భద్రతా నిబంధనలు ముందే తెలిసినా పట్టించుకోని వైనం
లాభాల పైనే దృష్టి.. సంసిద్ధతకు వెనుకడుగు
కఠినంగా వ్యవహరించని డీజీసీఏ
చివరకు ప్రయాణికులకే ఇబ్బందులు
బయటపడిన అంతర్గత సమస్యలు
దేశీయ విమానయాన రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఇండిగో.. ఏండ్లుగా నిర్మించుకున్న సమయపాలన, నమ్మకత్వ ప్రతిష్టను డిసెంబర్‌లో తానే సృష్టించుకున్న సంక్షోభంతో కోల్పోయింది. వందలాది విమానాల రద్దు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల అవస్థలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కొత్త భద్రతా నిబంధనలను నిర్లక్ష్యం చేయడం, సిబ్బంది కొరత, అతి దూకుడు షెడ్యూలింగ్.. ఈ మూడింటి కారణంగా ప్రయాణికులకు నరకాన్ని చూపించింది. మొత్తానికి డీజీసీఏ వంటి నియంత్రణ సంస్థ చర్యలకు వెనకాడటం, ఇండిగో నిర్లక్ష్యం ఫలితంగానే ఈ సంక్షోభం ఏర్పడిందని విశ్లేషకులు చెప్తున్నారు.
న్యూఢిల్లీ : భారత్‌లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో.. డిసెంబర్ మొదటివారం దేశవ్యాప్తంగా వందలాది విమానాలను రద్దు చేయడంతో తీవ్ర విమర్శలపాలైంది. దీంతో సంవత్సరాలుగా సంపాదించుకున్న విశ్వసనీయత క్షణాల్లోనే మట్టిలో కలిసిపోయింది. విమానాశ్రయాల్లో పిల్లలకు ఆహారం కోసం తిరిగే తల్లిదండ్రులు, నీటి కోసం తాపత్రయపడే తల్లులు, క్యూ లైన్లలో నిలబడలేని వృద్ధులు.. ఇలా ఈ దృశ్యాలు మొత్తం విమానయాన రంగాన్ని షాక్‌కు గురి చేశాయి.
సీఈఓ క్షమాపణలు.. డీజీసీఏ చర్యలు
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్.. పౌర విమానయాన మంత్రి ముందు చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన దృశ్యాలు వైరలయ్యాయి. మరోవైపు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తన వైఫల్యాన్ని అంగీకరిస్తూ ఇండిగో పర్యవేక్షణకు నియమించిన నలుగురు అధికారులను తొలగించింది. అంతేకాదు.. రోజువారీ విమానాల సంఖ్యను పది శాతం తగ్గించాలని ఆదేశించింది. 2006లో ప్రారంభమైన ఇండిగో.. దేశీయ మార్కెట్‌లో 64 శాతం వాటాను కలిగి ఉన్నది. 400కు పైగా విమానాలు, రోజుకు 2200-2300 విమాన సర్వీసులతో ‘వర్చువల్ మోనోపోలీ’గా ఎదిగింది. అయితే ఈ ఆధిపత్యమే సంక్షోభంలో పెద్ద బలహీనతగా మారింది. ఒక హబ్‌లో సమస్య వస్తే దేశమంతా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడింది.
కొత్త భద్రతా నియమాలే అసలు మలుపు
డీజీసీఏ 2024 జనవరిలో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌డీటీఎల్) నియమాలను సవరించింది. ఇందులో భాగంగా రాత్రి డ్యూటీ గంటల తగ్గింపు, విశ్రాంతి సమయం పెంపు, వారం, నెల పరిమితులు, అలసట కారణంగా పైలట్లు ఫ్లైట్ తిరస్కరించే హక్కులు వంటివి ఇందులో ఉన్నాయి. 2024 జూన్ 1లోపు వీటిని అమలు చేయాలని గడువు ఇచ్చింది. ఈ నియమాల అమలుకు ఇతర ఎయిర్‌లైన్స్ ముందుగానే సన్నద్ధమయ్యాయి. కానీ ఇండిగో మాత్రం అవసరమైనంత సంఖ్యలో పైలట్లను నియమించలేదు.
ఇతర ఎయిర్‌లైన్స్ అప్రమత్తం.. ఇండిగో నిర్లక్ష్యం
ఈ పతనం ఒక్కరోజులో జరగలేదనీ, పైలట్లపై ఒత్తిడి పెరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీతాల పెరుగుదల లేకపోవడం, ఉచిత ‘డెడ్‌హెడ్’ ఫ్లైట్స్ (భత్యం చెల్లించని ప్రయాణాలు), తీవ్రమైన ఒత్తిడి.. ఇవన్నీ సంస్థలో అసంతృప్తిని పెంచాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఇతర ఎయిర్‌లైన్స్ మాత్రం ముందుగానే అప్రమత్తం కావటంతో అవి ప్రభావితం కాలేదు. ఎయిర్ ఇండియా, ఆకాసా, స్పైస్‌జెట్ వంటి సంస్థలు.. షెడ్యూల్ తగ్గించటం, కొత్త పైలట్ల నియామకాన్ని వేగవంతం చేయటం, డేటా ఆధారిత ప్రణాళికలు అమలు చేయటం వంటివి చేశాయి. ఇండిగో మాత్రం తన ఆధిపత్యంపై ఆధారపడి నిర్లక్ష్యం చేసింది.
ఆధిపత్య సంస్థలను ప్రశ్నించేదవరు?
భద్రత-సామర్థ్యం అనే సన్నని రేఖపై విమానయానం నడుస్తోంది. ఇండిగోకు నిధులు ఉన్నప్పటికీ ఫిబ్రవరి నాటికి పూర్తి ఎఫ్‌డీటీఎల్ అమలు సాధ్యమా అనే సందేహాలు ఉన్నాయి. ఈ సంక్షోభం ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. భద్రతకు మించిన లాభాలు చివరికి నష్టానికి దారి తీస్తాయని చెప్తున్నది. ఇండిగో ఈ తుపాన్ నుంచి బయటపడగలదు.. కానీ దేశీయ విమానయాన భద్రతపై ఆధిపత్య సంస్థలను ఎవరు ప్రశ్నిస్తారు? అనేది అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ విషయంలో కేంద్రం తన నిర్లక్ష్య వైఖరిని వీడి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
కారణాలు ఎన్నో… బాధ్యత ఎవరిది?
ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. రాజకీయంగానూ ఇది తీవ్ర దుమారమే రేపింది. పార్లమెంటులో సైతం ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. కానీ కేంద్రం సమాధానమివ్వటానికి మాత్రమే పరిమితమైంది. దీంతో కేంద్రం తీరుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తిని రేపాయి. అయితే ఈ సంక్షోభానికి పలు కారణాలు వినిపించాయి. కొత్త సిబ్బంది రోస్టర్ విధానం సరిగ్గా అమలు చేయకపోవడం, రాత్రి విధులపై అమల్లోకి వచ్చిన కొత్త భద్రతా నియమాలకు ముందుగానే సిద్ధం కాకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ప్రభుత్వం, నియంత్రణ సంస్థలపై ఒత్తిడి తేవాలనే వ్యూహమా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ గందరగోళానికి అసలు కారణం తెలుసుకోవడానికి ఇండిగో బయటకు చెందిన విమానయాన నిపుణుడిని నియమించడం కూడా విమర్శలకు దారి తీసింది. ‘తప్పు ఎక్కడ జరిగిందో కంపెనీకే తెలియదా?’ అనే ప్రశ్నలు తలెత్తాయి.
డెడ్లీ డిసెంబర్.. దేశాన్ని కుదిపేసిన వారం
ఈ ఏడాది నవంబర్ చివరి నుంచి సమస్యలు పెరిగాయి. డిసెంబర్ 1న ఎఫ్‌డీటీఎల్ రెండో దశ అమలులోకి రాగానే ఇండిగో కొత్త రోస్టర్ అమలు చేయలేకపోయింది. దాదాపు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. డిసెంబర్ 5న ఒక్కరోజే సుమారు 1600 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి వరకు అన్ని బయలుదేరే సర్వీసులు నిలిచిపోయాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరుతో డీజీసీఏ ఇండిగోకు తాత్కాలిక మినహాయింపును ఇచ్చింది. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిని నిపుణులు కూడా తప్పుబట్టారు. ఢిల్లీ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.



