దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలకు అదే దిశానిర్దేశం
ఆయన వందేండ్ల జీవితం స్ఫూర్తిదాయకం : వీఎస్ అచ్యుతానందన్ సంతాప సభలో వక్తలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) సీనియర్ నేతల వీఎస్ అచ్యుతానందన్ జీవితాన్ని పోరాటంగా మార్చుకున్నారని వక్తలు అన్నారు. ఆయన పోరాటానికి నాయకత్వం వహించిన పాలకుడని కొనియాడారు. బుధవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో వీఎస్ సంతాప సభ నిర్వహించారు. తొలుత ఆయన చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా కమ్యూనిస్టు ఉద్యమానికి వీఎస్ చేసిన కృషిని, అట్టడుగు వర్గాల కోసం ఆయన చేసిన అచంచల పోరాటాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. కార్మికులు, పార్టీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీఎస్ పోరాటం కొనసాగించిన నాయకుడని అన్నారు. పేదరికంతో బాధపడుతున్న జీవన పరిస్థితులతో పోరాడి కార్మిక వర్గం నుంచి ఉద్భవించిన కార్మిక నాయకుడు వీఎస్ అని కొనియాడారు. ఆయన ఏడో తరగతి వరకు చదువుకున్నట్టు అధికారికంగా ఉన్నప్పటికీ, విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రజాదరణ పొందిన సమస్యలు, పోరాటాల గురించి ఆయనకు అవగాహన ఉందని గుర్తు చేశారు. ఆయన కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పాఠశాల విద్య, ఐటీ రంగాలకు విజయాలు తీసుకువచ్చారని అన్నారు. అదే సమయంలో అన్యాయం జరిగిన చోట, ప్రజా సమస్యలను లేవనెత్తిన చోట, వీఎస్ ఎర్ర జెండాతో ఉండేవారని పేర్కొన్నారు. ఆయనలాంటి కమ్యూనిస్టును మళ్లీ కనుగొనడం అసాధ్యమని అన్నారు.
దేశంలో కమ్యూనిస్టు పోరాటాలకు వీఎస్ ఒక దిశానిర్దేశం
దేశంలో కమ్యూనిస్టు పోరాటాలకు వీఎస్ ఒక దిశానిర్దేశం చేశారని సీపీఐ(ఎం) సీనియర్ నేత ప్రకాశ్ కరత్ గుర్తు చేసుకున్నారు. పార్టీ కమిటీలు, పరిపాలనా స్థాయిలో తన నిర్ణయాలలో ఆయన ధృఢంగా ఉన్నారని అన్నారు. మార్క్సిస్ట్, లెనినిస్ట్ సూత్రాలపై ఆయనకు ధృఢ విశ్వాసం ఉందని, ధృఢ సంకల్పంతో తన వైఖరిని ప్రకటించారన్నారు. కేరళలోని శ్రామిక ప్రజలకు వీఎస్ ఎలా ప్రియమైన నేతో ప్రతి కమ్యూనిస్టు గుర్తుంచుకోవాలని, ఆయన ప్రతిపాదించిన ఉన్నత విలువలను అనుసరించాలని ప్రకాశ్ కరత్ అన్నారు.
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజ్జూ కృష్ణన్ మాట్లాడుతూ పోరాటాలు, పార్టీ పనిలో వీఎస్ ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేసుకున్నారు. వీఎస్ తన వందేండ్ల జీవితంలో 90 శాతం ప్రజా పోరాటాలకు అంకితం చేశారని అన్నారు. వీఎస్ పోరాట స్ఫూర్తి తన చివరి ప్రయాణంలో తనతో పాటు వచ్చిన యువత, విద్యార్థుల ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. మహిళల భద్రత కోసం చేసిన ఆయన చేసిన కృషిని పొలిట్‌బ్యూరో సభ్యురాలు మరియం ధావ్లే గుర్తు చేశారు. మహిళా పక్షపాతిగా, మహిళా సాధికారిత కోసం పరితపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, నీలోత్పల్ బసు, ఆర్. అరుణ్ కుమార్, అమ్రా రామ్, కేంద్ర కమిటీ సభ్యుడు అనురాగ్ సక్సేనా, సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్, సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజారాం సింగ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నాయకులు, రైతు, కార్మిక సంఘాల నాయకులు వీఎస్‌కు తుది నివాళులర్పించారు.
వీఎస్ జీవితమే పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES