Thursday, October 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకరూర్‌ ఘటన విషాదకరం

కరూర్‌ ఘటన విషాదకరం

- Advertisement -

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారమివ్వాలి
చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలి
విజయ్ స్పందన, మోడీ ప్రభుత్వ తీరు బాధ్యతారాహిత్యమే : ఏఐఏడబ్ల్యూయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
బాధితులను ఆస్పత్రిలో పరామర్శించిన ఏఐఏడబ్ల్యూయూ బృందం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కరూర్‌ ఘటనలో మరణించిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఏఐఏడబ్ల్యూయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. చనిపోయిన వారికి చెందిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. బి.వెంకట్‌ నేతృత్వంలోని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం బృంద సభ్యులు బుధవారం తమిళనాడులోని కరూర్‌లో పర్యటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరూర్‌ ఘటన బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినీనటుడు విజయ్ ను చూడాలని కుటుంబాలకు కుటుంబాలే కరూర్‌కు వెళ్లాయనీ, విజయ్ ఆరేడు గంటలు ఆలస్యంగా రావడంతో అక్కడ ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు. అభిమాన నటుడుని దగ్గరగా చూడాలనే క్రమంలోనే సభకు వచ్చిన వారు ముందుకెళ్లే ప్రయత్నంలో తోపులాట జరిగిందన్నారు. రూ.2 లక్షల పరిహారం చెల్లించి మోడీ ప్రభుత్వం చేతులు దులుపుకోవడం దుర్మార్గమన్నారు.

తమిళనాడుకు చెందిన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల్‌ సీతారామన్‌ అదనంగా పైసా సహాయం ప్రకటించ కుండా మోడీ గారికి ఘటన గురించి వివరిస్తామని చెప్పటమేంటని ప్రశ్నించారు. కేంద్ర ఇంటిలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తుందని నిలదీశారు. ఇల్లు తగలబడి బాధపడుతుంటే బొగ్గులు ఏరుకునే చందంగా బీజేపీ తీరు ఉందని విమర్శించారు. శవాలపై రాజకీయం చేయడాన్ని తప్పుబట్టారు. ప్రతి కుటుంబానికి రూ. 50 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వటానికి విశ్వ గురుకు ఎవరు అడ్డుపడుతున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్రాల నిధులన్నీ కేంద్రం గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించడాన్నీ, విషాద, విపత్తుల సమయాల్లో రాష్ట్రాలకు నిధులు సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యమేనన్నారు. డీఎంకే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన సహాయంతో సరిపెట్టకూడదనీ, బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరూర్‌లో పర్యటించిన బృందంలో అమృత లింగం, సంగర్‌, జ్యోతిబసు తదితరులు ఉన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -