Sunday, July 13, 2025
E-PAPER
Homeసమీక్షహైదరాబాద్‌ కార్మికోద్యమ దశ, దిశ మార్చిన కా|| ఎన్‌.వి.భాస్కర రావు

హైదరాబాద్‌ కార్మికోద్యమ దశ, దిశ మార్చిన కా|| ఎన్‌.వి.భాస్కర రావు

- Advertisement -

హైదరాబాద్‌ నగర సిపిఐ (ఎం), కార్మిక ఉద్యమ చరిత్ర తెలుసుకోవాలని అనుకునేవారు ఈ పుస్తకాన్ని కూలంకషంగా ఉద్యమ నిర్మాతగా ఎన్‌.వి.బి గా పిలుచుకునే నాదెళ్ళ విజయ భాస్కరరావు 1931 జనవరి 9న కష్ణా జిల్లా, చల్లపల్లికి దగ్గరగా ఉన్న నాదెళ్ల వారి పాలెం గ్రామంలో రంగయ్య, వెంకట నరసమ్మ దంపతులకు జన్మించారు. రంగయ్య సోదరుని దంపతులకు పిల్లలు లేని కారణంగా గారాబంగా పెంచారు. ఈ గ్రామ జనాభాలో సగం మంది కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో సుందరయ్య గారి నాయకత్వంలో పని చేస్తూ ఉండేవారు. మిగిలిన వారు కాంగ్రెస్‌ ప్రభావంతో చల్లపల్లి జమీందారు అనుయాయులుగా ఉండేవారు. ఎన్‌.వి.బి చిన్నవయసులోనే తండ్రి చనిపోయారు. తల్లి ఆయనని పెంచి పెద్ద చేశారు. తల్లికి కొడుకు ఇంజనీరింగ్‌ చదవాలని ఉండేది. కానీ పార్టీ కార్యక్రమాలకు ఆటంకం కాకూడదని బీకాం (ఆర్ట్స్‌) తీసుకున్నారు. విద్యార్థి ఉద్యమ కార్యకలాపాల్లో పాల్గొంటూ తల్లిని కూడా ఒప్పించి, తనతో పాటుగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 16 సంవత్సరాల వయసులోనే, అజ్ఞాతవాసంలో ఉన్న సుందరయ్య గారికి, ఇతర నాయకులకు రహస్య కేంద్రం బాధ్యులు (డెన్‌ కీపర్‌), కొరియర్‌ గాను నిర్వహించారు. ఈ పనిలో ఎన్‌.వి.బి తో పాటు అనంత రెడ్డి (అడ్వకేట్‌), వి. హనుమంతరావు (జర్నలిస్టు) పనిచేశారు. స్వాతంత్య్రానంతరం కమ్యూనిస్టు ఉద్యమం అత్యంత తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. 1948 – 49లో కష్ణ, గుంటూరు జిల్లాలలోని చాలా గ్రామాలలో నిర్బంధం ఎక్కువగా ఉండేది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్‌.వి.బి కమ్యూనిస్టు పార్టీకి తన పూర్తి కాలాన్ని వినియోగించి కష్టాలను భరించటానికి సాహసించారు. తనతో పాటు తన తల్లిని కూడా పార్టీకి సంబంధించిన ‘కమ్యూన్‌’ (సామూహిక వంటశాల) బాధ్యతలలో పాలుపంచుకునేలా చేశారు. ఎన్‌.వి.బి వివాహం సక్కుబాయితో 1954 మే 9 న వందపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో, దండమూరి సుబ్బారావు, భిక్షావతి గార్ల సమక్షంలో జరిగింది. ఎన్‌.వి.బి, సక్కుబాయిలకు శ్యామల, నిర్మల, ప్రమీల అనే ముగ్గురు కూతుళ్ళు జన్మించారు. సక్కుబాయితో సహా కుటుంబసభ్యులందరినీ పార్టీ కార్యక్రమాలలో పనిచేసేట్లుగా ప్రోత్సహించారు.
విజయవాడలో పార్టీ ఆఫీసు కార్యదర్శిగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి మారినందువలన హైదరాబాదులో ఆఫీసు కార్యదర్శిగా పనిచేశారు. కమ్యూనిస్టు సిద్ధాంత సమస్యలపై 1964 లో సిపిఐ, సీపీఎంగా, తరువాత 1968లో సీపీఐ (ఎం) నుండి నక్సలైట్లుగా చీలికలు ఏర్పడటం జరిగింది. అలాంటి క్లిష్ట సమయంలో ఎన్‌.వి.బి హైదరాబాద్‌ నగరంలో పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి, ప్రజాతంత్ర ఉద్యమ విస్తరణకు బలమైన కార్మికోద్యమ నిర్మాణానికి ప్రజాస్వామ్య పౌర హక్కులపై నగరంలో విశిష్టమైన కషిని చేసి అనేక ఫలితాలను సాధించారు. సుందరయ్య గైడెన్స్‌లో ఎన్‌.వి.బి కార్యదర్శిగా, లక్ష్మిదాస్‌ రామిరెడ్డిలతో హైదరాబాద్‌ నగర కమిటీ ఏర్పడింది. ఎన్‌.వి.బి కషితో విద్యార్థి రంగంలో, కార్మిక రంగంలో పబ్లిక్‌ సెక్టార్స్‌, ప్రైవేట్‌ పరిశ్రమలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలలో బ్యాంకు, ఇన్సూరెన్స్‌, ఉపాధ్యాయ, మొదలగు మధ్య తరగతి ఉద్యమాల నిర్మాణంలో కషి జరిగింది. ఫలితంగా పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలయిన బి.హెచ్‌.ఈ.ఎల్‌, బి.హెచ్‌.ఈ.ఎల్‌ (ఆర్‌ డ బి), ఐ.డి.పి.ఎల్‌, ఆల్విన్‌, ఈ.సీ.ఐ.ఎల్‌, హెచ్‌.ఎం.టీ, హెచ్‌.సి.ఎల్‌. మొదలైన సంస్థలలో కార్మిక ఉద్యమ నిర్మాణం జరిగింది.
ప్రైవేట్‌ రంగంలో అతి పెద్ద పరిశ్రమలైన యునిశాంకో, బయోలాజికల్‌ ఈవాన్స్‌లలో కూడా ఉద్యమ నిర్మాణంలో ఎన్‌.వి.బి పాత్ర మరువలేనిది. అంతేకాకుండా పట్టణ నివాస ప్రాంతల్లో విద్యార్ధి యువజన మహిళా సంఘాల నిర్మాణంతో పాటు భవన నిర్మాణ కార్మికులు హెరీటల్‌, షాపులు, ఆటో, ఆర్‌.టీ.సీలలో కార్మికులను సంఘటితం చేయటంలో ప్రణాళికాబద్ధమైన కషిని చేసి, తలపండిన ఐ ఎన్‌ టీ యూ సి, హెచ్‌ ఎం ఎస్‌, ఏ.ఐ.టి.యు.సి నాయకులను ఎదుర్కోవడానికి కార్మికోద్యమాన్ని పరిరక్షించుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి.
కార్యకర్తలకు నిరంతరం రాజకీయ శిక్షణ ఇవ్వడం ద్వారా అనేక ఉద్యమాల నిర్మాణ కషి జరిగింది. దీని ఫలితంగానే హైదరాబాద్‌ జీ.హెచ్‌.ఎం.సి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కాప్రా, జహీరాబాద్‌, సంగారెడ్డి లాంటి మున్సిపల్‌ వార్డుల లలో పార్టీ అభ్యర్థులు గెలిచారు.
ఇండియా, చైనా యుద్ధ సమయంలో పార్టీ అగ్రనాయకులతో పాటు ఎన్‌.వి.బి అరెస్టయి ముషీరాబాద్‌ జైలులో ఉన్నారు. జైలులో ఉన్న కాలంలోనే తన ‘లా’ డిగ్రీ పొందారు. లాయర్‌గా ప్రాక్టీస్‌ చెయ్యాలనుకున్నా సుందరయ్య సలహాతో దానిని విరమించుకుని, తన జ్ఞానాన్ని, అనుభవాన్ని కార్మిక సమస్యల పరిష్కారం కొరకు ఎనలేని కషి చేశారు.
ప్రజాశక్తి దినపత్రికను క్రమం తప్పకుండా పాఠకులకు అందించటానికి సుదూర ప్రాంతాలైన గగన్‌ పహాడ్‌ నుండి మొదలుపెట్టి, పటాన్‌ చెరువు, ఈ.సి.ఐ.ఎల్‌, లాంటి ప్రాంతాలకు కూడా అందేటట్లు చేసిన కషి ఆదర్శవంతమైనది.
1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతాపార్టీతో పొత్తులో భాగంగా సనత్‌ నగర్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి, 1760 ఓట్లతో ఓడిపోయారు. 1981 తరువాత ఎన్‌.వి.బి తీవ్ర అస్వస్థతకు గురైనారు. అయినప్పటికీ నగర కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూనే 1984 అక్టోబర్‌లో చనిపోయారు.
హైదరాబాద్‌ నగర పార్టీ కార్మికోద్యమ నిర్మాణ దశా దిశలు తెలుసుకోవడానికి నవ తెలంగాణ ప్రచురించిన ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.

  • డి. జి. నరసింహారావు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -