు. కార్మికులు సమస్యలు చెప్పుకోటానికి వెళితే..ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెదిరిస్తున్నాడని తెలిపారు. ఆయన పద్దతి మార్చుకోవాలని సూచించారు. లేదంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం, నీటి పారుదల ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. వచ్చేనెల 11 నుంచి 17 వరకు తెలంగాణ వారోత్సవాలు జరపనున్నామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట త్యాగాల్ని, ప్రభుత్వం గుర్తించాలని, సాయుధ వారోత్సవాలను జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. డిసెంబర్ 26 న కమ్యూనిస్టు పార్టీ వందేండ్ల సంబురాల సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నటు వెల్లడించారు. మేడ్చల్‌లో మల్కాజి గిరి జిల్లాలో జరిగిన రాష్ట్ర నాలుగో మహాసభలో రాష్ట్ర నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు. పదిమంది కార్యదర్శివర్గం, 32మంది కార్యవర్గం సహా 101 మందితో నూతన రాష్ట్ర సమితి ఏర్పడిందని ప్రకటించారు.
రేపు సురవరం సంస్మరణ సభ
శనివారం(30న) సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ రవీంద్రభారతిలో ఉంటుందని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ ఎన్వీరమణ, వామపక్ష నేతలు, తెలంగాణ మేధావులను ఆహ్వానించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు నిరసనగా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలను చేపట్ట నున్నట్టు వెల్లడించారు.
పేదల గుడిసెలకు పట్టాలివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES