Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకొమురవెల్లి జాతరను ఘనంగా నిర్వహించాలి

కొమురవెల్లి జాతరను ఘనంగా నిర్వహించాలి

- Advertisement -

– డిసెంబర్‌ 14 నుంచి మార్చి 16 వరకు జాతర : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
– మల్లన్న జాతర,కల్యాణం పోస్టర్‌ రిలీజ్‌ చేసిన మంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

డిసెంబర్‌ 14న ప్రారంభమయ్యే కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనీ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మల్లన్న జాతర, కల్యాణం పోస్టర్‌ను మంత్రి సురేఖ రిలీజ్‌ చేశారు. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అందులో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హరీశ్‌, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌ హైమావతి, కొమురవెల్లి ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ..భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిసెంబర్‌ 14న ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున స్వామి కల్యాణం జరుగుతుందనీ, జనవరి 18 నుంచి మార్చి 16వ తేదీ వరకు(పది ఆదివారాల పాటు) జాతరను నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. కల్యాణవేదికను విశాలంగా తీర్చిదిద్దాలని సూచించారు. విగ్రహాలకు కిరీటాల తయారీ, దేవాలయ అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. నడిచే మార్గాల్లో మ్యాట్లు వేయాలనీ, వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ను సంపూర్ణంగా నిషేధించాలని ఆదేశించారు. ఒగ్గుకథ, జానపద కళారూపాలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక శాఖను ఆదేశించారు. భక్తులకు వైద్యసేవలను కూడా అందుబాటులో ఉంచాని సూచించారు.

మంత్రి సురేఖ అక్క మల్లన్న భక్తురాల్ణు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అక్క మల్లన్నస్వామి భక్తురాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఆమె జాతర సమయంలో మల్లన్న పట్నాలు వేసుకుంటూ తన భక్తిని స్వామివారి పట్ల ప్రదర్శిస్తారని గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -