Wednesday, July 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎవ్వరికీ పట్టని వలస బతుకులు

ఎవ్వరికీ పట్టని వలస బతుకులు

- Advertisement -

ప్రమాదాల్లో చనిపోతున్నది వారే యాజమాన్యాలు, కార్మిక శాఖల వద్ద రికార్డులు కరువు
చనిపోయినప్పుడే హడావిడి.. ఆ తర్వాత దాటవేత ధోరణి
లైసెన్స్‌డ్‌ కాంట్రాక్టర్లు తీసుకొచ్చేది అరకొరే
పరిశ్రమలు, భవన నిర్మాణ రంగంలో కట్టుబానిసలుగా వలస కార్మికులు

సిగాచి కంపెనీలో భారీ విస్ఫోటన ప్రమాదం…ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటన…ముషీరాబాద్‌ షామిల్లు అగ్నిప్రమాదం…రంగారెడ్డి జిల్లాలో సౌత్‌గ్లాస్‌ కంపెనీలో రియాక్టర్‌ పేలిన ఘటన…ఇలా ప్రమాదం ఏదైనా సరే అందులో చనిపోయిన వారు ఎక్కువగా వలస కార్మికులే ఉంటున్నారు. చనిపోయిన వారి వివరాలు ఇటు యాజమాన్యాల వద్దగానీ, అటు కార్మిక శాఖ వద్దగానీ లేకపోవడంతో మృతదేహాల గుర్తింపు…వారిది ఏ ప్రాంతం? కుటుంబ సభ్యులెవరు? ఇలా గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెద్ద ప్రమాదాలైతే బయటపడుతున్నాయిగానీ…ఒకరిద్దరు చనిపోతే శవాలను సైతం యాజమాన్యాలు మాయం చేస్తోన్న పరిస్థితి నెలకొంది. తక్కువ వేతనాలు చెల్లించి అన్‌స్కిల్డ్‌ వర్కర్లతో పనిచేయించి ఎక్కువ లాభాలు సంపాదించాలనే యాజమాన్యాల దుర్బుద్ధి పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొంటున్నది. దీనంతటికీ అంతర్‌రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979 సరిగా అమలు కాకపోవడమేనని స్పష్టమవుతున్నది. ఈ చట్టాన్ని ఇప్పటికైనా పకడ్బందీగా అమలు చేయాలనే డిమాండ్‌ కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్నది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంతర్‌రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979 కార్మికుల సంక్షేమం, పనిప్రదేశాల్లో వారి రక్షణ కోసం ఉద్దేశించబడింది. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది వలస కార్మికులు పనిచేసే పరిశ్రమల్లో ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలనే నిబంధన ఉంది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలసెళ్లె వారిని వలస కార్మికునిగా గుర్తించాలి. లైసెన్స్డ్‌ కాంట్రాక్టర్లు గానీ, నేరుగా యజమానులుగానీ వలస కార్మికులను తీసుకురావొచ్చు. అయితే, అలా చేసేవారు కచ్చితంగా కార్మిక శాఖ వద్ద రిజిస్ట్రర్‌ చేయించాలి. కాంట్రాక్టు కార్మికుల వివరాలను కార్మిక శాఖకు సమర్పించాలి.

లైసెన్స్‌ పొందిన కాంట్రాక్టర్లు ప్రతి వలస కార్మికుడికి పాస్‌బుక్కు ఇవ్వాలి. సెక్షన్‌ 12 ప్రకారం కార్మికుని పేరు, ఫొటో, అడ్రస్‌, పనిచేసే ప్రదేశం, ఎంత కాలం పనిచేస్తారు? వేతనమెంత? ఇతర అలవెన్స్‌ వివరాలేంటి? తదితరాలను పాస్‌బుక్కులో నమోదు చేయాలి. అలాంటి వివరాలతో కూడిన రిపోర్టు కార్మిక శాఖ వద్ద కూడా ఉండాలి. పనిప్రదేశాల్లో వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి. చట్టం ప్రకారం సమానపనికి సమాన వేతనం చెల్లించాలి. వేతనం చెల్లింపులో ఎలాంటి మిన హాయింపులు ఇవ్వకూడదు. తీసుకొచ్చిన, పని చేయించు కుంటున్న వలస కార్మికులకు వసతి, తాగునీటి సౌకర్యం, వైద్య సౌకర్యాలు అందేలా చూడాలి. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి. వలస కార్మికులు స్వస్థలాలకు పోవడానికి, తిరిగి రావడానికి నెల వేతనంలో సగం జీతాన్ని బోనస్‌గా ఇవ్వాలి. వలస కార్మికుల పిల్లల సంరక్షణకు క్రెచ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి.


వాస్తవ పరిస్థితి మరోలా…
ఇందులో ఒక్కటి కూడా అమలు కావడంలేదు. గమ్మత్తేంటంటే కార్మిక శాఖ వద్ద కూడా వలస కార్మికులున్నారనే వివరాలు లేకపోవడం గమనార్హం. వలస కార్మికులు ఎక్కువగా పరిశ్రమలు, భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తామని తీసుకొచ్చి ఇక్కడ నెలకు ఏడెనిమిది వేలకు మించి ఇవ్వడం లేదు. ఒక్కో రూమ్‌లో ఐదారుగురు కార్మికులు, కొన్ని చోట్ల పదిమంది కూడా ఉంటున్న దుస్థితి. ఆ గదులకు కూడా యాజమాన్యాలు అద్దె వసూలు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి.

వారిని పరిశ్రమల నుంచి బయటకు కూడా వెళ్లనీయకుండా రోజుకు 12 నుంచి 14 గంటల పాటు బానిసలుగా పనిచేయిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నా పాలకుల అండదండలున్న యాజమాన్యాల ఒత్తిడితో కార్మిక శాఖ తనకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నది. రికార్డులు లేకపోవడంతో ఏ రాష్ట్ర్ర కార్మికుడు చనిపోయారు? అనే విషయంలో స్పష్టత రావడం లేదు. చట్టం ప్రకారం గాయపడ్డ, చనిపోయిన వారి సమాచారాన్ని వెంటనే కార్మికుల కుటుంబాలకు అందజేయాలి. సిగాచి ప్రమాద ఘటననే తీసుకుంటే చనిపోయిన వారిలో ఎక్కువగా యూపీ, జార్ఖండ్‌, బీహార్‌, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారున్నారని ప్రచారం జరుగుతున్నది. విధుల్లో ఉన్నవారి వివరాలను, అక్కడ ఎంత మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు?

ఎంత మంది సేఫ్‌గా బయటకు వచ్చారు? మిగతా వారెవ్వరు? ఇలాంటి వివరాలు లేని పరిస్థితి. తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడని బాధిత కుటుంబాలు అక్కడకెళ్లి మొరపెట్టుకున్నా అధికారులు స్పందించని పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపించింది. పెద్ద ఘటనలు మినహా చాలా సందర్భాల్లో యాజమాన్యాలు చనిపోయిన కార్మికుల వివరాలను వెల్లడించకుండా గోప్యతను పాటిస్తున్నాయి. 1979 వలస కార్మికుల చట్టం ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ప్రమాదాల సందర్భంగా చనిపోయిన, గాయపడ్డ కార్మికులకు ఎక్కువ సమయాల్లో నష్టపరిహారం అందట్లేదు. భవన నిర్మాణ రంగంలో అయితే వలస కార్మికులతో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరేడు గంటల వరకు కట్టుబానిసలుగా పనిచేయిస్తున్న పరిస్థితి. అంతచేసినా వారికి రోజుకు ముడుతున్నది రూ.500 లోపే. వలస కార్మికులు ఒత్తిడి తట్టుకోలేక వెళ్లిపోతారనే ఆలోచనలతో వారి ఆధార్‌కార్డులను, ఇతర గుర్తింపు కార్డులను బిల్డర్లు, కాంట్రాక్టర్లు లాక్కుంటున్న పరిస్థితి అడుగడుగునా కనిపిస్తున్నది.


వేల పరిశ్రమలున్నా..వలస కార్మిక చట్టం అమలేది? భూపాల్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
హైదరాబాద్‌ చుట్టూ చిన్న, మధ్య, పెద్ద పరిశ్రమలు పదివేలకుపైగా ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో ఆరేడు లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో 60 నుంచి 70 శాతం మంది వలస కార్మికులే ఉంటున్నారు. ఆ పరిశ్రమల్లో వలస కార్మికుల ప్రాణాలకు విలువ లేదు. వారి సంక్షేమాన్ని చూడాల్సిన కార్మిక శాఖ పాత్ర పూర్తిగా నిస్తేజంగా మారింది. కరోనా కాలంలో వలస కార్మికులు పడ్డ గోస అంతా ఇంతాకాదు. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు, సుప్రీం కోర్టులు వలస కార్మికుల వివరాలు అడిగినా ఇవ్వలేని స్థితిలో కార్మిక శాఖ ఉంది. ప్రభుత్వాల అండ ఉండటం వల్ల ఎన్ని ప్రమాదాలు జరిగినా యాజమాన్యాలు భయపడటం లేదు. వలస కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన సౌకర్యాలు, అమలు చేయడం లేదు. ఫ్యాక్ట రీల డిపార్ట్‌మెంట్‌ తనిఖీలు చేయకపోవడమే ప్రమాదాలకు కారణం. చట్టాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. పరిశ్రమలు, కార్మికశాఖల ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌లు పెట్టాలి. లోపాలున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. మేనేజ్‌మెంట్లపై క్రిమినల్‌ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే సిగాచి లాంటి ప్రమాదాలను అరికట్టవచ్చు.


సౌకర్యాలూ అంతంతే..
పనిప్రదేశాల్లో వలస కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఈ బాధ్యత కంపెనీ యాజమాని, కాంట్రాక్టర్లదే. వాటికి సంబంధించి చూసుకున్నప్పుడు వారి నివాసం, ఉచిత వైద్యం, బట్టలు, తదితర సౌకర్యాలు కల్పించాలి. ఇవేవీ కాంట్రాక్టర్లు, యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అలాగే, వేతనాలు, ఇతర కార్మికులతో సమానంగా ఇవ్వాలి. సమానపనికి సమాన వేతనం అమలు చేయాలి. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వచ్చే క్రమంలో, పోయే క్రమంలో అలవెన్స్‌లు (జీతంలో 50 శాతం) ఇవ్వాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -