బంగారం ధరల పెరుగుదలతో తగ్గిన ఉపాధి
సామాన్యుల కొనుగోలు శక్తి మీదే వారి జీవనాధారం
బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల తయారీలో స్వర్ణకారులది అందెవేసిన చేయి. ఆధునిక యుగంలో కంప్యూటర్‌లు సైతం తయారు చేయలేని డిజైన్‌లు చేయడంలో నేర్పరులు. అలాంటి స్వర్ణకారులు నేడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సామాన్యులు ఎంత బంగారం కొనుగోలు చేస్తే వారికి అంత ఉపాధి. కానీ ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలకు సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. బంగారం కొనుగోలు చేయాలంటేనే జంకుతున్నారు. దీంతో స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయి. వృత్తి పేరులో ‘స్వర్ణం’ ఉన్నా వీరి బతుకులు మాత్రం దుర్భరంగా మారుతున్నాయి. దీనికి తోడు ఈ పని చేస్తున్న వారికి పిల్లనివ్వకపోవడంతో ఈ వృత్తిలోకి కొత్తతరం రాలేకపోతోంది.
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల మంది స్వర్ణకారులు ఉండొచ్చని అంచ నా. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుమారు 600 మంది వరకు స్వర్ణకారులు పనిచేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో 200 దుకాణాలు ఉండగా.. 300 మంది వరకు ఈ వృత్తిని నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నా రు. ఒక వైపు బడా షోరూంల రెడీమేడ్ నగలు, మరో వైపు కంప్యూటరైజ్డ్ మోడల్స్‌తోపాటు 1 గ్రామ్ రోల్డ్‌గోల్డ్ ఆభరణాలతో ఉపాధి తగ్గుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా బంగారం ధరలు పెరిగిపోతుండటంతో స్వర్ణకారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
సామాన్యుల కొనుగోలు శక్తే కులవృత్తులకు ఊతం
సాధారణంగా సామాన్య ప్రజల కొనుగోలు శక్తి మీదే ప్రధానంగా కులవృత్తుల వారు ఆధారపడి జీవిస్తుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు రాకెట్ వేగంగా దూసుకుపోతుండటంతో సామాన్యులు బంగారం అంటేనే హడలిపోతున్నారు. వారు కొనలేకపోవడంతో ఆభరణాల తయారీకి గిరాకీ లేకుండా పోతోంది. డబ్బులున్న వారు కొనుగోలు చేస్తున్నా.. ఆభరణాలు చేయించుకోకుండా బిస్కెట్ రూపంలోనే దాచుకుంటున్నారు. దీంతో వీరికి ఉపాధి లేక బిక్కుబిక్కుమంటున్నారు.
మాసంలోనే పుస్తెలు.. గుర్జకు సైతం లెక్కే..
సాధారణంగా మధ్యతరగతి వారు పుస్తెలు చేయించుకునేందుకు మాసంన్నర (గ్రామున్నర) బంగారం కొనుగోలు చేస్తుండే వారు. కానీ ప్రస్తుత ధరలతో మాసం (గ్రాము) కొనుగోలుతోనే సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. గతంలో ఆభరణం తయారు చేసి ఇచ్చే క్రమంలో గుర్జ (మాసంలో పదోవంతు) ఎక్కువ తక్కువ అయినా స్వర్ణకారులు పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క గుర్జకు రూ.1300 ఉండటంతో అదీ లెక్కల్లో చేరింది. నిన్న ఉన్న రేటు ఈరోజు ఉండకపోవడంతో.. ఆభరణాలు తయారు చేసి ఇచ్చే క్రమంలో బంగారం ధర వ్యత్యాసం ప్రకారం ధర కట్టించేందుకు కస్టమర్‌లు ఒప్పుకునే పరిస్థితి లేకుండా పోతోంది. ఆభరణం తయారు చేసే క్రమంలో ఇచ్చిన బంగారం కంటే ఒకటి, రెండు గ్రాముల బంగారం ఎక్కువ కావొచ్చు.. తక్కువ కావొచ్చు. కానీ ధరల వ్యత్యాసంతో వినియోగదారులు స్వర్ణకారులతో లొల్లికి దిగే పరిస్థితి తలెత్తింది.
పెండ్లికి పిల్లనిస్తలే.. కొత్త తరం రావట్లే..
ఓ పక్క బంగారు ఆభరణాల విక్రయ దుకాణాలు పెరుగుతుండటం, మరోవైపు బంగారం ధర పెరుగు తుండడంతో స్వర్ణకారులు ఉపాధి లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ కులవృత్తి చేసే వారికి పెండ్లికి పిల్లనివ్వలేని పరిస్థితి నెలకొంది. కులవృత్తిని వదిలి ఇతర పనుల వైపు మొగ్గు చూపే పరిస్థితి తలెత్తింది. కొత్త తరం ఈ వృత్తిలోకి రాలేకపోతోంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి ఈ వృత్తి చేపడుతుండటం గమనార్హం. బెంగాల్ నుంచి వచ్చి నిజామాబాద్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి.. వ్యాపారుల బంగారంతో ఉడాయించినట్టు సమాచారం.
సామాన్యుల చేతిలో కులవృత్తుల మనుగడ
సామాన్యుల చేతిలో కులవృత్తుల మనుగడ ఉంటుంది. కానీ ఇప్పుడు బంగారం ధర అందనంత ఎత్తులో ఉండటంతో సామాన్యులు బంగారం కొనుగోలుకు దూరమయ్యారు. ఫలితంగా మాకు ఉపాధి లేకుండా పోతోంది. ఈ వృత్తిలో పాత వారిమే నెట్టుకొస్తున్నాం కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా పని నేర్చుకొని వచ్చే వారికి చాలా కష్టంగా ఉంది. మా వృత్తిలో ఉన్న వారికి పెండ్లికి పిల్లను కూడా ఇస్తలేరు.
మర్కంటి పి.శ్రీనివాస్, స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు, కామారెడ్డి